Share News

అక్రమాలను తేల్చేందుకు పరిశీలన

ABN , Publish Date - Feb 12 , 2026 | 02:48 AM

ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖలో టెండర్ల ప్రక్రియలో జరిగిన అక్రమాలను నిగ్గుతేల్చేందుకు విచారణ కమిటీ బుధవారం దర్శి నియోజకవర్గంలో పర్యటించింది. డీపీవో ఎం.వెంకటేశ్వరరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి జాన్సన్‌, పీఆర్‌ ఈఈ వేణుగోపాల్‌రెడ్డితో కూడిన ఈ కమిటీ స్థానిక ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో మాట్లాడింది.

అక్రమాలను తేల్చేందుకు పరిశీలన
ఆర్‌డబ్ల్యూఎస్‌ సిబ్బందితో మాట్లాడుతున్న విచారణ కమిటీ

దర్శి నియోజకవర్గంలో పర్యటించిన విచారణ కమిటీ

ఆర్‌డబ్ల్యూఎస్‌లో టెండర్ల వ్యవహారంపై ఆరా

రక్షిత నీటి పథకాల పరిశీలన

దర్శి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖలో టెండర్ల ప్రక్రియలో జరిగిన అక్రమాలను నిగ్గుతేల్చేందుకు విచారణ కమిటీ బుధవారం దర్శి నియోజకవర్గంలో పర్యటించింది. డీపీవో ఎం.వెంకటేశ్వరరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి జాన్సన్‌, పీఆర్‌ ఈఈ వేణుగోపాల్‌రెడ్డితో కూడిన ఈ కమిటీ స్థానిక ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో మాట్లాడింది. అనంతరం దర్శి, ముండ్లమూరు, కురిచేడు, చందవరం రక్షిత మంచినీటి పథకాలను పరిశీలించింది. దర్శి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలతోపాటు మరికొన్నచోట్ల ఓఅండ్‌ఎం పనుల నిర్వహణకు సంబంధించి కాంట్రాక్టు సిబ్బంది నియామకానికి సంబంధించి జరిగిన టెండర్ల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఆర్‌డబ్ల్యూఎస్‌ పర్యవేక్షక ఇంజనీర్‌ బాలశంకర్‌ను కలెక్టర్‌ ప్రభుత్వానికి సరెండర్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు కమిటీ అన్ని కోణాల్లో పరిశీలన చేసింది. 2025-26 సంవత్సరానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ గత మార్చిలోనే పూర్తి చేయాల్సి ఉండగా, ఉద్దేశపూర్వకంగా జూలై వరకు టెండర్లను ప్రారంభించకుండా అలాగే కొనసాగించినట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఆలస్యంగా టెండర్లను ఓపెన్‌ చేసి కొత్త కాంట్రాక్టర్‌కు బాధ్యతలను అప్పగించారు. మొత్తంగా టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై మరింత లోతుగా పరిశీలించేందుకు విచారణ కమిటీ వివరాలను సేకరించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమాల నిగ్గు తేల్చి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు.

Updated Date - Feb 12 , 2026 | 02:48 AM