Share News

డీసీసీబీపై విచారణాధికారిగా జేసీ

ABN , Publish Date - Jun 28 , 2026 | 02:57 AM

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)పై సెక్షన్‌ 51 విచారణాధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి నియమితులయ్యారు. ఆ మేరకు సహకార శాఖ ఉన్నతాధికారులు తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విషయంలో దాదాపు మూడు మాసాలకుపైగా పలు స్థాయిల్లో తర్జనభర్జనలు జరిగాయి. ఎట్టకేలకు కీలక అధికారికి విచారణ బాధ్యతలు అప్పగించారు.

డీసీసీబీపై విచారణాధికారిగా జేసీ
ఒంగోలులోని డీసీసీబీ బ్యాంకు

సెక్షన్‌ 51 విచారణాధికారి బాధ్యతల నుంచి గతంలో గౌరీశంకర్‌ తొలగింపు

తర్జనభర్జనల అనంతరం తాజాగా కల్పనాకుమారి నియామకం

ఒంగోలు, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)పై సెక్షన్‌ 51 విచారణాధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి నియమితులయ్యారు. ఆ మేరకు సహకార శాఖ ఉన్నతాధికారులు తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విషయంలో దాదాపు మూడు మాసాలకుపైగా పలు స్థాయిల్లో తర్జనభర్జనలు జరిగాయి. ఎట్టకేలకు కీలక అధికారికి విచారణ బాధ్యతలు అప్పగించారు. దాదాపు ఏడాదిన్నరగా డీసీసీబీపై సెక్షన్‌ 51 విచారణ ప్రహసనంలా సాగుతూ వస్తోంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబునాయుడును ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ కలిసి.. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో డీసీసీబీలో అనేక అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదు చేశారు. మరికొందరు నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. తనకు అందిన ఫిర్యాదులను జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్‌ స్వామి కూడా సీఎంవో దృష్టికి తీసుకెళ్లారు. తదనుగుణంగా ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలతో నాటి కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా బ్యాంకులో అప్పటి డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ద్వారా విచారణ చేయించడం, అందులో అనేక అక్రమాలను గుర్తించడం తెలిసిందే. తదనుగుణంగా సెక్షన్‌ 51 విచారణకు 2024 నవంబరులో అప్పటి కలెక్టర్‌ అన్సారియా ప్రభుత్వానికి నివేదించారు. ఇక అక్కడ నుంచి విచారణ ముందుకు పోకుండా సహకార శాఖలోని ఉన్నత స్థాయి అధికారులు కొందరు, బ్యాంకులో అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు మరికొందరు ఆటంకాలు కలిగిస్తూ వచ్చారు. అలా సెక్షన్‌ 51 విచారణ జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు 2025 ఆగస్టులో సహకారశాఖ అడిషనల్‌ కమిషనర్‌గా ఉన్న గౌరీశంకర్‌ను విచారణాధికారిగా నియమించి నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అయితే ఆ నాలుగు నెలలు కాక మరో రెండు నెలలు గడువు పొడిగించినా విచారణ పది శాతం కూడా ముందుకు పోలేదు. అదేసమయంలో కొందరు విచారణాధికారిగా గౌరీశంకర్‌ను తొలగించాలని హైకోర్టును ఆశ్రయించారు. అలా అతనిని తొలగించిన ఉన్నతాధికారులు నిబద్ధత కలిగిన మరొక అధికారిని నియామకం చేసి విచారణ చేయించాలని కలెక్టర్‌కు సూచించారు. ఆ ఉత్తర్వులు మార్చిలో ఇవ్వగా జిల్లాలోని సహకారశాఖ అధికారులు స్థానిక ఆ శాఖ లేదా, మరోశాఖకు చెందిన సీనియర్‌ అధికారుల పేర్లను సూచించకుండా పొరుగు జిల్లా సహకార శాఖ అధికారుల పేర్లను కలెక్టర్‌కు సూచించారు. ఆ జిల్లా కలెక్టర్ల అనుమతుల కోసం లేఖలు రాశారు. అందుకు ఆ జిల్లా కలెక్టర్లు అంగీకారం తెలపలేదు. దీంతో కాలయాపన జరిగిపోయింది. సకాలంలో విచారణ పూర్తిచేయకపోవడాన్ని ప్రస్తుత సహకారశాఖ కమిషనర్‌ ఏప్రిల్‌ ఆఖరులో కలెక్టర్‌కు లేఖ రాశారు. దీంతో జిల్లాలో తగు అధికారి లేనందున మీరే ఒక అధికారిని నియామకం చేయండంటూ కలెక్టర్‌ తిరుగు లేఖ రాశారు. దీనిపై కమిషనర్‌ స్పందిస్తూ జిల్లా సహకారశాఖ లేదా మరో అధికారిని నియమించాలని సూచించారు. అలా నియమించేందుకు కూడా తగు అధికారి అందుబాటులో లేరని, కనుక ప్రభుత్వం నుంచే ఉత్తర్వులు ఇవ్వాలంటూ తిరిగి కలెక్టర్‌ రాజాబాబు గత నెలాఖరులో సహకారశాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. అలా లేఖలపై లేఖలు కిందికిపైకి తిరుగుతుండటంతో ఇక డీసీసీబీలో విచారణ అటకెక్కినట్లే అన్న విమర్శలు పెరిగాయి. ఈ నేపథ్యంలో జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారికి ఈ విచారణ బాధ్యతలు అప్పగిస్తూ తాజాగా ఉన్నతాధికారులు నిర్ణయించి ఆ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం జిల్లాల పునర్విభజన జరగడంతో డీసీసీబీ పరిధిలోని ప్రాంతాలు మూడు జిల్లాల్లోకి వెళ్లాయి. దీంతో జేసీ నిర్వహించే విచారణకు అన్నివిధాలా సహాయకారులుగా పనిచేయాలని ప్రకాశం, మార్కాపురం, బాపట్ల జిల్లాల సహకారశాఖ అధికారులను కూడా ఆ ఉత్తర్వులలో ఆదేశించినట్లు సమాచారం. విచారణాధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి నియామకం విషయం తెలిసి బ్యాంకులో అక్రమాలకు పాల్పడిన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. అయితే నాటి అక్రమాలలో భాగస్వామ్యం ఉన్న వారే ప్రస్తుతం డీసీసీబీ పాలనా వ్యవహారాల్లో కీలకంగా ఉంటున్నారన్న ఆరోపణలు నేపఽథ్యంలో జేసీ విచారణ ఏ మేరకు పారదర్శకంగా సాగుతుందనేది వేచి చూడాల్సిందే.

Updated Date - Jun 28 , 2026 | 02:57 AM