Share News

ఇక దూసుకుపోవడమే!

ABN , Publish Date - Sep 01 , 2026 | 03:03 AM

ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తూ సోమవారం మధ్యాహ్నం వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన సందర్భం, ఆతర్వాత జరిగిన బహిరంగ సభ ఓ చారిత్రాత్మక ఘట్టాలుగా మిగిలిపోనున్నాయి. రాజకీయాలకు అతీతంగా జనం తరలివచ్చారు.

ఇక దూసుకుపోవడమే!
జలాల విడుదల సందర్భంగా కృష్ణమ్మకు పూజ చేస్తున్న సీఎం చంద్రబాబు

2028కే వెలిగొండ రెండో దశ పూర్తి

జలహారతితో ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం

పండుగలా కార్యక్రమం

పరవశించిపోయిన ముఖ్యమంత్రి

జయహో చంద్రన్నా అంటూ జనం జేజేలు

కాలువ పొడవునా బారులు తీరిన ప్రజలు

వైపాలెం, మార్కాపురం ప్రాంతాల నుంచి కదిలిన ఊరూవాడా

రాత్రికి సుంకేశుల గ్యాప్‌కు చేరిన కృష్ణా జలాలుఙ

‘చంద్రబాబు అనే నేను చెప్తున్నా.. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం జిల్లా ఇచ్చా. ఇప్పుడు వెలిగొండ జలాలు ఇచ్చి హామీ నిలుపుకొన్నా. మరోసారి చంద్రబాబు అనే నేను మళ్లీ మాట ఇస్తున్నా.. ఇక ఆగేది లేదు! 2028కే వెలిగొండ రెండోదశను పూర్తిచేస్తా. మార్కాపురం జిల్లాను అభివృద్ధిలో ముందుకు తీసుకొస్తా. ఇక మీరు ఆలోచించుకోండి.. మీరూ మాట మీద నిలవండి, మంచిని గౌరవించండి’ అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావోద్వేగంతో చేసిన ప్రసంగానికి జనం జేజేలు పలికారు. జయహో చంద్రన్న అంటూ నినదించారు. కృష్ణాజలాలు పరవళ్లు తొక్కగానే పరవశించిపోయి నేలను ముద్దాడి నీటికి సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం.. జనం జయజయధ్వానాలకు పులకించిపోయారు.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తూ సోమవారం మధ్యాహ్నం వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన సందర్భం, ఆతర్వాత జరిగిన బహిరంగ సభ ఓ చారిత్రాత్మక ఘట్టాలుగా మిగిలిపోనున్నాయి. రాజకీయాలకు అతీతంగా జనం తరలివచ్చారు. కూటమి పార్టీల వారు సభ ఆవరణలోకి ప్రవేశించగా.. గ్రామాలలో ప్రత్యర్థి పార్టీల వారిగా ముద్రపడిన వారు కూడా కృష్ణా జలాలను కళ్లారా చూసేందుకు కాలువల పొడవునా బారులుతీరి జలాలకు స్వాగతం పలికారు. తొలుత నీటిని విడుదల చేసి జలహారతి ఇచ్చిన చంద్రబాబు అనంతరం సభలో గతం వలే కాకుండా కేవలం అర్ధగంటలోనే ఉపన్యాసం ముగించారు. మరో 20 నిమిషాలపాటు జయజయధ్వానాలతో పులకించిపోతున్న జనంతో కలిసి తన ఆనందాన్ని పంచుకున్నారు.

రెండేళ్లలో రెండోదశ పూర్తి

వెలిగొండ ప్రాజెక్టు పుట్టుపూర్వోత్తరాలను, తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన కీలకమైన పనుల వివరాలను విడమరిచి చెప్పిన చంద్రబాబు ఇక ఆగేది లేదంటూ ప్రాజెక్టు రెండోదశను 2028కే పూర్తిచేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన ప్రధాన హామీలను ఎలా నెరవేర్చింది వివరిస్తూ రెండోదశ పూర్తికి హామీ ఇచ్చారు. తద్వారా మార్కాపురం, ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల పరిధిలోని 4.47లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు 23 లక్షల మందికి తాగునీటిని అందించి ప్రాజెక్టు లక్ష్యాన్ని పూర్తిగా నెరవేరుస్తానని చెప్పారు. సెప్టెంబరులోనే హార్టికల్చర్‌ హబ్‌ ప్రారంభిస్తున్నామని దాని ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు.

అలరించిన నృత్యాలు.. మంత్రముగ్ధులైన బాబు

ప్రాజెక్టు నుంచి నీరు విడుదల, జలహారతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సుమారు 5వేల మంది గిరిజన బాలికలతో నృత్యరూపకాలను ప్రదర్శించారు. మంత్రముగ్ధులైన బాబు వారితో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కృష్ణా జలాలు సొరంగం నుంచి బయటకు వచ్చి వెలిగొండ ఫీడర్‌ కెనాల్‌లోకి, అనంతరం కిందకు రాగానే వాటిని చూసిన బాబు పులకించిపోయారు. అక్కడి నేలను ముద్దాడారు. సాష్టాంగ నమస్కారం చేశారు. నీటిని తన తలపై చల్లుకుని తనతో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, రైతుల తలలపైనా చల్లారు.

ఎమ్మెల్యేల నృత్యం

అదేసమయంలో అక్కడున్న మార్కాపురం జిల్లా ప్రాంత ఎమ్మెల్యేలు ఆనందంతో డ్యాన్స్‌ వేయగా మిగిలిన వారు వారికి జత కలిశారు. తొలుత కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి నృత్యం చేయగా పక్కనే ఉన్న మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య జతకలిశారు. సీఎం వద్ద ఉన్న నారాయణరెడ్డి, ఎరిక్షన్‌బాబు, అశోక్‌రెడ్డిలు కూడా వచ్చి కలిశారు. పరవశంతో వారు చేస్తున్న నృత్యాన్ని చూసి అక్కడే ఉన్న ఇతర నాయకులు, ఎమ్మెల్యేలు కూడా అభినందించారు.

సభికులతో బాబు

సభావేదికలో చంద్రబాబు ప్రసంగానికే పరిమితం కాకుండా సభకు వచ్చిన వారితో కలిసి ఆనందం పంచుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. వేదిక మధ్యలో ఏర్పాటు చేసిన రన్‌వేపై రెండుసార్లు కలియతిరిగి అందరికీ అభివాదం చేశారు. పసుపుపచ్చ టవళ్లు ఊపుతూ సభికులు కేరింతలు కొడుతుంటే ఆయన కూడా ఒక టవల్‌ తీసుకుని ఊపుతూ వారిని మరింత ఉత్సాహపరిచారు.

జిల్లా నేతలకు ప్రాధాన్యం

కార్యక్రమం ఆరంభం నుంచి చివరివరకు మార్కాపురం జిల్లా నేతలను, ఒంగోలు ఎంపీ మాగుంటను సీఎం చంద్రబాబు పక్కనే ఉంచుకున్నారు. నీటి విడుదల సమయంలో పక్కనే ఎరిక్షన్‌బాబు ఉండగా దూరంగా ఉన్న మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డిని పిలిచి రెండో గేటు తెరిచే బటన్‌ నొక్కించారు. సభలో కూడా తొలుత నారాయణరెడ్డి, ఉగ్ర, అశోక్‌రెడ్డి, ఎరిక్షన్‌బాబు, ఎంపీ మాగుంటలకే మాట్లాడే అవకాశం ఇచ్చారు. వీరితోపాటు ప్రాజెక్టు నిర్మాణపనులలో కీలకంగా వ్యవహరించిన మంత్రి నిమ్మల రామానాయుడును ప్రత్యేకంగా ప్రశంసించారు.

వైపాలెం, మార్కాపురం ప్రాంతాల్లో కదిలిన జనం

సభా ప్రాంగణానికి మార్కాపురం జిల్లాలోని వారే హాజరవడం కనిపించింది. అందులోనూ ప్రధానంగా వైపాలెం, మార్కాపురం నియోజకవర్గాల వారే అధికంగా వచ్చారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో దోర్నాల, అలాగే ఇటు మార్కాపురం ప్రాంతంలో ఊరూవాడా కదిలి వచ్చారంటే అతిశయోక్తి కాదు. కార్యక్రమ నిర్వహణలో కీలకపాత్ర కూడా ఇటు నారాయణరెడ్డి అటు ఎరిక్షన్‌బాబులే నిర్వహించారు. వారికి చేదోడుగా ఉగ్ర, అశోక్‌రెడ్డి నిలవగా మంత్రి రామానాయుడుతోపాటు గొట్టిపాటి రవికుమార్‌, స్వామి చివరి రెండు రోజుల్లో నారాయణ, సత్యప్రసాద్‌లు కార్యక్రమాల పర్యవేక్షణలో కీలక బాధ్యతలు పోషించారు.

మాగుంట దూకుడు ప్రసంగం

గత 30 సంవత్సరాలలో ఎప్పుడూలేని విధంగా ఈ సభలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తన ప్రసంగంలో దూకుడును ప్రదర్శించారు. వెలిగొండ, మార్కాపురం జిల్లా విషయంలో మాట నిలుపుకున్న చంద్రబాబునాయుడును కొనియాడుతూ గత ప్రభుత్వంలో ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్లు అప్పటి ముఖ్యమంత్రి మోసం చేశాడంటూ కులం, మతం ఆధారంగా నాయకులను నమ్మవద్దంటూ ప్రజలను హెచ్చరించారు. పైగా అప్పుడు తామెన్ని చెప్పినా వినని మూర్ఖుడు వాడు అంటూ పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రత్యర్థుల విషయంలో మాగుంట ఇలాంటి పదజాలం వాడటం ఇదే తొలిసారి.

ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఎంపీ రాక

పట్టణ వ్యవహారాల పార్లమెంట్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న మాగుంట ముందుగా నిర్ణయించిన ప్రకారం సోమవారం చెన్నైలో జరిగే ఆ కమిటీ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. ఆ సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి కూడా హాజరుకానున్నారు. దీంతో చంద్రబాబు అనుమతితో ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావాలని అనుకోగా చంద్రబాబు మాత్రం తప్పక హాజరుకావాలని ఆదేశించారు. దీంతో చెన్నై నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో పదిన్నర గంటల ప్రాంతంలో వెలిగొండ ప్రాజెక్టు వద్దకు మాగుంట చేరారు. తిరిగి సభాకార్యక్రమం పూర్తికాగానే హెలికాఫ్టర్‌లో వెళ్లి చెన్నైలో కార్యక్రమానికి హాజరయ్యారు.

Updated Date - Sep 01 , 2026 | 03:03 AM