Share News

ఇంకా కొత్తేనా..!

ABN , Publish Date - May 02 , 2026 | 03:23 AM

కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో అధికారిక పాలనా వ్యవహారాలు ఇంకా కుదుట పడలేదు. ఉన్నతాధికారులతోపాటు ఉద్యోగుల కొరతే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ఇంకా కొత్తేనా..!

కుదుటపడని నూతన జిల్లా

గాడినపడని మార్కాపురం పాలన

అధికారులు, ఉద్యోగుల కొరతే అసలు కారణం

ఇంకా ఒంగోలు చుట్టూ తిరుగుతున్న కొన్ని శాఖల వారు

కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో అధికారిక పాలనా వ్యవహారాలు ఇంకా కుదుట పడలేదు. ఉన్నతాధికారులతోపాటు ఉద్యోగుల కొరతే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. జిల్లాకు కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ మినహా ముఖ్యమైన ఏశాఖకు కూడా పూర్తిస్థాయిలో పనిచేసే అధికారులు నియమితులు కాలేదు. కీలకమైన శాఖల్లో కిందిస్థాయి ఉద్యోగుల నియామకాల్లోనూ జాప్యం నెలకొంది. ఇప్పటికీ కొన్ని శాఖలకు చెందిన వారు ప్రకాశం జిల్లాకేంద్రమైన ఒంగోలుకు వచ్చి సమీక్షల్లో పాల్గొంటున్నారు. దీంతో హామీ మేరకు జిల్లాను ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ వైపు దృష్టిసారించాలని మార్కాపురం ప్రజలు కోరుకుంటున్నారు.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

వెనుకబడిన పశ్చిమప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు మార్కాపురం కేంద్రంగా జిల్లాను ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో గత సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ నెరవేర్చినట్లయ్యింది. జిల్లా ఏర్పాటుతో యావత్తు పశ్చిమప్రాంత ప్రజానీకం మురిసి పోయింది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో సానుకూలత పెరిగింది. అయితే జిల్లా ఏర్పడి నాలుగు మాసాలు అయినా అనుకున్న స్థాయిలో అధికారులు, ఉద్యోగుల నియామకాలు చేపట్టకపోవడం సమస్యగా మారింది. కొత్త భవనాల నిర్మాణాలు, ఇతర ఆర్థికపరమైన అంశాలను పక్కనపెడితే అన్ని శాఖలకు పూర్తిస్థాయిలో ఉన్నతాధికారులను నియమించి అవసరమైన సిబ్బందిని కేటాయించి ఉండాల్సింది. అయితే తొలుత పరిస్థితులు కుదుటపడే వరకు ప్రకాశం జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను మార్కాపురం జిల్లాకు ఇన్‌చార్జులుగా నియమించాలని యావత్తు ఉమ్మడి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వారి విజ్ఞప్తిని ఆయన మన్నించి కలెక్టర్‌, ఎస్పీలు మినహా మిగిలిన అధికారులు, ఉద్యోగులను నియమించి పాలనను గాడిలో పెట్టాలని సూచించారు. అయితే ప్రకాశం కలెక్టర్‌, ఎస్పీలనే కొనసాగించేందుకు ఉన్నతాధికారులు ససేమిరా అన్నారు. ప్రధానంగా చీఫ్‌ సెక్రటరీ... కలెక్టర్‌ను వెంటనే నియమించాల్సిన అవకాశం ఉందని ముఖ్యమంత్రికి సూచించారు. దీంతో కలెక్టర్‌ నియామకాన్ని పూర్తిచేశారు. అంతకు ఒక మాసం ముందుగా జాయింట్‌ కలెక్టర్‌ నియామకం జరిగింది. గత నాలుగు మాసాలలో ఆ జిల్లాకు పూర్తిస్థాయిలో పనిచేసే ఉన్నతాధికారుల నియామకాలు జరిగాయంటే అవి కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ మాత్రమే. తాత్కాలిక కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ చాంబర్‌ నిర్మాణాలు జరిగిపోయాయి. అయితే ఆ కార్యాలయాల్లో పనిచేయాల్సిన ముఖ్యమైన సిబ్బంది నియామకాన్ని కూడా ప్రభుత్వం విస్మరించింది.

అధికారిక ఉత్తర్వులు కరువు

కలెక్టర్‌ కార్యాలయంలో కీలకమైన పరిపాలనా అధికారి (ఏవో) నియామకం కూడా ఇంతవరకూ జరగలేదు. ఆర్డీవో కార్యాలయంలో ఏవోగా ఉన్న వారికి కలెక్టర్‌ కార్యాలయం ఏవోగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. కలెక్టర్‌ కార్యాలయం నిర్వహణకు కనీసం 79మంది ఉద్యోగులు అవసరమని ప్రభుత్వానికి ఒక నివేదికను పంపారు. కానీ ఇంతవరకూ వారి నియామకానికి అవసరమైన ఆమోదపు ఉత్తర్వులే ఉన్నతాధికారుల నుంచి రాలేదు. వారి నియామకానికి సంబంధించి ఉన్నతాధికారుల అధికారిక ఉత్తర్వులు ఇస్తే కొందరిని కొత్తగా తీసుకోవచ్చు. మరి కొందరిని ఇతర జిల్లాల నుంచి బదిలీ చేయించవచ్చు. కానీ అందుకు అవసరమైన ఉత్తర్వులే ఉన్నతాధికారులు ఇవ్వకపోకవడం గమనార్హం. ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయం వెళ్లిందా? లేదా? అనేది కూడా అనుమానమే. ఆ జిల్లాకు చెందిన అధికారపార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంపై దృష్టి సారించిన దాఖలాలు లేవు.

కిందిస్థాయి అధికారుల కొరత

కలెక్టర్‌ విజయసునీత, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు పాలనా వ్యవహరాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పర్యటించడం, ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవడంలో వారు విజయవంతంగానే ముందుకు సాగుతున్నారు. ప్రతి సోమవారం ‘మీకోసం’ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీ అధికారులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును సమీక్షిస్తున్నారు. కానీ ఆ సందర్భంగా వారి దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీచేసినా కదలిక కనిపించడం లేదు. వారు ఇచ్చిన ఆదేశాలను పూర్తిచేసేందుకు కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులు లేకపోవటమే అందుకు కారణం. ఇతర ప్రభుత్వ శాఖల్లో 80శాతం శాఖలకు ఇంతవరకూ పూర్తిస్థాయిలో జిల్లా అధికారుల నియామకం జరగలేదు.

కనిగిరిలో కీలక అధికారులు లేరు

డివిజన్‌ కేంద్రమైన కనిగిరిలో కొంతకాలంగా రెవెన్యూ డివిజనల్‌ అధికారి (ఆర్డీవో), డివిజనల్‌ పోలీస్‌ అధికారి (డీఎస్పీ) లేరు. దీంతో రెవెన్యూపరమైన అంశాల పరిష్కారంలో తహసీల్దార్లు ఇబ్బంది పడుతున్నారు. పోలీస్‌ వ్యవస్థ గాడి తప్పుతున్నట్లు తెలుస్తోంది. ఎట్టకేల కు శుక్రవారం ఆర్డీవోను నియమించారు. డివిజన్‌ కేంద్రంలో కీలకమైన డీఎస్పీ నియామకంలో ఉన్నతాధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారనేది ప్రశ్నార్థకం. ఏదిఏమైనా కొత్త జిల్లాను ఇచ్చి మా ఆకాంక్షలను నెరవేర్చిన సీఎం చంద్రబాబునా యుడు పాలనా విషయంపై దృష్టి సారించి గాడిలో పెట్టాలని ఆ జిల్లా ప్రజానీకం కోరుతోంది.

Updated Date - May 02 , 2026 | 03:23 AM