మర్లపాడులో ఇనుపశుద్ధి కర్మాగారం
ABN , Publish Date - Jun 24 , 2026 | 03:03 AM
జిల్లా అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో టంగుటూరు మండలం మర్లపాడు సమీపంలో రూ.1,230 కోట్ల పెట్టుబడితో ఇనుప శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం
ప్రభుత్వానికి రూ.4,480 కోట్ల ఆదాయం!
ఒంగోలు క్రైం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లా అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో టంగుటూరు మండలం మర్లపాడు సమీపంలో రూ.1,230 కోట్ల పెట్టుబడితో ఇనుప శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. జిందాల్ సౌత్ వెస్ట్ సంస్థ (జేఎస్‌డబ్ల్యూ ప్రైవే ట్ లిమిటెడ్), ఏపీఎండీసీ భాగస్యామ్యంతో అక్కడ భారీ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. అందుకు మర్లపాడు- కొణిజేడు గ్రామాల సమీపంలో 1,300 ఎకరా లను ఏపీఎండీసీ నుంచి 15 ఏళ్లు లీజు పద్ధతిలో కేటాయించనున్నారు. ఏడాదికి ఐదు మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని శుద్ధి చేసే సామర్థ్యంతో జిందాల్ సంస్థ ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేసింది. ఏపీఎండీసీకి ఎలాంటి మూలధనం లేకుండా 11 శాతం రాయల్టీ రూపంలో ఇవ్వనుంది. అంచనా ప్రకారం 15 ఏళ్లలో ప్రభుత్వానికి దాదాపు రూ.4,480 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. భారీగా ఉపాధి కల్పన కూడా లభిస్తుంది. భారతీయ గనుల బ్యూరో నిర్ణయించిన ధర ప్రకారం మర్లపాడు ప్రాంతంలో ముడి ఇనుమును జేఎస్‌డబ్ల్యూ సంస్థ సేకరిస్తుంది. ఈ ప్రాంతంలో దొరికే ఐరన్ ఓర్ 30శాతం కటెంట్ ఉండటంతో అత్యాధునిక పద్ధతుల ద్వారా శుద్ధి చేయనుంది. ఆ నాణ్యమైన ఖనిజాన్ని మార్కెట్లో విక్రయించడంతోపాటు కడపలో జేఎస్‌డబ్ల్యూ నిర్మిస్తున్న తన సొంత ప్లాంటులో కూడా వినియోగిస్తుంది. 2027 డిసెంబరు నాటికి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.