Share News

కోల్‌ సొసైటీపై విచారణ తాత్కాలిక నిలుపుదల

ABN , Publish Date - Feb 08 , 2026 | 12:03 AM

ఒంగోలు కేంద్రంగా నడుస్తున్న కోల్‌సొసైటీపై సహకారశాఖ అధికారులు చేపట్టిన విచారణ హైకోర్టు నిలిపివేసింది. ఇందుకు సంబంధించి జిల్లా సహకార అధికారి(డీసీవో) గత నెల 19న ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేయగా శనివారం ఆ ఉత్తర్వులు సంబంధిత అధికారులకు చేరాయి.

కోల్‌ సొసైటీపై విచారణ   తాత్కాలిక నిలుపుదల

ఒంగోలు, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు కేంద్రంగా నడుస్తున్న కోల్‌సొసైటీపై సహకారశాఖ అధికారులు చేపట్టిన విచారణ హైకోర్టు నిలిపివేసింది. ఇందుకు సంబంధించి జిల్లా సహకార అధికారి(డీసీవో) గత నెల 19న ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేయగా శనివారం ఆ ఉత్తర్వులు సంబంధిత అధికారులకు చేరాయి. కోల్‌సొసైటీ ఎన్నికల నిర్వహణ, పాలకవర్గం ఏర్పాటు, ఆ సంస్థ ప్రాంగణంలో భవన నిర్మాణాలు, అందుకు బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడం ఇలా అన్నీ నిబంధనలకు విరుద్ధమని, అవినీతి, అక్రమాలు పెద్దఎత్తున జరిగాయని, చర్యలు తీసుకోవాలని మద్దిరాలపాడుకు చెందిన షేక్‌ ఖాజావలి, మరొకరు సహకారశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తర్వాత హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం విదితమే. తొలుత ఈ విషయాన్ని అంతగా పట్టించుకోని సహకారశాఖ ఉన్నతాధికారులు విషయం హైకోర్టు వరకు వెళ్లడంతో కదిలారు. కోల్‌ సొసైటీపై వచ్చిన ఫిర్యాదులపై సెక్షన్‌ 52 విచారణ తక్షణం చేపట్టి నివేదించాలని సహకార శాఖ కమిషనర్‌ ఆదేశించడంతో ఒంగోలు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ నర్రా సురేంద్రబాబును విచారణాధికారిగా నియమించి రెండు మాసాల్లో నివేదిక ఇవ్వాలని గత నెల 19న అప్పటి డీసీవో శ్రీలక్ష్మీ ఉత్తర్వులు ఇచ్చారు. తదనుగుణంగా సురేంద్రబాబు విచారణ చేపట్టగా కోల్‌ సొసైటీ పాలకమండలి, బిజినెస్‌ మేనేజర్‌ల నుంచి తగు సహకారం అందలేదు. అందుకు వారిపై చర్యలకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకునే ప్రయత్నంలో సురేంద్రబాబు ఉన్నారు. ఈ లోపు తమ సంస్థపై సెక్షన్‌ 52 విచారణను సవాల్‌ చేస్తూ కోల్‌సొసైటీ పాలకవర్గ అధ్యక్షురాలు తాటిపర్తి ఉదయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా అధికారులు జారీచేసిన విచారణ ఉత్తర్వులను రద్దుచేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాస్‌ కోల్‌ సొసైటీపై డీసీవో ఇచ్చిన విచారణ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే ప్రతివాదులైన సహకార శాఖ అధికారులను అఫిడవిట్లు దాఖలు చేయాలని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు విచారణపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించారు.

Updated Date - Feb 08 , 2026 | 12:03 AM