Share News

ఉదయ్‌ అలాంటోడా!

ABN , Publish Date - Jul 21 , 2026 | 03:12 AM

‘ఉదయ్‌ అలాంటోడా..’ ఇదీ ప్రస్తుతం మండలంలో చర్చనీయాంఽశంగా మారిన అంశం. ట్రైనీ ఐపీఎస్‌ మూలగాని ఉదయ్‌ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదవడంతో సింగరాయకొండలోనూ, ఆయన స్వగ్రామమైన ఊళ్లపాలెంలోనూ ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు.

ఉదయ్‌ అలాంటోడా!

ఉన్నతంగా ఎదిగి.. అంతలోనే మచ్చ

పట్టుదలతో కానిస్టేబుల్‌ నుంచి ఐపీఎస్‌ అయిన ఊళ్లపాలెం వాసి

జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్న ఉదయ్‌ కృష్ణారెడ్డి

ట్రైనీ మహిళా ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో అప్రతిష్టపాలు

సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌తో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం

స్వగ్రామంలో పలు రకాలుగా చర్చ

సింగరాయకొండ, జూలై 20 (ఆంధ్రజ్యోతి) : ‘ఉదయ్‌ అలాంటోడా..’ ఇదీ ప్రస్తుతం మండలంలో చర్చనీయాంఽశంగా మారిన అంశం. ట్రైనీ ఐపీఎస్‌ మూలగాని ఉదయ్‌ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదవడంతో సింగరాయకొండలోనూ, ఆయన స్వగ్రామమైన ఊళ్లపాలెంలోనూ ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి నాయనమ్మ సంరక్షణలో కష్టపడి కానిస్టేబుల్‌ నుంచి ఐపీఎస్‌ వరకూ ఎదిగినా.. చివరకు తన తోటి మహిళా అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడి చేజాతులారా బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకున్నారని కొంతమంది చర్చించుకుంటున్నారు. మరికొంతమంది గ్రామస్థులు ఉదయ్‌ కృష్ణారెడ్డి పోలీసుల దర్యాప్తులో నిర్దోషిగా బయటకు వస్తారని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఆయన నాయనమ్మ రమణమ్మ మాట్లాడుతూ నా మనవడికి ఎటువంటి అవలక్షణాలు లేవని, కష్టపడి చదివి ఉన్నతస్థాయికి వచ్చాడని తెలిపారు. ఉదయ్‌పై వచ్చిన ఆరోపణలు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు.

కష్టపడి చదివి...

ఉదయ్‌ కృష్ణారెడ్డి చిన్న వయసులోనే అమ్మానాన్నను కోల్పోయారు. నాయనమ్మ కూరగాయలు అమ్ముకుంటూ కష్టపడి చదివించింది. 2012లో కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించారు. 2018లో రామాయపట్నం మెరైన్‌ కానిస్టేబుల్‌గా విధినిర్వహణలో ఉన్న సమయంలో సహచరులందరి ముందు ఒక సీఐ తీవ్రంగా అవమానించి, వ్యక్తిగతంగా కించపరిచారు. దీంతో కలత చెందిన ఉదయ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఐపీఎస్‌ కావాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌ వెళ్లి యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యారు. 2019 నుంచి నాలుగుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. 2024లో 350వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. అకుంఠిత దీక్ష, పట్టుదలతో కానిస్టేబుల్‌ నుంచి ఐపీఎస్‌ సాధించి జీరో నుంచి హీరోగా మారారు. ఎంతో మంది యువతకు ఆదర్శంగా, స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఐపీఎస్‌గా తెలంగాణ కేడర్‌కు కేటాయించడంతో ఆయన హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీలో ప్రస్తుతం ట్రైనీ ఐపీఎస్‌గా శిక్షణ పొందుతున్నారు. ఉదయ్‌కృష్ణారెడ్డి తనపై లైంగింక వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారని శిక్షణలో ఉన్న ఓ మహిళా ఐపీఎస్‌ హైదరాబాద్‌లోని అత్తాపూర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై హైదరాబాద్‌ పోలీసులు ఉదయ్‌కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. దీన్ని సీరియస్‌ తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఉదయ్‌కృష్ణారెడ్డిపై అంతర్గత విచారణకు ఆదేశించారు. 8 రోజుల్లో తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని హైదరాబాద్‌ అత్తాపూర్‌ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈనేపథ్యంలో ఉదయ్‌కృష్ణారెడ్డిపై సోషల్‌ మీడియాలో పలు రకాలుగా కథనాలు వైరలయ్యాయి. దీంతో మనస్తాపానికి గురైన ఆయన సోమవారం శానిటైజర్‌ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అంతకు ముందు ఆయన తాను ఏ తప్పూ చేయలేదని, చివరకు న్యాయం గెలుస్తుందని తన వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టారు. కాగా ఆత్మహత్యాయత్నం చేసిన ఉదయ్‌కృష్ణారెడ్డి సూసైడ్‌ లెటర్‌ వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. అందులో పలు విషయాలను ఆయన రాసినట్లు సమాచారం. ఉదయ్‌కృష్ణారెడ్డిపై వచ్చిన ఆరోపణలు వాస్తవమా.. కాదా? ఎవరిది తప్పు? అన్న విషయాలను దర్యాప్తులో పోలీసులు నిగ్గుతేల్చాల్సి ఉంది.

Updated Date - Jul 21 , 2026 | 03:12 AM