Share News

ఇష్టానుసారం కుదరదు

ABN , Publish Date - Jun 28 , 2026 | 02:59 AM

పొగాకు మార్కెట్‌ పరిస్థితిపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నతస్థాయి విచారణ చేసి ఆదేశాలు ఇచ్చినా మీలో మార్పు రాదా. మీ ఇష్టానుసారం కొనుగోలు చేస్తామంటే కుదరదు’ అంటూ పొగాకు కంపెనీల బయ్యర్లపై కలెక్టర్‌ రాజాబాబు మండిపడ్డారు. అధికోత్పత్తిని సాకుగా చూపించి ఉద్దేశపూర్వకంగా ధరలు తగ్గించడం, బేళ్లను తిరస్కరించడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, రైతు కంట కన్నీరు వస్తే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

ఇష్టానుసారం కుదరదు
బోర్డు ఈడీ విశ్వశ్రీతో కలిసి ఒంగోలులో పొగాకు కొనుగోళ్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాజాబాబు

పొగాకు బయ్యర్లకు కలెక్టర్‌ రాజాబాబు హెచ్చరిక

సీఎం సమీక్ష తర్వాత కూడా మార్పు రాదా అంటూ ఆగ్రహం

ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిక

బోర్డు ఈడీ విశ్వశ్రీతో కలిసి ఒంగోలులో వేలం పరిశీలన

ఒంగోలు, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి) : ‘పొగాకు మార్కెట్‌ పరిస్థితిపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నతస్థాయి విచారణ చేసి ఆదేశాలు ఇచ్చినా మీలో మార్పు రాదా. మీ ఇష్టానుసారం కొనుగోలు చేస్తామంటే కుదరదు’ అంటూ పొగాకు కంపెనీల బయ్యర్లపై కలెక్టర్‌ రాజాబాబు మండిపడ్డారు. అధికోత్పత్తిని సాకుగా చూపించి ఉద్దేశపూర్వకంగా ధరలు తగ్గించడం, బేళ్లను తిరస్కరించడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, రైతు కంట కన్నీరు వస్తే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పొగాకు మార్కెట్‌ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ కలెక్టరేట్‌ వద్ద రైతు సంఘాల దీక్షలు చేపట్టడం, మార్కెట్‌ మెరుగుకు సీఎం ఆదేశాలు సైతం అమలుకు నోచుకోకపోవడం నేపథ్యంలో శనివారం కలెక్టర్‌ రాజాబాబు వేలం కేంద్రాలను సందర్శించారు. బోర్డు ఈడీ విశ్వశ్రీతో కలిసి ఒంగోలు-1, 2 కేంద్రాలను సందర్శించి అక్కడ వేలం తీరును పరిశీలించారు. ప్రస్తుత మార్కెట్‌ తీరుపై రైతులు, కంపెనీల బయ్యర్లు, వేలం కేంద్ర అధికారులతో మాట్లాడారు. కొన్ని బేళ్లను కొని అలాగే ఉండే గ్రేడ్‌ బేళ్లను బయ్యర్లు తిరస్కరించడాన్ని గుర్తించి వారిపై మండిపడ్డారు. రాష్ట్రంలో 142 మిలియన్‌ కిలోల ఉత్పత్తికి అనుమతిస్తే 230 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తి జరిగిందని... దానిని సాకుగా చూపి కొనుగోలు చేయమంటే సహించబోమని ఈ సందర్భంగా వ్యాపారులను హెచ్చరించారు. సీఎం అన్ని విషయాలు చర్చించి ఆదేశాలు ఇచ్చినా మీలో మార్పు రాదా అని ప్రశ్నించిన కలెక్టర్‌ నోబిడ్‌లు ఉండరాదని, కిలో సగటున రూ.200 తగ్గకుండా కొనాలని తేల్చిచెప్పారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం, పొగాకు బోర్డు ముందుకు వచ్చాయని వ్యాపారులు కూడా అందుకు సహకరించాలన్నారు. వచ్చే ఏడాది 80 మిలియన్‌ కిలోల ఉత్పత్తికే అనుమతి ఉంటుందన్నారు. అంతకు మించి రైతులు కూడా పండించరాదన్న కలెక్టర్‌ ప్రస్తుతం సరిగా కొనుగోలు చేయకుండా ఉత్పత్తి తగ్గినప్పుడు కొనుగోలుకు ముందుకు వచ్చే కంపెనీలను అనుమతించబోమన్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఉదారంగా ముందుకొచ్చి కొనుగోలు చేయాలని కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. అందుకు విరుద్ధంగా ఉద్దేశపూర్వకంగా ధరలు కోత పెట్టి, బేళ్లను తిరస్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం నుంచి వేలం కేంద్రాల్లో కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ పర్యవేక్షణ ఉంటుందని, ఒక్కో కేంద్రంలో ఒక ఏడీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారన్నారు. రైతులు కూడా వేలంలో డిమాండ్‌ ఉన్న గ్రేడ్‌లను తీసుకురావాలని కలెక్టర్‌ రాజాబాబు సూచించారు. ఈడీ విశ్వశ్రీ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న అన్ని కంపెనీల వారు రోజువారీ వేలంలో పాల్గొని కొనుగోలు చేయాలన్నారు. అందుకు అందరికీ నోటీసులు కూడా ఇచ్చామని, వచ్చేవారం వేలంలో పాల్గొనని వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే వారి రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తామన్నారు. ఆర్‌ఎం ప్రసాద్‌, వ్యవసాయశాఖ అధికారి ఎస్‌.శ్రీనివాసరావు, మార్క్‌ఫెడ్‌ డీఎం హరికృష్ణ, మార్కెటింగ్‌ శాఖ ఏడీ వరలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2026 | 02:59 AM