సదరంలో అక్రమాల ఆరోపణలపై సీఎంవో ఆరా ?
ABN , Publish Date - Oct 06 , 2026 | 10:58 PM
సదరం సర్టిఫికెట్‌లు మంజూరులో అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టి సారించింది. ఈ మేరకు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఒంగోలు జీజీహెచ్(రిమ్స్)లో మంజూరు చేసిన సదరం సర్టిఫికెట్‌ల వివరాలు పంపించాలని జీజీహెచ్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
ఈ ఏడాది జనవరి 1 నుంచి రిమ్స్‌లో మంజూరు చేసిన సర్టిఫికెట్ల వివరాలు పంపాలని ఆదేశం
ఇటీవల వరుస ఫిర్యాదుల నేపథ్యంలో కలకలం
ఒంగోలు కార్పొరేషన్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : సదరం సర్టిఫికెట్‌లు మంజూరులో అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టి సారించింది. ఈ మేరకు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఒంగోలు జీజీహెచ్(రిమ్స్)లో మంజూరు చేసిన సదరం సర్టిఫికెట్‌ల వివరాలు పంపించాలని జీజీహెచ్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే సదరంలో సర్టిఫికెట్‌లు మంజూరు సంబంధిత వైద్యులు, వారి సహాయకులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, అనర్హులకు సర్టిఫికెట్‌లు మంజూరు చేస్తూ, అర్హులను ఇబ్బందులు గురిచేస్తున్నారని ఇప్పటికే పొదిలికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా, ఇటీవల అవినీతి ఆరోపణలపై విచారణ కమిటీ వివరాలు సేకరించింది. తాజాగా నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సమితి ఆధ్వర్యంలో జీజీహెచ్ వద్ద నిరసన తెలియజేయగా, సోమవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎ్‌సలోసదరంలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేయాలని వినతిపత్రం అందజేశారు. ఇదిలా ఉండగా, కొద్ది నెలలుగా సదరం సర్టిఫికెట్ మంజూరుకు ఓ వైద్యుడితోపాటు, అతనికి సహాయకుడుగా వ్యవహరిస్తున్న ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి కొందరు బాధితులు తమ వద్ద కాల్ రికార్డులు కూడా ఉన్నాయని కూడా వెల్లడిస్తుండగా, సదరం అక్రమాలపై వాస్తవాలు వెలుగు తీయాలని కోరుతూ, విజిలెన్స్ విచారణ కోరడం ఇప్పుడు జీజీహెచ్‌లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) మంగళవారం జీజీహెచ్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి 1 నుంచి సదరం సర్టిఫికెట్‌లు మంజూరు ఐడీ లాగిన్‌లు, ఇప్పటి వరకు సర్టిఫికెట్‌లు మంజూరైన వారి వివరాలు కోరగా, సీఎంవో ఆదేశాలతో జీజీహెచ్ అధికారులు సదరం వివరాలను తెలియజేసినట్లు తెలిసింది. మొత్తంగా సదరంలో కొద్ది రోజులుగా సదరం సర్టిఫికెట్‌ల మంజూరులో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తుండగా, ఎట్టకేలకు సీఎంవో జోక్యంతో జీజీహెచ్‌లో చర్చనీయాంశమైంది.