Share News

తాగునీటి సరఫరాలో అన్యాయం

ABN , Publish Date - Sep 09 , 2026 | 01:55 AM

సాగర్‌ డ్యాం నుంచి తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన నీటి సరఫరాలో కూడా అన్యాయం జరుగుతోంది. వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వాసులు యథేచ్ఛగా అధిక నీరు వాడుకుంటున్నారు.

తాగునీటి సరఫరాలో అన్యాయం
దర్శి బ్రాంచ్‌ కాలువలో అతి తక్కువగా ప్రవహిస్తున్న నీరు

అధికంగా వాడుకుంటున్న ఉమ్మడి గుంటూరు జిల్లావాసులు

2న సాగర్‌ డ్యాం నుంచి విడుదలైన నీరు

ఉమ్మడి ప్రకాశంకు తక్కువగా సరఫరా

ప్రాజెక్ట్‌ నుంచి 6,550 క్యూసెక్కులు రాక

మనకు 2,232 క్యూసెక్కులు మాత్రమే..

వాటా మేరకు 42శాతం రావాల్సి ఉండగా

కేవలం 35శాతానికే పరిమితం

మంచినీటి చెరువులకు చేరని నీరు

చోద్యంచూస్తున్న అధికారులు, నేతలు

సాగర్‌ డ్యాం నుంచి తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన నీటి సరఫరాలో కూడా అన్యాయం జరుగుతోంది. వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వాసులు యథేచ్ఛగా అధిక నీరు వాడుకుంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సాగర్‌ జలాలు అతితక్కువగా సరఫరా అవుతున్నాయి. దీంతో మంచినీటి చెరువులకు నీరు అందడం లేదు. ఇంత అన్యాయం జరుగుతున్నా జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు.

దర్శి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : సాగర్‌ జలాల సరఫరాలో జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఎగువన ఉన్న గుంటూరు జిల్లావాసులు అధికంగా వాడుకుంటూ దిగువకు సరిగ్గా విడుదల చేయడం లేదు. వాటా ప్రకారం రావాల్సిన నీటిలో భారీగా కోత పడుతోంది. దీంతో జిల్లాలోని తాగునీటి వనరులు పూర్తిగా నిండే అవకాశం తక్కువగానే ఉంది. మంచినీటి అవసరాల కోసం పది రోజుల క్రితం సాగర్‌ జలాలు విడుదల చేసిన విషయం విదితమే. వాటితో ఈ నెల 2 నుంచి జిల్లాలోని చెరువులను నింపుతున్నారు. ఇంతలోనే గుంటూరు జిల్లా వాసులు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అధిక నీరు మళ్లించుకుంటున్నారు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తీరని అన్యాయం జరుగుతోంది. ప్రస్తుతం విడుదవుతున్న జలాల వివరాలను పరిశీలిస్తే నీటి దోపిడీ స్పష్టమవుతోంది.

ఓబీసీకి తక్కువగా నీరు

సాగర్‌ కుడికాలువకు డ్యామ్‌ నుంచి 6,550 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండగా అంతే పరిమాణంలో బుగ్గవాగుకు చేరుతోంది. అక్కడి నుంచి సాగర్‌ ప్రధాన కాలువకు 6,150 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి అద్దంకి బ్రాంచ్‌ కాలువ (18వ మైలు ప్రకాశం సరిహద్దు)కు 792 క్యూసెక్కులు, ప్రకాశం జిల్లా సరిహద్దు 85/3వ మైలు వద్ద 1,440 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది. అక్కడ వరకు వచ్చిన నీటిలో నుంచి పమిడిపాడు బ్రాంచ్‌ కాలువకు 200 క్యూసెక్కులు, ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు 420 క్యూసెక్కులు ఇస్తున్నారు. చివరన ఉన్న ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు వచ్చేసరికి అతితక్కువగా నీరు విడుదల అవుతోంది. వాటా ప్రకారం విడుదలైన నీటిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు 42 శాతం నీరు సరఫరా చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 35శాతం మాత్రమే విడుదల చేస్తున్నారు. మిగిలిన నీటిని గుంటూరు జిల్లావాసులు అదనంగా వాడుకుంటున్నారు.

అధిక నీరు వాడుకుంటున్న విషయం వాస్తవమే..

ఈ విషయంపై ఇరిగేషన్‌ అధికారులను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా గుంటూరు జిల్లావాసులు అధిక నీరు వాడుకుంటున్న విషయం వాస్తవమేనన్నారు. మన జిల్లా అధికారులు అక్కడి అధికారులతో మాట్లాడి వాటా ప్రకారం నీరు విడుదల చేయించేందుకు కృషి చేస్తున్నారని చెబుతున్నారు. మూడు రోజులుగా జిల్లాకు అతి తక్కువగా నీరు విడుదలవుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రామతీర్థం జలాశయంతోపాటు మంచినీటి చెరువులకు అంతంత మాత్రంగానే నీరు చేరింది. ఒక్కసారిగా సరఫరా తగ్గిపోవటంతో చెరువులకు నీరు నింపే విషయంతో సమస్య ఉత్పన్నమవుతోంది.

తాగునీటి చెరువులకు అరకొరగా చేరిన నీరు

ప్రస్తుతం జిల్లాలోని తాగు నీటి చెరువులకు అరకొరగానే నీరు చేరింది. ఉదాహరణకు 129 గ్రామాలకు తాగునీరందించే దర్శి ఎన్‌ఏపీ రక్షిత మంచినీటి పథకానికి సంబంధించిన స్టోరేజీ ట్యాంకులో కేవలం 350 మిలియన్‌ లీటర్ల నీరు మాత్రమే నింపగలిగారు. ఈ సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుకు పూర్తిగా మోటార్ల ద్వారా నీరు పంపింగ్‌ చేయాల్సి ఉంది. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఈనెల 2 నుంచి నీరు పంపింగ్‌ ఆరంభించారు. రోజుకు 80 మిలియన్‌ లీటర్ల చొప్పున ఇప్పటికి 350 మిలియన్‌ లీటర్లు నీరు నింపగలిగారు. దర్శి ఎన్‌ఏపీ చెరువు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 2,548 మిలియన్‌ లీటర్లు. సాగర్‌ నీరు విడుదల చేసే సమయానికి చెరువులో 700 మిలియన్‌ లీటర్లు నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం 350 మిలియన్‌ లీటర్లు పంపింగ్‌ చేశారు. దీంతో 1,050 మిలియన్‌ లీటర్ల నీరు నిల్వ చేరింది. ఇంకా 1,500 మిలియన్‌ లీటర్ల మేర నింపాల్సి ఉంది. ప్రస్తుతం నీటి పంపింగ్‌ జరుగుతున్న లెక్కల ప్రకారం చెరువులకు నిండుగా నీరు నింపాలంటే ఇంకా 20 రోజుల సమయం పడుతుంది. మిగిలిన చెరువుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దర్శి నియోజకవర్గంలోని అన్నీ చెరువులకు సుమారు 30శాతం నీరు నింపినట్లు అంచనా. సాగర్‌ జలాలు జిల్లాకు వాటా ప్రకారం విడుదల చేయకపోతే చెరువులకు నీరు నింపడం కష్టతరమవుతుంది. ప్రస్తుతం వేసవిని తలపిస్తూ ఎండలు మండిపోతున్నాయి. చెరువులకు పూర్తిగా నీరు నింపకపోతే తీవ్ర తాగునీటి సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది.

Updated Date - Sep 09 , 2026 | 01:55 AM