ఓటుకు వేళాయె..
ABN , Publish Date - Nov 01 , 2026 | 02:59 AM
మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభంకానుంది. సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు అద్దంకి, చీమకుర్తి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
మున్సిపోల్స్‌కు సర్వం సిద్ధం
నేడే పోలింగ్
కేంద్రాలకు చేరిన సిబ్బంది, మెటీరియల్
మూడు అర్బన్ ప్రాంతాల్లో 303
పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
వాటిలో 207 సమస్యాత్మకంగా గుర్తింపు
భారీ బందోబస్తు, కేంద్రాల వద్ద 144 సెక్షన్
లోపల వెబ్ కాస్టింగ్, బయట సీసీ కెమెరాలు
రంగంలో 481 మంది అభ్యర్థులు
ఒంగోలులో 337, అద్దంకి, చీమకుర్తిలలో 144 మంది
మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభంకానుంది. సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు అద్దంకి, చీమకుర్తి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటి పరిధిలో 2,47,644 మంది ఓటర్లు ఉండగా 303 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బంది సామగ్రితో వారికి కేటాయించిన కేంద్రాలకు శనివారం సాయంత్రమే చేరుకున్నారు.
ఒంగోలు, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : పురపోరులో చివరి ఘట్టమైన పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఒంగోలు కార్పొరేషన్‌లో మేయర్, 62 డివిజన్లు ఉండగా 1,92,873 మంది ఓటర్లు ఉన్నారు. మూడు డివిజన్‌లలో టీడీపీ ఏకగ్రీవంగా గెలుపొందగా మేయర్‌తోపాటు 59 కార్పొరేటర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి 242 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అద్దంకి మున్సిపాలిటీలో 32 వార్డులు ఉండగా మూడు స్థానాలను టీడీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. మిగిలిన 29వార్డులు, చైర్మన్ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ 31,895 మంది ఓటర్లు ఉండగా 49 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చీమకుర్తి మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా చైర్మన్ స్థానంతోపాటు 28 వార్డులకూ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 22,876 మంది ఓటర్లు ఉండగా 30 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
2,284 మంది సిబ్బంది నియామకం
మూడు పట్టణ స్థానిక సంస్థల్లో ఉన్న 303 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ కోసం వివిధ స్థాయిలో మొత్తం 2,284 మంది సిబ్బందిని నియమించారు. పలు దఫాలుగా వారికి శిక్షణ కూడా పూర్తి చేశారు. శనివారం ఉదయం నుంచి ఆయా పట్టణాల్లో నియమించిన సిబ్బందికి మెటీరియల్ అందజేసి సాయంత్రానికి ప్రత్యేక వాహనాల్లో మెటీరియల్‌తో వారిని పోలింగ్ కేంద్రాలకు చేర్చారు. ఒంగోలు కార్పొరేషన్‌కు సంబంధించి స్థానిక రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో పంపిణీ కేంద్రం ఏర్పాటు చేసి అక్కడి నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలించారు. అద్దంకి, చీమకుర్తిలలో అక్కడి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ కార్య క్రమం సాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లు, విద్యుత్, ఇతరత్రా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా అన్నిచోట్లా భారీ బందోబస్తు కల్పించారు.
రంగంలో 481మంది అభ్యర్థులు
మూడు అర్బన్ స్థానిక సంస్థల్లో మొత్తం 481 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఒంగోలు కార్పొరేషన్‌లో 337 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా వారిలో మేయర్ స్థానానికి 14 మంది, 59 డివిజన్‌లలో కార్పొరేటర్ పదవులకు 323మంది బరిలో ఉన్నారు. అద్దంకిలో చైర్మన్ స్థానానికి ఆరుగురు, 29 వార్డు కౌన్సిలర్ పదవులకు 68 మంది వెరసి 74మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. ఇక చీమకుర్తిలో చైర్మన్ స్థానానికి ముగ్గురు, 28 వార్డు కౌన్సిలర్ పదవులకు 67 మంది వెరసి 70 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
పోలింగ్‌కు సంబంధించి శనివారం మెటీరి యల్, సిబ్బంది తరలింపు, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ఒంగోలు కార్పొరేషన్‌కు సిబ్బంది, మెటీరియల్‌ను ఒంగోలు సమీపంలోని రైజ్ కాలేజీ నుంచి తరలించగా అక్కడి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, జిల్లా పరిశీలకురాలు హెప్సిబారాణి పరిశీలించారు. చీమకుర్తి కేంద్రంను జేసీ కల్పనాకుమారి, పరిశీలకురాలు, ఎస్పీలు పరిశీలించారు. అద్దంకి, చీమకుర్తిలలో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పరిశీలించగా జిల్లాలో జరిగే మునిసిపల్ ఎన్నికల పోలింగ్‌ను ఒంగోలులోని కలెక్టరేట్ నుంచి కమాండ్ కంట్రోల్ రూము ద్వారా పర్యవేక్షించనున్నారు. ఆ ఏర్పాట్లను కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. ఆ కేంద్రంలో 1077 టోల్‌ఫ్రీ నెంబర్‌ను అందుబాటులో ఉంచారు. పోలింగ్‌కు సంబంధించి ప్రజల నుంచి ఏమైనా ఫిర్యాదులు, అభ్యర్థనలు వస్తే వెంటనే సంబంధిత ఆర్వోలకు తెలియజేసేలా కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు.
టీడీపీ కూటమిదే ఆధిక్యం
పోలింగ్ ఆదివారం ఉదయం 7గంటల నుంచి ప్రారంభంకానుంది. అనుమతి పొందిన అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు ఉదయం 6గంటల కల్లా కేంద్రాలకు చేరుకోవాలని ఎన్నికల అధికారులు ఆదేశించారు. ఇదిలాఉండగా మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కూటమి తొలి నుంచి ఆధిక్యతను ప్రదర్శి స్తోంది. ప్రధాన పోటీ కూటమి, వైసీపీల మధ్య ఉండగా శనివారం ఆయా పార్టీల నేతలు, పోటీలో ఉన్న అభ్యర్థులు ఏజెంట్లపై దృష్టి సారించారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎంపిక చేసిన ఏజెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పోలింగ్ సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో నియమించిన టీడీపీ కూటమి ఏజెంట్లతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శనివారం సాయంత్రం సమావేశమై దిశానిర్దేశం చేయగా అద్దంకి, చీమకుర్తిల్లోనూ స్థానిక నేతలు సమావేశాలు నిర్వహించారు. అదేసమయంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో శనివారమంతా నిమగ్నమయ్యారు.