Share News

పాఠశాల నిర్వహణ తీరు ఇదేనా..!

ABN , Publish Date - Nov 24 , 2026 | 11:20 PM

ఒంగోలు మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే మేయర్‌ నల్లమల్లి శ్రీశిల్ప తన బాధ్యతల నిర్వహణపై కదిలారు. మంగళవారం ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతున్న మేయర్‌ నగరంలోని పీవీఆర్‌ బాలికల ఉన్నత పాఠశాల వద్ద సడెన్‌గా ఆగి తనిఖీ చేశారు

పాఠశాల నిర్వహణ తీరు ఇదేనా..!
విద్యార్థినులతో మాట్లాడుతున్న మేయర్‌ శ్రీశిల్ప

పీవీఆర్‌ బాలికల స్కూలు ఆకస్మిక తనిఖీ చేసిన మేయర్‌ శ్రీశిల్ప

విద్యార్థినిలు పట్ల నిర్లక్ష్యం.. పారిశుధ్యం లోపంపై అసహనం

ఒంగోలు కార్పొరేషన్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే మేయర్‌ నల్లమల్లి శ్రీశిల్ప తన బాధ్యతల నిర్వహణపై కదిలారు. మంగళవారం ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతున్న మేయర్‌ నగరంలోని పీవీఆర్‌ బాలికల ఉన్నత పాఠశాల వద్ద సడెన్‌గా ఆగి తనిఖీ చేశారు. సుమారు ఉదయం 10-40 గంటల సమయంలో పాఠశాల తలుపులు తాళాలు తీయకపోవడంతో వందమంది విద్యార్థినులు గేటు బయటే నిలబడి ఉన్నారు. విషయాన్ని గమనించిన మేయర్‌ వెంటనే కారు ఆపి, ఎందుకు ఇక్కడ ఉన్నారు ? ఏమైంది అని ప్రశ్నించారు. దీంతో విద్యార్థులు పాఠశాలకు సెలవు ప్రకటించారని, 10వ తరగతి విద్యార్థినులకు స్పెషల్‌ క్లాసులు ఉన్నాయని హెచ్‌ఎం చెప్పడంతో విచ్చేశామన్నారు. అప్పటి వరకు పాఠశాల ఉపాధ్యాయులు గానీ, హెచ్‌ఎం గానీ, వాచ్‌మెన్‌ కూడా లేకపోవడంపై హెచ్‌ఎం రాజ్యలక్ష్మికి ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ క్రమంలోనే వాచ్‌మన్‌ హడావుడిగా వచ్చి గేటు తాళాలు తీశారు. ఆ తర్వాత మేయర్‌ పాఠశాలను తనిఖీ చేశారు. ఈలోపే హెచ్‌ఎం కూడా వచ్చారు. స్కూలు నిర్వహణ ఇలానా అంటూ హెచ్‌ఎంను ప్రశ్నించారు.ఆడపిల్లలను ఇలా రోడ్డుపై ఇంత సేపు ఎలా నిలబెడతారు ? అనడంతో వాచ్‌మెన్‌తాళాలు తీయనందువలన సమస్య ఏర్పడిందని హెచ్‌ఎం సమాధానమిచ్చారు. వాచ్‌మెన్‌ నిర్లక్ష్యంపై హెచ్‌ఎంగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని తెలిపిన మేయర్‌ నేరుగా పాఠశాలలోకి వెళ్లి తరగతి గదులను పరిశీలించారు. గదుల్లో పారిశుధ్యం లోపం, బాత్‌ రూమ్‌లకు తాళాలు వేయడం పాఠశాలలో అధ్వానంగా ఉండటంపై మేయర్‌ హెచ్‌ఎం తీరును తప్పుబట్టారు. ఇలాగైతే ఎలా ? ఆడపిల్లల పట్ల చూపే శ్రద్ధ ఇదేనా అంటూ ప్రశ్నించారు.

Updated Date - Nov 24 , 2026 | 11:20 PM