చెత్తతో ఆదాయం
ABN , Publish Date - May 14 , 2026 | 03:10 AM
చెత్త నుంచి సంప దను సృష్టించడం ప్రారంభమైంది. గ్రామ పంచాయతీల్లో చెత్త సంపద కేంద్రాలు కళకళలాడుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన వీటిని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.
పంచాయతీలకు ఐదు నెలల్లో రూ.10 లక్షలు
గత వైసీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యం
ప్రజాప్రభుత్వం రాకతో ఉత్సాహంతో ముందుకు
ఒంగోలు కలెక్టరేట్, మే 13 (ఆంధ్రజ్యోతి) : చెత్త నుంచి సంప దను సృష్టించడం ప్రారంభమైంది. గ్రామ పంచాయతీల్లో చెత్త సంపద కేంద్రాలు కళకళలాడుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన వీటిని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఐదేళ్లపాటు నిరుపయోగంగా ఉంచి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మార్చింది. అవి ఇప్పుడు వినియోగంలోకి వచ్చాయి. చెత్త నుంచి సంపదను సృష్టించి పంచాయతీలకు ఆదాయాన్ని పెంచుతున్నాయి. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 730 గ్రామ పంచాయతీలు ఉండగా 604 చెత్తసంపద కేంద్రాలు ఉన్నాయి. మరో 124 పంచాయతీలకు మంజూరైనప్పటికీ స్థలాలు లేకపోవ డం, వివిధ కారణాలతో కొన్నిచోట్ల స్థలాలు ఉన్నా నిర్మాణాలు జరగలేదు. ఇక చెత్తసంపద కేంద్రాలు ఉన్న పంచాయతీల్లో 20శా తానికిపైగా పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. మరికొన్నిం టిలో చెత్తసంపదను సృష్టించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
చెత్తతో వర్మికంపోస్టు తయారీ
రెండు జిల్లాల్లో చెత్త సంపద కేంద్రాల ద్వారా జనవరి నుంచి ఇప్పటివరకు గ్రామ పంచాయతీలకు రూ.10లక్షలకుపైగా ఆదాయం వచ్చింది. ప్రస్తుతం రెండు జిల్లాల్లో 2,312 మంది గ్రీన్ అంబాసిడర్లను నియమించారు. ఆయా గ్రామపంచాయతీలకు కొత్తగా చెత్తసేకరణ కోసం 122 ట్రాక్టర్లు, 983 చెక్క రిక్షాలను పంపిణీ చేశారు. వాటి ద్వారా గృహాల్లో గ్రీన్ అంబాసిడర్లు తడి, పొడి చెత్తను సేకరించి సంపద కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ వర్మికంపోస్టును తయారుచేసి విక్రయాలు ప్రారంభించారు. గడచిన ఐదునెలల్లో చీమకుర్తి మండలం ఆర్‌ఎల్‌పురం గ్రామ పంచాయతీలోని చెత్త సంపద కేంద్రం ద్వారా రూ.2.50 లక్షల ఆదాయం సమకూరింది. కంభం, బేస్తవారపేట, కందులాపురం, వైపాలెం, పామూరుల్లోని సంపద కేంద్రాల్లో కూడా ఆయా పంచాయతీలకు ఆదాయం లభించింది. మిగిలిన అన్నిచోట్ల కూడా చెత్త సంపద కేంద్రాల ద్వారా ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు చేపట్టారు. వాటి ద్వారా వచ్చే ఆదాయంతో గ్రామాల్లో లైట్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చడం, ఇతర ముఖ్యమైన పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.