Share News

జలధార సిద్ధం

ABN , Publish Date - Apr 29 , 2026 | 03:09 AM

జల సంరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వేసవిలో చేపట్టిన జలధార - జలహారతి పథకం ప్రక్రియ జిల్లాలో వేగవంతమవుతోంది. ఈనెల 6 నుంచి మే 14 వరకు వంద రోజులపాటు ఈ కార్యక్ర మాన్ని నిర్ధిష్ట ప్రణాళికతో ప్రభుత్వం చేపట్టింది.

జలధార సిద్ధం
వల్లూరు చెరువు కాలువను పరిశీలిస్తున్న డ్వామా, ఇరిగేషన్‌ సిబ్బంది (ఫైల్‌)

పూర్తయిన గుర్తింపు ప్రక్రియ

395 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులు, వాటి అనుబంధ కాలువల్లో పనులు

మొత్తం 9 కేటగిరీలుగా విభజన

కూలీలతో పూడికతీతకు ప్రణాళిక

ఇప్పటికే రూ.65 కోట్ల విలువైన 1,373 పనులు మంజూరు

ఒంగోలు, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): జల సంరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వేసవిలో చేపట్టిన జలధార - జలహారతి పథకం ప్రక్రియ జిల్లాలో వేగవంతమవుతోంది. ఈనెల 6 నుంచి మే 14 వరకు వంద రోజులపాటు ఈ కార్యక్ర మాన్ని నిర్ధిష్ట ప్రణాళికతో ప్రభుత్వం చేపట్టింది. ఆ ప్రకారం తొలి పది రోజులు పనులను గుర్తించాల్సి ఉంది. తర్వాత వారంరోజులు అంచనాలు రూపొందించాలి. అనంతరం కలెక్టర్ల నుంచి అనుమతులు పొంది 80రోజుల్లో పనులు పూర్తిచేయాలి. దీంతో జిల్లాలో ఇటు జలవన రుల శాఖ, అటు డ్వామా సిబ్బంది ఈ కార్యక్ర మంలో తొలి ఘట్టమైన పనుల గుర్తింపు ప్రక్రియను పూర్తిచేశారు. తొమ్మిది కేటగిరీలలో చేయాలని సంకల్పించారు. జిల్లాలోని 519 పంచాయతీల్లో 395 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులు ఉండగా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాల్సిన పనులపై ప్రణాళిక రూపొందించారు. ఇతర వనరులకు సంబంధించి చేయాల్సిన పనులపై స్పష్టతకు వచ్చారు. నీటి వనరుల్లో ప్రధానమైన పూడికతీత పనులను ఉపాధి హామీ పథకం కింద కూలీలతో చేయించనుండగా వాటిని డ్వామా సిబ్బంది గుర్తించారు. మెటీరియల్‌ ఆధారిత, భారీగా జంగిల్‌ క్లియరెన్స్‌ చేయాల్సిన పనులకు జలవనరులశాఖ అధికారులు గుర్తించారు. ఆవిధంగా జిల్లాలో డ్వామా ద్వారా 3,627, జలవనరుల శాఖ ద్వారా 647 పనులు కలిపి 4,557 పనులను గుర్తించారు. అందులో ఇప్పటికే అంచనాలు పూర్తయిన 1,373 పనులకు రూ.65కోట్లు మంజూరు ఉత్తర్వులను కలెక్టర్‌ రాజాబాబు ఇచ్చారు. వాటిని వెంటనే ప్రారంభించనున్నారు.

అధికంగా కూలీలతోనే పనులు

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పది మీటర్ల వెడల్పులోపు ఉండే కాలువల్లో పూడికతీతను ఉపాధి హామీ పథకం కింద కూలీలతో చేయించాల్సి ఉండగా జిల్లాలో ఆ తరహా పనులు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర పనులలో చెరువు కట్టల పటిష్టత, షట్టర్లు, డ్రాపులు, అలుగుల మరమ్మతులు, భారీ జంగిల్‌ క్లియరెన్స్‌ వంటి వాటికి మిషనరీ, మెటీరియల్‌ అవసరం కాగా అలాంటి వాటిని కలెక్టర్‌ నేతృత్వంలో అందుబాటులో ఉండే వివిధ పథకాల నిధుల ద్వారా చేపడతారని సమాచారం. మొత్తం మీద జలధార పథకంలో కీలక ఘట్టమైన పనులు గుర్తింపు ప్రక్రియ పూర్తితోపాటు కొన్ని పనులు కూడా మంజూరుకావడంతో ఆ కార్యక్రమం జిల్లాలో వేగం పుంజుకోనుంది.

Updated Date - Apr 29 , 2026 | 03:09 AM