జనం జయహో..
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:51 AM
గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మార్కాపురం జిల్లా ప్రజలు జేజేలు పలికారు. నూతన జిల్లాను ఏర్పాటుచేయడం తోపాటు వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసే విషయంలో ప్రభుత్వ నిర్ధిష్ట విధానంతో సంతృప్తిచెందిన వారు ఆయన పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు.
నిర్ధిష్ట హామీలిచ్చిన ముఖ్యమంత్రి
జూలై ఆఖరుకు వెలిగొండ నుంచి నీరు
ప్రభుత్వ కార్యాలయాలకు రూ.50కోట్లు
తాగునీరు, హార్టికల్చర్ హబ్‌పై స్పష్టత
మార్కాపురం, వై.పాలెం నుంచి భారీ స్పందన
తీగలేరు నిర్మాణం.. కనిగిరి, గిద్దలూరుకు
వెలిగొండ జలాలపై ప్రత్యేక దృష్టి
మార్కాపురం- తర్లుపాడు మధ్య డబుల్ రోడ్డు
ఉత్సాహంగా సాగిన సీఎం బహిరంగ సభ
గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మార్కాపురం జిల్లా ప్రజలు జేజేలు పలికారు. నూతన జిల్లాను ఏర్పాటుచేయడం తోపాటు వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసే విషయంలో ప్రభుత్వ నిర్ధిష్ట విధానంతో సంతృప్తిచెందిన వారు ఆయన పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు. సీఎం కూడా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను నిశితంగా పరిశీలించారు. దీంతోపాటు వెనుకబడిన మార్కాపురం జిల్లా అభివృద్ధి, వెలిగొండ జలాలు నాలుగు నియోజకవర్గాలకు అందించే అంశంపై ప్రత్యేక దృష్టి సారించి మాట్లాడారు. కొన్నింటిపై నిర్ధిష్ట ప్రకటనలు చేయడం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో మార్కాపురం ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటిన ముఖ్యమంత్రి మెడికల్ కాలేజీ వ్యవహారాన్ని ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
(ఆంధ్రజ్యోతి, మార్కాపురం/ఒంగోలు)
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఉత్సాహభరితంగా సాగింది. మార్కాపు రంలో జరిగిన సభకు మార్కాపురం, వైపాలెం నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రికి జేజేలు పలికారు. చంద్రబాబు ముం దుగా వెలిగొండ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తీగలేరు తూర్పుకాలువ, గిద్దలూరు నియోజకవర్గంలో ఎత్తిపోతల నిర్మాణం, కనిగిరి నియోజకవర్గం మొత్తానికి సాగునీరు అందించేందుకు ఉన్న అవకాశాలను ప్రజాప్రతినిధులు, అధికారుల ద్వారా తెలుసుకున్నారు. వారితో మార్కాపురం అభివృద్ధిపై ఆయన క్షుణ్ణంగా సమీక్షించారు. తదనుగుణంగా బహిరంగసభలోనే ఆ విష యాలపై స్పష్టతనిచ్చారు. వచ్చే జూలైకి వెలిగొండ తొలిదశను పూర్తిచేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చిన చంద్రబాబు.. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి తక్షణమే రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. హార్టికల్చర్ హబ్‌గా జిల్లాను మారుస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించే జలజీవన్ మిషన్ పథకా న్ని శరవేగంగా పూర్తిచేస్తానని చెప్పారు. ఇవన్నీ కూడా ప్రజలను ఆకట్టుకున్నాయి.
ఫీడర్ కాలువకు శంకుస్థాపన
గత ఎన్నికలకు ముందు మార్కాపురం పర్యటనలో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చిన ప్రకారం ఈ ఏడాది జనవరి 1కే మార్కాపురం జిల్లా ఏర్పడిన విషయం విదితమే. వెలిగొండ ప్రాజెక్టు పునర్నిర్మాణ పనుల్లో వేగం పెరగ్గా బుధవారం ఫీడర్‌కాలువ లైనింగ్ పనులకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టు వద్ద పనులపై సుదీర్ఘంగా సమీక్షించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు మార్కాపురంలో జరిగిన సభలో పాల్గొన్నారు. ఫీడర్‌కాలువ పనులకు శంకుస్థాపన చేసిన గంటవానిపల్లి వద్ద కార్యక్రమానికి అధికారులు, కొద్దిమంది ప్రజాప్రతినిధులు, రైతులకే పరిమితం చేశారు.
వెలిగొండ పనుల నిశిత పరిశీలన
మధ్యాహ్నం ఒంటిగంటకు గంటవానిపల్లి వద్దకు చేరుకున్న చంద్రబాబుకు నీటిపారు దల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఎంపీ మాగుంట, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర, టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, గొట్టిపాటి లక్ష్మి తదితరులు స్వాగతం పలికారు. ఫీడర్ కాలువ పనుల శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ఆయన పనులు జరుగుతున్న ప్రాంతంలో కాలినడకన పర్యటించారు. రైతులు, పనిచేస్తున్న కార్మికులు, ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు. ఆ సందర్భంగా అమ్మిరెడ్డి వెంకటేశ్వ రరెడ్డి, సురవరం గంగివీరారెడ్డి అనే రైతులు జరుగుతున్న పనులు, మంత్రి పర్యవేక్షణపై కితాబునిచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తవు తుందన్న నమ్మకం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో జగన్‌ను నమ్మి మోసపోయామని, భవిష్యత్తులో టీడీపీ నేత ఎరిక్షన్‌బాబుకు మద్దతుగా నిలుస్తామని బహిరంగంగా ప్రకటించారు. అనంతరం చంద్రబాబు మంత్రి నిమ్మలతో కలిసి టన్నెల్ లోపల పనులు చేస్తున్న వారితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ తర్వాత మంత్రి నిమ్మల ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారి సాయిప్రసాద్‌తో కలిసి అధికారులతో మొత్తం ప్రాజెక్టు పనులపై పూర్తిస్థాయిలో సమీక్ష చేశారు.
జూలైకు వెలిగొండ తొలిదశ పూర్తి
మార్కాపురం సభలో చంద్రబాబు మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ నిర్మాణాన్ని పూర్తిచేసి జూలైలో జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్... నిర్మాణం పూర్తికాకుండానే జాతికి అంకితం చేసిన విధానాన్ని బహిర్గతం చేశారు. ఏ పనులు మిగిలి ఉన్నదీ వెల్లడించారు. అందుకుగాను రూ.2వేల కోట్లకుపైగా నిధులు వెచ్చించి తమ ప్రభుత్వం నిర్మాణం ఎలా పూర్తి చేయబోతున్నదీ వివరించారు. తొలిదశలో మార్కాపురం నియోజకవర్గానికి పూర్తిస్థాయిలో వైపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలలో ఎక్కువ ప్రాంతాలకు నీరందబోతున్న విషయాన్ని స్పష్టం చేశారు. అటు తీగలేరు కుడికాలువ ద్వారా వైపాలెం నియోజకవర్గానికి ఎత్తిపోతల పథకం ద్వారా గిద్దలూరు నియోజకవర్గంలోని రాచర్ల మండలానికి నీరందించే విషయంపైనా స్పష్టమైన ప్రకటన చేశారు.
తీగలేరు, గిద్దలూరు, కనిగిరిపై చర్చ
సీఎం ప్రసంగిస్తున్న సమయంలో అక్కడే ఉన్న వైపాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు తీగలేరు తూర్పుకాలువ నిర్మాణం జరిగితేనే నియోజకవర్గం మొత్తానికి తాగు, సాగునీరు అందుతాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దానిపై అధికారులతో క్షుణ్ణంగా చర్చించిన చంద్రబాబు ప్రాథమికంగా ఎంత నిధులు కావాలి, మొత్తం కాలువ పూర్తవ్వాలంటే ఎంత కావాలో తెలుసుకున్నారు. తదనుగుణంగా స్పష్టమైన నివేదిక తయారుచేయాలని ఆదేశించారు. టీడీపీ దర్శి ఇన్‌చార్జి లక్ష్మి దొనకొండ, కురిచేడు మండలాలకు పూర్తిస్థాయిలో తొలిదశలోనే తాగునీరు అందించాలని కోరారు. ఆ విషయంపైనా అధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత అంతకుముందు ఆయనను కలిసిన ఎమ్మెల్యేలు ఉగ్రనరసింహారెడ్డి, అశోక్‌రెడ్డిల విజ్ఞప్తి మేరకు ఆ రెండు నియోజకవర్గాలకు పూర్తిస్థాయిలో నీరందించే విషయంపై చర్చించారు. కంభం చెరువు నుంచి రాచర్ల, గిద్దలూరు ప్రాంతాలకు నీరు ఎలా అందించవచ్చునని తెలుసుకున్నారు. ఎత్తిపోతల నిర్మాణం ద్వారా ముందుకు సాగవచ్చని అధికారులు తెలిపారు. కనిగిరి నియోజకవర్గంలో మిగిలిన ప్రాంతాలకు సాగునీరు అందించే ప్రణాళికనూ పరిశీలించాలని వారిని ఆదేశించారు.
భారీగా తరలివచ్చిన ప్రజానీకం
మార్కాపురం సభకు వచ్చిన అశేష ప్రజానీకంలో మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల వారే అధికంగా కనిపించారు. మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం మునిసిపాలిటీ నుంచి 10వేల మందికిపైగా హాజరయ్యారు. ఆ తర్వాత కొనకనమిట్ల మండలం నుంచి ఎక్కువగా తరలివచ్చారు. మొత్తంగా ఆ నియోజకవర్గం నుంచి 20వేల మంది వరకు హాజరైనట్లు సమాచారం. ఎర్రగొండపాలెం మండలంతోపాటు పెద్దారవీడు, దోర్నాల, త్రిపురాంతకం మండలాల నుంచి చివరిగా పుల్లలచెరువు మండలం నుంచి వచ్చిన వారు ఎక్కువగా కనిపించారు. సభలో ఇటు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, అటు వై.పాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబులు మాట్లాడేటప్పుడు సభికుల నుంచి వచ్చిన స్పందన ఆ విషయాన్ని తేటతెల్లం చేసింది. ఆ ఇద్దరు నాయకులు కూడా కాలికి బలపం కట్టుకుని ఊరూరా తిరిగి సమీకరణ చేశారు. కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలోనే ప్రజలు తరలివచ్చినప్పటికీ మార్కాపురానికి సమీపంలో ఉన్న మండలాల నుంచే కాస్త ఎక్కువగా కనిపించారు.
కొత్త జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యం
కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తానని చంద్రబాబు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి తక్షణం రూ.50కోట్ల నిధులు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ఎమ్మెల్యే నారాయణరెడ్డి అడిగిన మార్కాపురం-తర్లుపాడు రోడ్డు అభివృద్ధి, మార్కాపురం చెరువును ట్యాంక్‌బండ్ లాగా అభివృద్ధి చేసే అంశాలను పరిశీలిస్తానని ప్రకటించి తనతో వచ్చిన సీఎంవో అధికారులకు సూచనలు చేశారు. మరోవైపు పూర్వోదయ కింద మార్కాపురం, ప్రకాశం జిల్లాలను చేర్చి పండ్ల తోటల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించనున్న విషయాన్ని గుర్తుచేశారు. జలజీవన్ మిషన్ పథకం ద్వారా మార్కాపురం నియోజకవర్గం మొత్తం ఇంటింటికీ కుళాయిలు ఇచ్చే పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారానికి వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ద్వారా వచ్చే నీరే కేటాయింపబడుతుందని ప్రకటించారు.
అటూ ఇటూ నడుస్తూ చంద్రబాబు ప్రసంగం
సభలో సీఎం చంద్రబాబు నవయువకుడిలాగా ర్యాంపుపై నడుస్తూ సభికులందరినీ వ్యక్తిగతంగా పలకరించే రీతిలో ప్రసంగించారు. సభావేదికపై తొలి పలుకులు పలికిన చంద్రబాబు ఆ తర్వాత ర్యాంపుపై ముందుకు వచ్చి అక్కడి నుంచి రెండువైపులా నడిచి తిరిగి సభావేదిక మీదకు వెళ్తూ ప్రసంగాన్ని కొనసాగించారు. గంటసేపు అలా ఆయన నడుస్తూ సభికులందరి దగ్గరకు వెళ్లి చేతులూపుతూ మాట్లాడటం ప్రత్యేకతగా కనిపించింది. ఆయన ర్యాంపుపై నడిచే సమయంలో సభికులు కేరింతలు కొట్టారు. మహిళలు ఉత్సాహంగా జేజేలు పలకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రవికుమార్ పర్యవేక్షణ
విద్యుత్‌శాఖామంత్రి రవికుమార్ ఒకరోజు ముందుగానే మార్కాపురం చేరుకుని కార్యక్రమ నిర్వహణను పర్యవేక్షించగా టీడీపీ అధ్యక్షుని హోదాలో కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర జిల్లాలోని నాయకులందరినీ సమన్వయం చేశారు.