Share News

ఇష్టారీతిన కుదరదు

ABN , Publish Date - Feb 04 , 2026 | 02:48 AM

గ్రామ పంచాయతీల్లో విచ్చలవిడిగా నిధులు వినియోగించకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మరో రెండు నెలల్లో పాలకవర్గాల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఉన్న నిధులను వివిధ పనులకు చెల్లింపులు చేయాలంటూ కార్యదర్శులపై ఒత్తిళ్లు పెరిగాయి.

ఇష్టారీతిన కుదరదు

పంచాయతీల నిధులపై ప్రభుత్వం దృష్టి

పదవీ కాలం ముగింపు సమయంలో విచ్చలవిడిగా డ్రా చేయకుండా చర్యలు

ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు

కార్యదర్శులు ఒత్తిళ్లకు తలొగ్గితే అంతే!

డిప్యూటీ ఎంపీడీవోలకు పర్యవేక్షణ బాధ్యతలు

ఒంగోలు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్ర జ్యోతి): గ్రామ పంచాయతీల్లో విచ్చలవిడిగా నిధులు వినియోగించకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మరో రెండు నెలల్లో పాలకవర్గాల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఉన్న నిధులను వివిధ పనులకు చెల్లింపులు చేయాలంటూ కార్యదర్శులపై ఒత్తిళ్లు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ నిధులను విచ్చలవిడిగా డ్రా చేసేందుకు పాలకవర్గాలు ప్రయత్నిస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో వెంటనే చర్యలకు ఉపక్రమించింది. నిబంధనలకు విరుద్ధంగా నిధులు వినియోగిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా పంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి జిల్లాలో 729 గ్రామ పంచాయతీలు ఉండగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను సుమారు రూ.40 కోట్లు విడుదల చేసింది. వాటిని పారిశుధ్యం, తాగు నీరు, కార్మికులకు వేతనాలు, విద్యుత్‌ చార్జీలు చెల్లింపునకు వినియోగించాల్సి ఉంది. అందుకు కేంద్రప్రభుత్వమే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లాలోని అనేక గ్రామపంచా యతీల్లో పలురకాల పనులు చేశారు. ప్రస్తు తం వచ్చిన ఆర్థిక సంఘం నిధులతో ఆ బిల్లు లు చెల్లించాలని సర్పంచ్‌లు పంచాయతీ కార్య దర్శులపై ఒత్తిడి పెంచారు. దీంతో వారు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో నిధుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి నిబంధనలకు విరుద్ధంగా చేస్తే చర్యలు తప్పవని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అందుకు అనుగుణంగా జిల్లాపంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు కూడా సర్క్యులర్‌ జారీ చేశారు. మరోవైపు పంచాయతీల్లో నిధులు వినియోగంపై నిరంతరం డిప్యూటీ ఎంపీడీవోలు పర్యవేక్షించాలని ఆదేశించారు.

Updated Date - Feb 04 , 2026 | 02:48 AM