కోల్ సొసైటీపై విచారణ ప్రారంభం
ABN , Publish Date - Jan 28 , 2026 | 02:28 AM
ఒంగోలు కేంద్రంగా నడుస్తున్న కోల్ సొసైటీపై వచ్చిన ఫిర్యాదులపై ఎట్టకేలకు విచారణ ప్రారంభమైంది. విచారణాధికారైన ఒంగోలు డీఎల్‌సీవో కార్యాలయంలోని అసిస్టెంట్ రిజి స్ట్రార్ నర్రా సురేంద్రబాబు అందుకు సంబంధించి నోటీసులు జారీ చేశారు.
సహకార అధికారులు, సొసైటీ బాధ్యులకు నోటీసులు
వారంలోపు రికార్డులు అప్పగించాలని ఆదేశం
ఒంగోలు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు కేంద్రంగా నడుస్తున్న కోల్ సొసైటీపై వచ్చిన ఫిర్యాదులపై ఎట్టకేలకు విచారణ ప్రారంభమైంది. విచారణాధికారైన ఒంగోలు డీఎల్‌సీవో కార్యాలయంలోని అసిస్టెంట్ రిజి స్ట్రార్ నర్రా సురేంద్రబాబు అందుకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా 2018లో అలాగే 2023లో రెండుసార్లు కోల్ సొసైటీ ఎన్నికను ప్రైవేటు వ్యక్తుల ద్వారా నిర్వహించుకున్నారని, అలా ఎన్నికైన పాలకవర్గాన్ని రద్దు చేయాలని కోరడంతోపాటు ఇతర పలు ఫిర్యాదులతో ఒకవైపు హైకోర్టులో పిటిషన్, మరోవైపు సహకారశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లిన విషయం విదితమే. ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన జిల్లా, రాష్ట్ర సహకారశాఖ అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు నేపథ్యంలో కదిలారు. సహకారశాఖ కమిషనర్ అహ్మద్‌బాబు ఆదేశాలతో డీసీవో శ్రీలక్ష్మి వారం క్రితం అసిస్టెంట్ సబ్ రిజిస్ట్రార్ సురేంద్రబాబును విచారణాధికారిగా నియమించి కోల్ సొసైటీపై సెక్షన్ 52 విచారణకు ఆదేశించారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై ఈ విచారణ నిర్ధిష్టంగా సాగాల్సి ఉండగా అందుకు ఇటు సహకారశాఖ కార్యాలయాలు, అటు కోల్ సొసైటీలోనూ రికార్డులు కీలకం కానున్నాయి. దీంతో ఆ రికార్డుల కోసం విచారణాధికారైన సురేంద్రబాబు మంగళవారం నోటీసులు ఇచ్చారు. సొసైటీకి సంబంధించి 018 నుంచి ఇప్పటివరకు జిల్లా సహకారశాఖ అధికారి, ఒంగోలు డివిజనల్ సహకారాధికారి, జిల్లా సహకార ఆడిట్ అధికారి కార్యాలయాల నుంచి సాగిన ఉత్తర, ప్రత్యుత్తరాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని ఆ కార్యాలయాల అధికారులకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు ప్రస్తుతం కోల్ సొసైటీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న వారికి అలాగే బిజినెస్ మేనేజర్లకు అదే కాలానికి సంబంధించి సొసైటీ కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులను అందజేయాలని నోటీసులు పంపారు. ఆయా అధికారులు, ఇటు సొసైటీ బాధ్యులు వచ్చేనెల 2లోపు తాను కోరిన రికార్డులు ఇవ్వాలని ఆ నోటీసుల్లో విచారణాధికారి సురేంద్రబాబు కోరినట్లు సమాచారు.