ఇంటర్ పబ్లిక్ పరీక్షల ప్రక్షాళన
ABN , Publish Date - Oct 29 , 2026 | 02:44 AM
వచ్చే ఏడాది జరగనున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకు అనుగుణంగా కీలక మార్పులకు బోర్డు చర్యలు చేపట్టింది. పరీక్షలు సజావుగా, మరింత సులభతరంగా నిర్వహించడం, ప్రశ్నపత్రాల్లో స్పష్టత పెంచడమే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలను ఇచ్చింది.
కీలక మార్పులు చేసిన బోర్డు
ఒంగోలు విద్య, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : వచ్చే ఏడాది జరగనున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకు అనుగుణంగా కీలక మార్పులకు బోర్డు చర్యలు చేపట్టింది. పరీక్షలు సజావుగా, మరింత సులభతరంగా నిర్వహించడం, ప్రశ్నపత్రాల్లో స్పష్టత పెంచడమే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలను ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి రంజిత్‌బాషా ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సాధారణ థియరీ, సబ్జెక్టుల పరీక్షలన్నింటికీ 32 పేజీలతో కూడిన ఒకే రకమైన జవాబుపత్రాన్ని ఇవ్వనున్నారు. వృత్తి విద్య కోర్సులకు మాత్రం ప్రస్తుతం అమలులో ఉన్న 24పేజీల జవాబు పుస్తకాన్ని కొనసాగిస్తారు. అదనపు పత్రాలతో పనిలేకుండా విద్యార్థులు ఒకే జవాబు పుస్తకంలో సమాధానాలు రాసేలా మార్పులు చేశారు.
బయాలజీ పరీక్షలో మార్పులు
బయాలజీ పరీక్ష నిర్వహణకు సంబంధించి కీలక మార్పులు చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం బోటనీ, జువాలజీ పరీక్షలకు వేర్వేరుగా ఓఎంఆర్ షీట్లు ఇచ్చే పాత విధానానికి ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి స్వస్తి పలికారు. ఒకే ఓఎంఆర్ షీట్‌తోపాటు 40 పేజీల జవాబు పుస్తకాన్ని అందించనున్నారు. దీని వల్ల బోటనీ, జువాలజీ రెండు సబ్జెక్టుల జవాబులు ఒకే సమాధాన పుస్తకంలో విద్యార్థులు రాస్తారు. తద్వారా పరీక్షల నిర్వహణలో సమన్వయం పెరగడంతోపాటు విద్యార్థులకు పరీక్ష రాయడం మరింత సౌకర్యవంతంగా మారనుంది. పరీక్షల్లో పార్ట్-2లోని భాషా సబ్జెక్టులకు బదులుగా విద్యార్థులు గ్రూపు సబ్జెక్టులను ఎంపిక చేసుకునేందుకు బోర్డు అవకాశం కల్పించింది. ఈ సెలక్టివ్ సబ్జెక్టులను ఎంపిక చేసుకున్న వారికి గతేడాది సాధారణ పరీక్షల ప్రశ్న పత్రాలనే ఇచ్చారు. ప్రస్తుతం ఆ విధానాన్ని మార్చి సెలక్టివ్ సబ్జెక్టులైన గణితం, భౌతిక శాస్త్రం, హిస్టరీలకు ప్రశ్నపత్రాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు పరీక్షల నిర్వహణలో చేసిన మార్పులను విద్యార్థు లకు తెలియజేయాలని అన్ని జూనియర్ కళాశాలలకు ఉత్తర్వులు పంపారు.