Share News

ఉద్యోగులకు పండుగే!

ABN , Publish Date - Sep 13 , 2026 | 03:00 AM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు వినాయక చవితి పండుగ బొనాంజాను ప్రకటించింది. ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ), రిటైర్డ్‌ ఉద్యోగులకు కరువు ఉపశమనం (డీఆర్‌)ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఉద్యోగులకు పండుగే!

రెండు డీఏలను మంజూరు చేసిన ప్రభుత్వం

పెన్షనర్‌లకు రెండు డీఆర్‌లు

జిల్లాలో 35వేల మందికిపైగా ఉద్యోగులు,

40వేల మందిపైగా విశ్రాంత ఉద్యోగులకు లబ్ధి

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు వినాయక చవితి పండుగ బొనాంజాను ప్రకటించింది. ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ), రిటైర్డ్‌ ఉద్యోగులకు కరువు ఉపశమనం (డీఆర్‌)ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో సుమారు 35మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు 40 వేల మందికి లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం ఉద్యోగులకు 2.83 శాతం, 1.82శాతం డీఏను పెంచింది. దీని వలన ఉద్యోగుల బేసిక్‌ పే(మూల వేతనం)పై ప్రస్తుతం ఉన్న డీఏ 37.31శాతం నుంచి 40.4శాతం, రెండో డీఏ 41.86 శాతానికి పెరగనుంది. పెరిగిన డీఏ ఈనెల జీతంతో కలిపి అక్టోబరులో చెల్లించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. డీఏకు సంబంధించిన 26 నెలల బకాయిల్లో 10శాతం తొలివిడతగా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో చెల్లిస్తుంది. ఓపీఎస్‌ ఉద్యోగులకు ఈ పది శాతాన్ని జీపీఎఫ్‌లో జమ చేయనుంది.

ఉద్యోగుల్లో ఆనందోత్సాహాలు

సీపీఎస్‌, పీటీడీ ఉద్యోగులకు పది శాతం బకాయిల మొత్తాలను అందుకు సమానమైన ప్రభుత్వ వాటాతో కలిపి వారి ప్రాన్‌ ఖాతాల్లో జమ చేయనున్నారు. మిగిలిన 90శాతం బకాయిలను మూడు సమాన విడతల్లో చెల్లించనుంది. ఎంతోకాలంగా ఉద్యోగులు డీఏల కోసం ఎదురు చూస్తుండగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వినాయక చవితి పండుగ కానుకగా ప్రకటించడంతో జిల్లావ్యాప్తంగా వారిలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలు సంగతి అలా ఉంచితే కనీసం జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేదు. ప్రతినెలా జీతం కోసం ఉద్యోగులు ఎదురుచూసిన పరిస్థితి. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతినెలా 1వతేదీనే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తోంది. క్రమంగా వారి సమస్యలను కూడా పరిష్కరిస్తూ వస్తోంది. అలా ఇప్పుడు రెండు విడతల డీఏను విడుదల చేయడంతో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరునుంది.

Updated Date - Sep 13 , 2026 | 03:00 AM