నిజమే గెలిచింది!
ABN , Publish Date - Sep 10 , 2026 | 03:27 AM
చంద్రబాబు అక్రమ అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ‘నిజం గెలిచింది’ పేరుతో కార్యక్రమాలను నిర్వహించింది. 53 రోజుల అక్రమ నిర్బంధాన్ని గుర్తు చేస్తూ 53 కొవ్వొత్తులను వెలిగించాలని అధిష్ఠానం పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాలో పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి.
తెలుగు తమ్ముళ్ల కొవ్వొత్తుల ప్రదర్శన
నాటి వైసీపీ అరాచకంపై ఆగ్రహం
కొండ పిలో పాల్గొన్న మంత్రి డాక్టర్ స్వామి
పలుచోట్ల కీలక నేతలు హాజరు
చంద్రబాబు అక్రమ అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ‘నిజం గెలిచింది’ పేరుతో కార్యక్రమాలను నిర్వహించింది. 53 రోజుల అక్రమ నిర్బంధాన్ని గుర్తు చేస్తూ 53 కొవ్వొత్తులను వెలిగించాలని అధిష్ఠానం పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాలో పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. నాటి ఘటనను, అప్పటి వైసీపీ అరాచకపు పాలనను ప్రజలకు గుర్తుచేసేలా అన్నిప్రాంతాల్లో భారీఎత్తున ప్రదర్శనలు చేశారు. కీలక నేతలు పాల్గొన్నారు.
ఒంగోలు, సెప్టెంబరు 9 (ఆంధ్ర జ్యోతి) : మూడేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు జైలులో నిర్బంధించిన ఘటనను గుర్తుచేస్తూ జిల్లావ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు బుధవారం ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాటి వైసీపీ అరాచక పాలనలో 2023 సెప్టెంబరు 9న టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబును అక్రమంగా అత్యంత దారుణమైన రీతిలో అరెస్టు చేశారు. నంద్యాల పర్యటనలో ఉన్న ఆయన్ను సీఐడీ పోలీసుల ద్వారా అప్పటి వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేయించి విజయవాడ కోర్టుకు తరలించగా రిమాండ్ విధించడం, 53 రోజులు జైలులో ఉండి అక్టోబరు 31న విడుదలైన విషయం విదితమే. అప్పట్లో అక్రమ అరెస్టు అనంతరం చంద్రబాబును విజయవాడ కోర్టుకు ఉమ్మడి జిల్లాలో నుంచి తరలించారు. విషయం తెలిసి పలుచోట్ల పోలీసు వాహనాలను జనం అడ్డుకున్నారు. ఆ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చంద్రబాబుకు సంఘీభావం తెలియజేస్తూ ఎక్కడికక్కడ వీధుల్లోకి టీడీపీ శ్రేణులు వచ్చి ఆందోళనలు నిర్వహించాయి. అధినేత జైలులో ఉన్నన్ని రోజులు వివిధ రూపాలలో ఆందోళనలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొనసాగాయి.
జిల్లావ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన
ఆయా ఘటనలను గుర్తుచేసుకుంటూ బుధవారం కొవ్వొత్తుల వెలుగులో కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని పలు పట్టణాలు, మండల కేంద్రాలతోపాటు అనేక గ్రామాల్లో టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమాలు నిర్వహించగా పలుచోట్ల కీలక నేతలు పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన కొండపిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి పాల్గొన్నారు. విజయవాడలో మంత్రి రవికుమార్, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, మారిటైం బోర్డు చైర్మన్ సత్య, డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఇతర నేతలు, మహిళలు పాల్గొన్నారు. నగరంలోని మంగమూరు రోడ్డులోని టీడీపీ సంతనూతలపాడు నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కొవ్వొత్తులు వెలిగించి కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్శిలో అక్కడి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు పాల్గొన్నారు. అద్దంకి, చీమకుర్తి, కందుకూరు, సింగరాయకొండ వంటి పట్టణాలతోపాటు ఇతర మండల కేంద్రాలు, పలు ప్రధాన గ్రామాల్లోనూ టీడీపీ శ్రేణులు, ఆయా ప్రాంతాల నాయకులు పార్టీ కార్యాలయాలు, ఎన్టీఆర్ విగ్రహాల వద్ద కొవ్వొత్తులు వెలిగించి కార్యక్రమాన్ని నిర్వహించారు.