‘మిడ్‌వెస్ట్’లో మూడోరోజూ కొనసాగిన విచారణ
ABN , Publish Date - Oct 06 , 2026 | 01:46 AM
మండలంలోని ఆర్‌ఎల్‌పురం పరి ధి మిడ్‌వెస్ట్ క్వారీలో చోటుచేసుకున్న ప్రమాదంపై డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీఎంఎస్) వేణుగోపాలస్వామి తన విచారణను మూడోరోజైన సోమ వారం కూడా కొనసాగించారు. ప్రమాదం జరిగిన అనంతరం ఆరుగురు వలస కార్మికులు మిస్సింగ్ అయ్యారనే అనుమానాలు, వారిని క్వారీకి పంపి న మేస్త్రి సంజయ్ కనపడటం లేదన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో సోమ వారం డీఎంఎస్ ఎదుట సంజయ్ హాజరయ్యారు.
డీఎంఎస్ ఎదుట హాజరైన మేస్త్రి సంజయ్
తాను పంపిన కార్మికులెవ్వరూ మిస్సింగ్ కాలేదని వివరణ
చీమకుర్తి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ఆర్‌ఎల్‌పురం పరి ధి మిడ్‌వెస్ట్ క్వారీలో చోటుచేసుకున్న ప్రమాదంపై డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీఎంఎస్) వేణుగోపాలస్వామి తన విచారణను మూడోరోజైన సోమ వారం కూడా కొనసాగించారు. ప్రమాదం జరిగిన అనంతరం ఆరుగురు వలస కార్మికులు మిస్సింగ్ అయ్యారనే అనుమానాలు, వారిని క్వారీకి పంపి న మేస్త్రి సంజయ్ కనపడటం లేదన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో సోమ వారం డీఎంఎస్ ఎదుట సంజయ్ హాజరయ్యారు. అనుమానాలు సందేహాలను పటాపంచలు చేస్తూ డీఎంఎస్ ఎదుట వీడియో వాంగ్మూలం ఇచ్చారు. ప్రమాదం జరిగిన రోజు మొదటి షిఫ్ట్ పనికి తన వద్ద ఉన్న 26మందిని పంపించానని తెలిపారు. ఇప్పుడు వారందరూ లేకుండా సురక్షితంగా ఉన్నారని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. ఈ అంశంపై సంజయ్‌ను డీఎంఎస్ పలు కోణాలలో ప్రశ్నించారు. తన వద్ద ఉన్న కార్మికులందరూ సురక్షితంగానే ఉన్నారని ఘంటాపథంగా, సాక్ష్యాధారలతో తెలిపినట్లు సమాచారం. దీంతో ఆరుగురు కార్మికులు మిస్సింగ్, తదితర అనుమానాలు అన్ని అపోహలే అని అవగతమవుతుంది. ఒక క్వారీలో ప్రమాదం అనంతరం ప్రాణాపాయం జరిగిందన్న విషయం నిర్ధారణ కాని నేపఽథ్యంలో డీఎంఎస్ స్థాయి అధికారి ఇన్ని రోజుల పాటు విచారణ చేపట్టడం ఇదే తొలిసారి. విశ్వసనీయ సమాచారం మేరకు డీఎంఎస్ క్వారీలో ప్రమాదం జరగటానికి ప్రధాన కారణం, ఇదే తరహా ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత పిట్ లోపలికి వెళ్లడం కష్టతరమైనా అక్కడకు స్వయంగా వెళ్లి ఏదైనా దుర్వాసన వస్తుందా.. ఎవరైనా పొరపాటున శిథిలాల కింద ఉన్నారా అని నిర్ధారణ కోసం వలస కార్మికులను సైతం లోపలికి తీసుకువెళ్లి అన్ని భాషలలో పెద్దగా పిలిపించడం ఆయన నిబద్ధతకు అద్దం పడుతోంది. గనుల భద్రతా సర్కిల్లో సిన్సియర్ ఆఫీసర్‌గా పేరుగాంచిన వేణుగోపాలస్వామి తన దర్యాప్తును ఎన్నిరోజులకు ముగిస్తాడో, తదుపరి నివేదికలో ఎటువంటి అంశాలు పొందుపరుస్తారో అన్న అంశంపై ఈ ప్రాంతంలో ఉన్న క్వారీ యజమానులు తర్జనభర్జన పడుతున్నారు. మీడియాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, వారిని దూరం పెడుతూ డీఎంఎస్ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. మరోవైపు తమ క్వారీలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేదన్న విషయాన్ని యాజమాన్యం తరఫున మరోసారి కూడా లిఖితపూర్వకంగా పక్కా ఆధారాలతో రికార్డు పూర్వకంగా డీఎంఎస్‌కు మిడ్‌వెస్ట్ క్వారీ మేనేజర్లు సమర్పించినట్లు తెలుస్తుంది.