Share News

ఇరిగేషన్‌ పునర్వ్యవస్థీకరణ ఇంకెంతకాలం?

ABN , Publish Date - Apr 09 , 2026 | 11:44 PM

మార్కాపురం జిల్లా ఏర్పాటై మూడు నెలలు పూర్తయినా నేటికీ ఇరిగేషన్‌ శాఖ కార్యకలాపాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నట్టుగానే కొనసాగుతోంది. డివిజన్‌, సబ్‌డివిజన్‌ వ్యవస్థలో మార్పుల ఊసేలేదు. కొత్తగా మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం నాలుగు నియోజకవర్గాలతో నూతన జిల్లా ఏర్పాటైన తరువాత అంతకు ముందు ఉన్న రూపు నుంచి అన్ని శాఖల పునర్వ్యవస్థీకరణ జరుగుతోంది. మొత్తం 21 మండలాల పరిధిలోని సబ్‌ డివిజన్‌లు జిల్లా పరిధిలో ఉండేలా రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే పలు శాఖలు మార్పులు జరగ్గా ఇంకా కొన్ని శాఖల్లో పాత పద్ధతిలోనే కార్యకలాపాలు కొనసాగుతూ సాంకేతిక వివరాల నమోదు కూడా ఒంగోలు పేరుతోనే జరుగుతోంది. అటువంటి శాఖల్లో ఇరిగేషన్‌ ఒకటి.

ఇరిగేషన్‌ పునర్వ్యవస్థీకరణ  ఇంకెంతకాలం?

ఒంగోలులో కొన్ని సబ్‌డివిజన్‌లు మార్కాపురం డివిజన్‌లో కొన్ని మండలాలు

ప్రస్తుతం ముమ్మరంగా జలసంరక్షణ పనులు

సిబ్బంది కొరతతో కూడా అవరోధాలు

పరిపాలన అంతా ఉమ్మడి ప్రకాశం పరిధిలోనే

నూతన జిల్లాపరిధిలోకి రాని అన్ని సబ్‌డివిజన్‌లు

మార్కాపురం జిల్లా ఏర్పాటై మూడు నెలలు పూర్తయినా నేటికీ ఇరిగేషన్‌ శాఖ కార్యకలాపాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నట్టుగానే కొనసాగుతోంది. డివిజన్‌, సబ్‌డివిజన్‌ వ్యవస్థలో మార్పుల ఊసేలేదు. కొత్తగా మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం నాలుగు నియోజకవర్గాలతో నూతన జిల్లా ఏర్పాటైన తరువాత అంతకు ముందు ఉన్న రూపు నుంచి అన్ని శాఖల పునర్వ్యవస్థీకరణ జరుగుతోంది. మొత్తం 21 మండలాల పరిధిలోని సబ్‌ డివిజన్‌లు జిల్లా పరిధిలో ఉండేలా రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే పలు శాఖలు మార్పులు జరగ్గా ఇంకా కొన్ని శాఖల్లో పాత పద్ధతిలోనే కార్యకలాపాలు కొనసాగుతూ సాంకేతిక వివరాల నమోదు కూడా ఒంగోలు పేరుతోనే జరుగుతోంది. అటువంటి శాఖల్లో ఇరిగేషన్‌ ఒకటి.

మార్కాపురం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం జిల్లాలో మొత్తం 21 మండలాలు ఉన్నాయి. అందులో ఇరిగేషన్‌(జలవనరుల) శాఖకు సంబంధించి మార్కాపురం డివిజన్‌లో వివిధ సెక్షన్‌లు కలిపి నాలుగు సబ్‌ డివిజన్‌లు ఉన్నాయి. అవి మార్కాపురం, కంభం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం. దర్శి నియోజకవర్గంలోని దొనకొండ మండలం మార్కాపురం సబ్‌ డివిజన్‌లో ఉంది. కనిగిరి నియోజకవర్గంలోని ఆరుమండలాలను రెండు సెక్షన్‌లు చేసి కనిగిరి 1, 2గా ఉంచి వాటిని ఒంగోలు డివిజన్‌లో ఉంచారు. పొదిలి, కొనకనమిట్ల మండలాలు కూడా ఒంగోలు డివిజన్‌లో ఉండిపోయాయి. ప్రస్తుతం జిల్లా ఏర్పడిన కారణంగా అన్ని సబ్‌ డివిజన్‌ల స్వరూపం జిల్లా పరిధిలోనే ఉండేలా పునర్వ్యవస్థీకరణ జరగాల్సి ఉంది. ఇప్పటికీ పనుల అంచనాలు, ఆమోదాలు, బిల్లుల అప్లోడ్‌ కోసం ఎప్పటిలాగానే కొన్ని సబ్‌డివిజన్‌లు ఒంగోలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా అధికారి పోస్టు కూడా ఒంగోలు ఇన్‌చార్జి కావటంతో పాత పద్ధతిలోనే అన్ని పనులు ఒంగోలు కేంద్రంగానే జరగాల్సి వస్తోంది.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జలసంరక్షణ, చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులకు అంచనాలు రూపొందించటం, ఆమోదం, టెండర్ల ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది. ఆ సమయంలో ఉమ్మడి జిల్లా పరిధిలోనే అన్నీ జరుగుతుండటంతో పాటు ఆ శాఖలో ఉన్న సిబ్బంది కొరత కూడా ఇబ్బందిగా మారింది. మార్కాపురం డివిజన్‌లోని 4 సబ్‌ డివిజన్‌ల పరిధిలో 18 మంది ఏఈలు ఉండాల్సి ఉంటే కేవలం ఏడుగురితో పనులు నెట్టుకొస్తున్నారు. పొదిలి, కొనకనమిట్ల రెండు మండలాలకు కూడా ఒక్క ఏఈ ద్వారానే పనులు చేయిస్తున్నారు. కనిగిరిలో మాత్రమే 5 సెక్షన్‌లకు సరిపడా ఏఈలు ఉన్నారు.

ఎన్నెస్పీదీ అదే పరిస్థితి

మార్కాపురం జిల్లాలో ఎన్నెస్పీ పరిధి కూడా అదే పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో కురిచేడు, దర్శి, త్రిపురాంతకం, ముండ్లమూరు సబ్‌ డివిజన్‌లు దర్శి డివిజన్‌గా ఉన్నాయి. వీటిలో త్రిపురాంతకం సబ్‌డివిజన్‌ మాత్రమే ఇప్పుడు మార్కాపురం జిల్లాలో ఉండింది.

దీంతో ఎన్నెస్పీ సబ్‌డివిజన్‌ను ఎలా విభజిస్తారనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఇక జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణలో అన్ని సబ్‌ డివిజన్‌లు జిల్లా పరిధిలో ఉండేలా చేస్తూ ఇప్పుడు ఉన్న మార్కాపురం డివిజన్‌కు తోడు మరో కొత్త డివిజన్‌ ఏర్పాటు కావాల్సి ఉందని చెబుతున్నారు. రెండు డివిజన్‌ల పరిధిలో సబ్‌ డివిజన్‌లను కూడా పునర్వ్యవస్థీకరణ చేయాల్సి ఉంటుంది. సరిపడా సిబ్బందితోపాటు కొత్త డివిజన్‌ ఏర్పాటుతో అధికారుల నియామకం జరగటం, జిల్లా అధికారి పోస్టు భర్తీ చేయటం జరగాలి. ఇవన్నీ పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం జరిగితేనే ప్రస్తుత ప్రాధాన్యత గల పనుల్లో ఒకటైన ఇరిగేషన్‌ శాఖ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టగలదు. మరి ఉన్నతాధికారులు దీనిపై ఎంత సమయంలో నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Updated Date - Apr 09 , 2026 | 11:44 PM