పసుపు పండుగకు వేళాయె!
ABN , Publish Date - May 14 , 2026 | 03:20 AM
తెలుగు దేశం పార్టీ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు పండుగకు శ్రేణులు సన్నద్ధమవు తున్నారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఆపార్టీ మూడు రోజులపాటు మహానాడును నిర్వహిస్తోంది.
మినీమహానాడులకు తెలుగు తమ్ముళ్లు సిద్ధం
18 నుంచి 20 వరకు నియోజకవర్గ,
23 లేదా 24 పార్లమెంట్ స్థాయిలో నిర్వహణ
నెల్లూరు మహానాడుకు జిల్లా నుంచి
భారీగా తరలివెళ్లనున్న టీడీపీ శ్రేణులు
అక్కడ నిర్వహణ కమిటీ సమావేశానికి
మంత్రి స్వామి, ఇతర నేతలు హాజరు
ఒంగోలు, మే 13 (ఆంధ్రజ్యోతి) : తెలుగు దేశం పార్టీ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు పండుగకు శ్రేణులు సన్నద్ధమవు తున్నారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఆపార్టీ మూడు రోజులపాటు మహానాడును నిర్వహిస్తోంది. ఆలోపు అన్ని నియోజకవర్గాలు, జిల్లా లేదా పార్లమెంట్ స్థాయిలో మినీమహానాడులు కూడా ఏర్పాటు చేస్తోంది. ఆ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, స్థానికంగా ప్రజా సమస్యలు, దీర్ఘకాలిక అభివృద్ధి అంశాలపై చర్చించి తీర్మానాలు చేస్తారు. వాటిని పార్టీ మహానాడుకు పంపిస్తారు. ఈసారి కూడా అలాగే చేయాలని అధిష్ఠానం ఆదేశించింది. ఈసారి మహానాడు కార్యక్రమం ఈనెల 27 నుంచి 29 వరకు పొరుగున ఉన్న నెల్లూరు సమీపంలోని ఇఫ్కో సెజ్ భూముల్లో జరగనుంది. ఆ కార్యక్రమానికి జిల్లా నుంచి భారీగానే తెలుగు తమ్ముళ్లు వెళ్లనున్నారు. తొలి రెండు రోజులు జరిగే ప్రతినిధుల సభకు ముఖ్యనేతలు అన్ని నియోజకవర్గాల నుంచి హాజరుకానున్నారు. 29న జరిగే బహిరంగ సభకు వేలాదిగా పార్టీ శ్రేణులు తరలనున్నారు. నెల్లూరు మహానాడుకు ముందుగా రాష్ట్రవ్యా ప్తంగా అన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌స్థాయి మినీ మహానాడుల నిర్వహణకు అధిష్ఠానం ఇప్పటికే షెడ్యూల్ ఇచ్చింది. ఆ ప్రకారం ఈనెల 18 నుంచి 20 వరకు మూడు రోజులపాటు ఒక్కో రోజు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలోనూ, 23 లేదా 24తేదీల్లో పార్లమెంట్ స్థాయిలో నిర్వహిం చాల్సి ఉంది. తదనుగుణంగా స్థానిక నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఎస్‌ఎన్‌పాడు మినీ మహానాడు నిర్వహణ, నెల్లూరు మహానాడుకు జనసమీకరణపై ఎమ్మెల్యే విజయకుమార్ బుధవారం మండలస్థాయి నేతలతో చర్చించారు. నగరంలోని మంగమూరురోడ్డులోని తన కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈనెల 18న ఒంగోలులోని విష్ణుప్రియ ఫంక్షన్ హాలులో నియోజకవర్గ మినీమహానాడును నిర్వహించాలని నిర్ణయించారు. ఇతర నియోజకవర్గాలు, పార్లమెంట్ స్థాయి మినీ మహానాడుల నిర్వహణపై రెండు రోజుల్లో స్పష్టతరానుంది. మరోవైపు నెల్లూరు మహానాడు నిర్వహణకు సంబంధించిన వివిధ కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురు నేతలను అధిష్ఠానం నియమించింది. ఆ సభ్యులతో ఇఫ్కోసెజ్‌లోని మహానాడు నిర్వహణ ప్రాంగణంలో బుధవారం సన్నాహక సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగ్గా జిల్లా నుంచి రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపు నిర్వహణ కమిటీ కన్వీనరైన మంత్రి డాక్టర్ డీఎస్‌బివి స్వామి, ఇతర కమిటీల్లో సభ్యులుగా ఉన్న కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టీడీపీ దర్శి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తదితరులు హాజరయ్యారు.