Share News

జై అమరావతి!

ABN , Publish Date - Apr 02 , 2026 | 11:39 PM

అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ చట్టసభల్లో బిల్లు ఆమోదించడంతో జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. జిల్లా వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గ కేంద్రాలతోపాటు గ్రామాల్లో కూడా ప్రజలు అమరావతికి జై అంటూ కేరింతలు కొట్టారు. ర్యాలీలతో కదం తొక్కిన పార్టీ శ్రేణులు, ఊరూరా కొవ్వొత్తులు వెలిగించి ప్రదర్శనలు చేశారు.

జై అమరావతి!
మార్కాపురంలో ర్యాలీ నిర్వహిస్తున్న కలెక్టర్‌ విజయసునీత, ఎమ్మెల్యే నారాయణరెడ్డి, జేసీ శ్రీనివాసులు, నేతలు

రాజధానిగా పార్లమెంట్‌లో ఆమోదంపై సర్వత్రా హర్షం

అన్ని నియోజకవర్గాల్లో సంబరాలు

భారీ ర్యాలీలు, బాణసంచా కాల్చుతూ హర్షాతిరేకాలు

కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి సంతోషం

మార్కాపురం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి) : అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ చట్టసభల్లో బిల్లు ఆమోదించడంతో జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. జిల్లా వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గ కేంద్రాలతోపాటు గ్రామాల్లో కూడా ప్రజలు అమరావతికి జై అంటూ కేరింతలు కొట్టారు. ర్యాలీలతో కదం తొక్కిన పార్టీ శ్రేణులు, ఊరూరా కొవ్వొత్తులు వెలిగించి ప్రదర్శనలు చేశారు. పల్లెల్లోనూ పండుగ వాతావరణం నెలకొంది. ఒంగోలు పార్టమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో మంత్రి స్వామితో కలిసి పాల్గొన్నారు. మార్కాపురంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, కలెక్టర్‌ ఎం.విజయసునీత, జేసీ శ్రీనివాసులు కలిసి గడియార స్తంభం నుంచి దోర్నాల సెంటరు వరకు జరిగిన కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్నారు. అంతకుముందు పోల్‌ మేనేజ్‌మెంట్‌ క్లస్టర్‌ ఇన్‌చార్జి రామిరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఎర్రగొండపాలెంలో టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్‌, అంబేడ్కర్‌, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. త్రిపురాంతకం మండలం అన్నసముద్రంలో కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. జిల్లా మొత్తంమీద పండుగ వాతావరణంలో పలు కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి.

కనిగిరి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి) : రాజధాని అమరావతిగా చట్టబద్దత కల్పిస్తూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం పొందటంపై కనిగిరిలో కూటమి శ్రేణులు గురువారం సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో జై అమరావతి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ బాణసంచా కాలుస్తూ హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా జై అమరావతి అంటూ దీపాలనే అక్షరాలుగా అమర్చి ఆనందోత్సాహంతో గడిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు ఫిరోజ్‌, మండల పార్టీ అధ్యక్షుడు కొండా కృష్ణారెడ్డి, గుడిపాటి ఖాదర్‌, జంషీర్‌, కొట్టే ప్రసాద్‌, అంజుమన్‌ కమిటీ అధ్యక్షుడు అహ్మద్‌ పాల్గొన్నారు.


మున్సిపల్‌ కార్యాలయంలో...

అమరావతి రాజధానిగా పార్లమెంట్‌లో చట్టబద్దత కల్పించటంపై హర్షం వక్తం చేస్తూ మున్సిపల్‌ కార్యాలయం విద్యుత్‌దీపాల కాంతితో వెలిగిపోయింది. అమరావతి రాజధానికి జై అంటూ నేలపై వేసిన ముగ్గులు ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం నుంచి అధికారులు, సిబ్బంది కాగడాలు చేతబూని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీధర్‌, మేనేజర్‌ ప్రసాద్‌, ఆర్‌ఐ ప్రదీప్‌, శానీటరీ ఇన్‌స్పెక్టర్‌ నాయబ్‌రసూల్‌, ఏఈ కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 11:39 PM