ఇష్టప్రకారం కుదరదు
ABN , Publish Date - Jul 09 , 2026 | 02:51 AM
‘పొగాకు మార్కెట్లో రైతులను ఇబ్బందిపెట్టేలా కంపెనీలు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం. ప్రభుత్వం అలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. గతేడాది వేలం ముగింపులో ఆస్థాయి ధరలు ఎలా ఇచ్చారు? ఈ ఏడాది ఆరంభం నుంచే ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? అని నిలదీశారు.
రైతులను ఇబ్బందిపెడితే కఠినంగా వ్యవహరిస్తాం
పొగాకు కంపెనీలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక
ప్రస్తుత మార్కెట్‌పై ఉన్నతస్థాయి సమీక్ష, బోర్డు పనితీరుపై అసంతృప్తి
మంత్రులు, జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధులు హాజరు
నేడు హైదరాబాద్‌లో అధికారులు, వ్యాపార ప్రతినిధులతో కేంద్ర అధికారుల సమీక్ష
‘పొగాకు మార్కెట్లో రైతులను ఇబ్బందిపెట్టేలా కంపెనీలు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం. ప్రభుత్వం అలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. గతేడాది వేలం ముగింపులో ఆస్థాయి ధరలు ఎలా ఇచ్చారు? ఈ ఏడాది ఆరంభం నుంచే ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? అని నిలదీశారు. కర్ణాటకలో లేని మార్కెట్ సమస్య ఇక్కడ ఎందుకు సృష్టించారని ప్రశ్నించారు. పంట అధికంగా పండిందని సాకుచూపి ధరలు తగ్గించడం, కొనుగోలు చేయకుండా వేలంలో బేళ్లను వెనక్కు పంపడం తగదని వ్యాపారులపై మండిపడ్డారు. మీ ఇష్టప్రకారం మార్కెట్‌లో వ్యవహరిస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు.
ఒంగోలు, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : పొగాకు రైతుల్లో ధైర్యాన్ని నింపేలా, మార్కెట్‌పై నమ్మకం పెరిగేలా తక్షణం చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. మార్కెట్ సంక్షోభంలో కూరుకుపోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పొగాకు పండే ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, బోర్డు అధికారులు, వ్యాపారులతో బుధవారం సాయంత్రం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో వ్యవసా యశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లాకు చెందిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, బోర్డు ఈడీ విశ్వశ్రీ, పలువురు ఉన్నతస్థాయి అధికారులు, ప్రధాన పొగాకు కొనుగోలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు సమీక్ష చేసిన సీఎం.. ఆద్యంతం వ్యాపారుల వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడుతూ హెచ్చరికలు చేశారు. బోర్డు అధికారుల తీరుపైనా అసంతృప్తిని వ్యక్తం చేశారు. డిమాండ్‌కు మించి పంట ఉత్పత్తి చేయడం ప్రస్తుత సమస్యకు ఇప్పటికే అవసరానికి మించి కొనుగోలు చేశామని, ఎగుమతులు కూడా లేక ప్రతికూల పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు సీఎంకు వివరించే ప్రయత్నం చేశారు. అలాగే 142 మిలియన్ కిలోలకు అనుమతి ఇస్తే రైతులు 232 మిలియన్ కిలోలు పండించారని తెలిపారు. దానివల్ల మార్కెట్లో ధరలు లేక కొనుగోళ్లు సాగడం లేదని బోర్డు అధికారులు వివరించారు. అయితే ఇటు బోర్డు అధికారుల, అటు వ్యాపారులు చెప్పిన అంశాలను అంగీకరించని సీఎం చంద్రబాబు కంపెనీల వారీగా ఎంత ఇండెంట్ ఇచ్చారు.. ఇప్పటి వరకు ఎంత కొనుగోలు చేశారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అతిపెద్ద కంపెనీలు అయిన ఐటీసీ, జీపీఐ, ఏఎస్‌టీలు కలిపి 95.50 మిలియన్ కిలోలు కొనుగోలుకు ఇండెంట్ ఇచ్చి ఇప్పటివరకు కేవలం 17.60 మిలియన్ కిలోలు మాత్రమే కొన్నారన్న గణాంకాలను వివరిస్తూ వారి తీరును తప్పుబట్టారు. అలా మొత్తం 28 కంపెనీల వారు కొనుగోలును సీఎం సమావేశంలో అడిగి తెలుసుకొని వ్యాపారులు రైతులను ఇబ్బందిపెట్టేలా మార్కెట్‌లో వ్యవహరించి గుడ్‌విల్ పోగొట్టుకోవద్దని హితవు పలికారు.
ఇలాగైతే క్రాప్ హాలిడే ఆలోచన చేస్తా
మీరు ఇలాగే వ్యవహరిస్తే వచ్చే సీజన్‌కు రైతులు క్రాప్‌హాలిడేకి వెళ్లే ఆలోచన నే నే చేస్తానని, వారు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపితే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని వ్యాపారులను సీఎం హెచ్చరించారు. ఇలాంటి సంక్షోభ సమయంలో ప్రభుత్వ సూచనలను పాటించి రైతులను ఆదుకోకపోతే సహించేది లేదన్నారు. కచ్ఛితంగా కిలో రూ.200 తగ్గకుండా, అలాగే వేలంకు వచ్చే అన్ని బేళ్లను కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. మంత్రులు నిరంతరం మార్కెట్‌ను పర్యవేక్షిస్తారన్నారు. ఒక దశలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ జోక్యం చేసుకొని బర్లీ విషయంలో రైతులను తప్పుదోవ పట్టించేలా పంట సాగుకు వ్యాపారులు ప్రోత్సహించే ప్రయత్నం చేసిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
మీ సంగతేంటో ఆలోచించుకోండి
బోర్డు అధికారులు సూచించిన ధరలకు కొనకుండా వేలం కేంద్రంలో వ్యాపారులు భారీగా నోబిడ్‌లు జరిగేందుకు కారణమవుతున్నారని మరో మంత్రి డాక్టర్ స్వామి చెప్పారు. అన్ని విషయాలను విన్న సీఎం ఎట్టి పరిస్థితుల్లో తాము సూచించిన ధర ఇచ్చి అన్ని బేళ్లను కొనాల్సిందేనని స్పష్టం చేశారు. రైతులతో మాట్లాడి క్రాప్‌హాలిడేను పరిశీలిస్తానని చెప్పారు. రెండేళ్లలో వెలిగొండ నీళ్లు పొలాలకు వస్తాయని, ఇతర పంటలను రైతులు వేసుకుంటారని అప్పుడు మీ వ్యాపారుల సంగతి ఏమిటో ఆలోచించుకోండని హెచ్చరించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయకుమార్, ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి. ఎం.అశోక్‌రెడ్డి, వైపాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు తదితరులు సమావేశానికి హాజరయ్యారు.
దృష్టిసారించిన కేంద్ర ప్రభుత్వం
ప్రస్తుత పొగాకు మార్కెట్ పరిస్థితిపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కూడా దృష్టి సారించింది. పంటను పర్యవేక్షించే కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ నితిన్‌కుమార్ యాదవ్ ఈ అంశంపై గురువారం హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. బోర్డు అధికారులతోపాటు పొగాకు వ్యాపారులను అలాగే వేలం కేంద్రాల రైతు ప్రతినిధులతో ఆయన సమీక్ష చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో జరిగే ఈ సమీక్షకు దక్షిణాది ప్రాంత వేలం కేంద్రాల నుంచి ఇద్దరు రైతు ప్రతినిధులను బోర్డు అధికారులు ఆహ్వానించారు. ప్రస్తుత మార్కెట్‌పై చర్చతోపాటు వచ్చే సీజన్‌కు పంట ఉత్పత్తి భారీగా తగ్గించాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయానికి రాగా ఆ అంశంపై ప్రత్యక్షంగా చర్చిస్తారని సమాచారం.