సాగర్ కాలువల్లో పెరిగిన నీటి పరిమాణం
ABN , Publish Date - Sep 12 , 2026 | 03:06 AM
సాగర్ కాలువల్లో నీటి పరిమాణం పెరిగింది. జిల్లాకు వాటా ప్రకారం నీరు సాధించడంలో ఇరిగేషన్ అధికారులు ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు. తాగునీటి అవసరాల కోసం ఈనెల 1వ తేదీన సాగర్ డ్యాం నుంచి జలాలను విడుదల చేసిన విషయం విదితమే.
జిల్లాకు వాటా ప్రకారం విడుదల
దర్శి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : సాగర్ కాలువల్లో నీటి పరిమాణం పెరిగింది. జిల్లాకు వాటా ప్రకారం నీరు సాధించడంలో ఇరిగేషన్ అధికారులు ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు. తాగునీటి అవసరాల కోసం ఈనెల 1వ తేదీన సాగర్ డ్యాం నుంచి జలాలను విడుదల చేసిన విషయం విదితమే. కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లా వాసులు అధిక నీరు వాడుకోవడంతో మన జిల్లాకు పరిమాణం తగ్గి సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఈనేపథ్యంలో జిల్లా అధికారులు గుంటూరు జిల్లా అధికారులతో మాట్లాడి నీటి పరిమాణం పెరిగే విధంగా కృషి చేశారు. ప్రస్తుతం విడుదలవుతున్న నీటి వివరాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. సాగర్ డ్యాంకు కుడికాలువ నుంచి 6,550 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా అది బుగ్గవాగుకు చేరుతోంది. అక్కడి నుంచి 6,180 క్యూసెక్కుల నీటిని సాగర్ ప్రధాన కాలువకు సరఫరా చేస్తున్నారు. అందులో గుంటూరు బ్రాంచ్ కాలువకు వెయ్యి క్యూసెక్కులు, అద్దంకి బ్రాంచ్ కాలువకు 600 క్యూసెక్కులు, సాగర్ ప్రధాన కాలువ 85/3వ మైలు(ఉమ్మడి ప్రకాశం జిల్లా బార్డర్)కు 2,179 క్యూసెక్కులు పంపిణీ అవుతోంది. జిల్లా సరిహద్దుకు ఐదురోజుల క్రితం కేవలం 1,400 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదల చేశారు. తాగునీటి చెరువులకు నీరు చేరక అన్ని ప్రాంతాల నుంచి ఆందోళనలు వ్యక్తం కావడంతో ఏకంగా 600 క్యూసెక్కులకు పైగా పరిమాణం పెంచారు. దీంతో జిల్లాలోని మంచినీటి చెరువులకు పుష్కలంగా నీరు చేరుతోంది. ప్రస్తుతం ఒంగోలు బ్రాంచ్ కాలువకు 668 క్యూసెక్కులు సరఫరా అవుతోంది. ఈ నీటి పరిమాణం శనివారం నాటికి మరింత పెరిగే అవకాశం ఉంది. సాగర్ జలాలను నిలిపివేసేలోపు రామతీర్థం జలాశయం, దర్శి ఎన్‌ఏపీ స్టోరేజీ ట్యాంకులతోపాటు జిల్లాలోని అన్ని మంచినీటి చెరువులకు నిండుగా నింపాల్సిన బాధ్యత ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులపై ఉంది.