ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొనాల్సిందే!
ABN , Publish Date - Jul 02 , 2026 | 03:04 AM
పొగాకును కంపెనీలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొనాల్సిందేనని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. బుధవారం టంగుటూరులోని వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించారు.
వ్యాపారులకు మంత్రి డాక్టర్ స్వామి స్పష్టం
టంగుటూరు వేలం కేంద్రంలో కొనుగోళ్ల పరిశీలన
టంగుటూరు (కొండపి), జూలై 1 (ఆంధ్రజ్యోతి) : పొగాకును కంపెనీలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొనాల్సిందేనని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. బుధవారం టంగుటూరులోని వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కొనుగోళ్లను పరిశీలించారు. కేంద్రంలో 17 వరుసలు బేళ్లు ఉండగా ఏడు వరుసల కొనుగోళ్లు పూర్తయ్యేంత వరకూ అక్కడే ఉన్నారు. ప్రతి బేలును పరిశీలించి, నోబిడ్‌లకు కారణాలను వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. నాయుడుపాలెం, కాకుటూరివారిపాలెం రైతులతోనూ మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వ్యాపారులు రైతులను ఇబ్బందిపెట్టకుండా పొగాకును కొనుగోలు చేయాలన్నారు. కొన్ని కంపెనీలు మాత్రమే వేలంలో పాల్గొంటున్నాయని అన్ని కంపెనీలు పాల్గొనేలా బోర్డు ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు. రోజూ పొగాకు కొనుగోళ్లను మంత్రులతోపాటు వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు కూడా బాధ్యత తీసుకుని పర్యవేక్షించి ప్రభుత్వానికి నివేదికలు ఇస్తారన్నారు. ప్రభుత్వం పొగాకు రైతుల సంక్షేమం, గిట్టుబాటు ధరల కోసం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. మంత్రి ఉన్నంత సేపు పొగాకు మార్కెట్ బాగానే సాగిందని రైతులు తెలిపారు. మంత్రి పింఛన్‌ల పంపిణీ కార్యక్రమానికి బయల్దేరుతుండగా ‘మీరు వెళితే వ్యాపారులు ధరలు దిగ్గోస్తారు సార్... పూర్తిగా కొనుగోళ్లు అయ్యేంత వరకు ఉండండి’ అని కోరారు. అలా చేయరులే... నేను పర్యవేక్షిస్తానని రైతులతో మంత్రి స్వామి అన్నారు. ఆయన వెంట ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, తహసీల్దార్ ఆంజనేయులు, టీడీపీ మండల అధ్యక్షుడు చదలవాడ చంద్రశేఖర్, నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, బెల్లం జయంత్‌బాబు, మక్కెన వెంకటరావు, వేలం నిర్వహణాధికారి ఎం.సత్యశ్రీనివాస్ పాల్గొన్నారు.