క్రికెట్ బెట్టింగ్‌లపై ముమ్మర దర్యాప్తు
ABN , Publish Date - Mar 22 , 2026 | 01:33 AM
క్రికెట్ బెట్టింగ్‌ల వ్యవహారంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కీలక సూత్రధారుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఇటీవల క్రికెట్ బెట్టింగ్‌ల్లో అరెస్టయిన నలుగురు నిందితులను కోర్టు ద్వారా కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు.
ముగిసిన నిందితుల కస్టడీ
మూడురోజులుగా ప్రశ్నించిన పోలీసులు
సూత్రధారుల వివరాలను సేకరించినట్లు సమాచారం
దర్శి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): క్రికెట్ బెట్టింగ్‌ల వ్యవహారంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కీలక సూత్రధారుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఇటీవల క్రికెట్ బెట్టింగ్‌ల్లో అరెస్టయిన నలుగురు నిందితులను కోర్టు ద్వారా కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. బెట్టింగ్‌లో కీలకంగా ఎవరు వ్యవహరిస్తున్నారు.. ఏఏ ప్రాంతాల్లో జరుగుతుందన్న విషయాలను నిందితుల ద్వారా పోలీసు అధికారులు రాబట్టినట్లు తెలిసింది. మరోవైపు రెండురోజుల క్రితం దర్శి డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ రామారావు అనుమానితులుగా ఉన్న కొంతమందిని సర్కిల్ కార్యాలయానికి పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. నగదు లావాదేవీలు ఎక్కడి నుంచి ఎవరెవరికి జరిగాయన్న విషయమై ఆరా తీసినట్లు సమాచారం. అటు కస్టడీలోకి తీసుకున్న నిందితులు, ఇటు అనుమానితుల ద్వారా కీలకమైన సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. దర్శి ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్‌ల వ్యవహారం పెద్ద జాడ్యంగా మారింది. లక్షలాది రూపాయలు అప్పులుచేసి తీర్చలేక పలువురు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. పలు కుటుంబాల వారు ఆస్తులమ్మి అప్పులు కట్టారు. బెట్టింగ్‌ల బెడద తట్టుకోలేక అనేక మంది పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయటంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి దర్శిలో ముగ్గురు నిర్వాహకులను, నరసరావుపేటలో మరో కీలక వ్యక్తిని అరెస్టు చేసిన విషయం విదితమే. అప్పటి నుంచి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.