Share News

అంతర్‌ జిల్లా దొంగల ముఠా అరెస్టు

ABN , Publish Date - Feb 04 , 2026 | 02:53 AM

పనులు నిలిపివేసి ఉన్న గ్రానైట్‌ ఫ్యాక్టరీలు, పంట పొలాల్లో మోటార్ల కేబుల్‌ వైర్లను చోరీలు చేస్తున్న అంతర్‌ జిల్లాల దొంగల ముఠాను బల్లికురవ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాలను మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో సంతమాగులూరు సీఐ కాకుమాను వెంకట్రావు, ఎస్‌ఐ యామినేని నాగరాజు వెల్లడించారు.

అంతర్‌ జిల్లా దొంగల ముఠా అరెస్టు
వివరాలను వెల్లడిస్తున్న సీఐ వెంకట్రావు, ఎస్‌ఐ నాగరాజు

రాగి తీగల చోరీ కేసుల్లో ఐదుగురు నిందితులు

రూ.4.40లక్షల విలువైన కేబుల్‌ స్వాధీనం

బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలలో పలు కేసులు

వివరాలను వెల్లడించిన సీఐ వెంకట్రావు, ఎస్‌ఐ నాగరాజు

బల్లికురవ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : పనులు నిలిపివేసి ఉన్న గ్రానైట్‌ ఫ్యాక్టరీలు, పంట పొలాల్లో మోటార్ల కేబుల్‌ వైర్లను చోరీలు చేస్తున్న అంతర్‌ జిల్లాల దొంగల ముఠాను బల్లికురవ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాలను మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో సంతమాగులూరు సీఐ కాకుమాను వెంకట్రావు, ఎస్‌ఐ యామినేని నాగరాజు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల మేరకు... బాపట్ల మండలం పిన్నివారిపాలేనికి చెందిన కొమరగిరి ప్రసాద్‌, అదే ప్రాంతంలోని రామకృష్ణాపురానికి చెందిన ఈటీ లక్ష్మీనారాయణ, కర్లపాలెం మండలం నందాయిపాలేనికి చెందిన కల్లూరి ఏసోబు, నల్లమోతువారిపాలేనికి చెందిన రావినూతల రాజశేఖర్‌, సంతమాగులూరు మండలం మిన్నెకల్లుకు చెందిన కాశిమళ్ల శ్యాంబాబులు ఐదుగురు ఒక ముఠాగా ఏర్పడ్డారు. చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. తాము చేస్తున్న వృత్తిలో ఆదాయం రాకపోవడంతో చోరీలకు అలవాటు పడ్డారు. రాత్రిపూట గ్రామాల్లో తిరుగుతూ పనులు నిలిపివేసి ఉన్న గ్రానైట్‌ ఫ్యాక్టరీలలో విలువ కలిగిన కేబుల్‌ వైర్లను తస్కరిస్తున్నారు. అలానే రైతుల పంట పొలాల్లో మోటార్ల కేబుల్‌ వైర్లను కట్‌ చేసి అమ్ముతున్నారు. ఈ ముఠాను మంగళవారం ఎస్‌ఐ నాగరాజు అదుపులోకి తీసుకుని విచారించగా అంతర్‌ జిల్లాల పరిధిలో చోరీలు చేసినట్లు తేలింది. బల్లికురవ స్టేషన్‌ పరిధిలో 3 చోరీలలో 50 కేజీల రాగి వైరు, నరసరావుపేట పోలీసు స్టేషన్‌ పరిధిలో ఒక కేసులో 30 కేజీల రాగి వైరు, అద్దంకి స్టేషన్‌ పరిధిలో ఒక కేసులో 20 కేజీల వైరు, బాపట్ల రూరల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఒక కేసులో రాగి వైరును చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారు. వారి వద్ద 6 కేసులకు సంబంధించి సుమారు రూ.4.40 లక్షల విలువైన 100 కేజీల రాగి వైరును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ చూసిన అధికారులను ఎస్పీ హర్ణవర్ధన్‌రాజు ప్రత్యేకంగా అభినందించారు.

పోలీసు సిబ్బందికి నగదు రివార్డులు అందజేత

కేబుల్‌ వైర్లను చోరీ చేస్తున్న అంతర్‌ జిల్లా దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న ఎస్‌ఐ యామినేని నాగరాజు, హెడ్‌ కానిస్టేబుల్‌ కె.ఏడుకొండలు, కానిస్టేబుల్స్‌ ఆర్‌. సునీల్‌, బి.ప్రేమనిధి, హోంగార్డులు అడపాల రవి, టి.నాగరాజులకు ఎస్పీ నగదు రావార్డులను ప్రకటించారు. రివార్డులను సీఐ వారికి అందజేశారు.

ఎస్‌ఐకు అభినందనలు

నెల వ్యవధిలోనే రైతులకు చెందిన ట్రాక్టర్‌ ట్రక్కులు, రోటావేటర్లు, చోరీలు చేస్తున్న దొంగల ముఠాను, గ్రానైట్‌ ఫ్యాక్టరీలు, వ్యవసాయ మోటార్లకు ఉన్న కేబుల్‌ వైర్లను చోరీలు చేస్తున్న మరో అంతర్‌ జిల్లాల దొంగలను ఎస్‌ఐ యామినేని నాగరాజు సిబ్బందితో పట్టుకోవటంతో పోలీసు ఉన్నతాధికారుల నుంచి అభినందనలు అందుకున్నారు. నెలరోజుల వ్యవధిలోనే రెండు భారీ కేసులను ఛేదించటం పట్ల సీఐ వెంకట్రావు పోలీసు సిబ్బందిని అభినందించారు. రానున్న రోజుల్లో ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలని అయన అన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 02:53 AM