Share News

అగ్ని ప్రమాదమా? తగులబెట్టారా?

ABN , Publish Date - Feb 08 , 2026 | 11:58 PM

గుడ్లూరు మండలం చేవూరు వద్ద ఉన్న ఇండోసోల్‌ సోలార్‌ పరిశ్రమ కోసం చేవూరు చెరువు నుంచి ఏర్పాటు చేసిన పైప్‌లైను అగ్నికి ఆహుతైంది. ఇండోసోల్‌ సోలార్‌ పలకల తయారీకి అవసరమైన నీటిని చేవూరు చెరువు నుంచి తరలించుకునేందుకు వీలుగా కొద్దినెలల క్రితం పైప్‌లైను వేస్తుండగా గ్రామ రైతులు అడ్డుకున్నారు.

అగ్ని ప్రమాదమా? తగులబెట్టారా?
ఇండోసోల్‌ పరిశ్రమ కోసం చేవూరు చెరువు నుంచి ఏర్పాటు చేసిన పైప్‌లైను తగులబడుతున్న దృశ్యం

ఇండోసోల్‌ పైప్‌లైను అగ్నికి ఆహుతి

పోలీసులకు ఫిర్యాదుచేసిన సంస్థ ప్రతినిధులు

కందుకూరు, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : గుడ్లూరు మండలం చేవూరు వద్ద ఉన్న ఇండోసోల్‌ సోలార్‌ పరిశ్రమ కోసం చేవూరు చెరువు నుంచి ఏర్పాటు చేసిన పైప్‌లైను అగ్నికి ఆహుతైంది. ఇండోసోల్‌ సోలార్‌ పలకల తయారీకి అవసరమైన నీటిని చేవూరు చెరువు నుంచి తరలించుకునేందుకు వీలుగా కొద్దినెలల క్రితం పైప్‌లైను వేస్తుండగా గ్రామ రైతులు అడ్డుకున్నారు. చెరువు కింద వరి సాగులో ఉందని, పంట పొలాలకు వెళ్లే నీటిని అక్రమంగా తరలించడం సరికాదని అభ్యంతరం చెప్పారు. అదేసమయంలో ఇండోసోల్‌ పైప్‌లైను పనులు నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్‌ వేసి స్టే ఉత్తర్వులు తెచ్చారు. దీంతో శాశ్వత పైప్‌లైను నిర్మాణ పనులను నిలిపివేసిన ఇండోసోల్‌ సంస్థ ప్రతినిధులు చెరువు నుంచి పరిశ్రమ వరకు తాత్కాలిక పైప్‌లైను ఏర్పాటు చేసుకొని మోటార్ల ద్వారా చెరువు నీటిని తరలించుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఆదివారం పైప్‌లైను అగ్నికి ఆహుతవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి పైప్‌లైను తగులబడుతుండగా ఆదివారం ఉదయం గుర్తించిన కొందరు ఇండోసోల్‌ సంస్థ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. వారు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే దాదాపుగా తగులబడిపోయింది. పైప్‌లైనుకు స్థానికులు నిప్పంటించారా? లేక అగ్నిప్రమాదం వల్ల జరిగిందా? అనేది తేలాల్సి ఉంది. చేవూరు చెరువు నుంచి తమ పరిశ్రమకు వేసిన పైప్‌లైను తగలబడటం వల్ల 12 లక్షల ఆస్తినష్టం సంభవించిందని ఇండోసోల్‌ ప్రతినిధులు గుడ్లూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - Feb 08 , 2026 | 11:58 PM