Share News

పేదల సేవలో..

ABN , Publish Date - Apr 02 , 2026 | 02:43 AM

జిల్లావ్యాప్తంగా బుధవారం సామాజిక పింఛన్‌లను ఇటు సిబ్బంది, అటు టీడీపీ శ్రేణులు కలిసి ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. పేదల సేవలో పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర పలువర్గాల వారి సంక్షేమం కోసం సామాజిక పింఛన్లు అందజేస్తున్న విషయం విదితమే.

పేదల సేవలో..
పేరాయపాలెంలో వృద్ధురాలికి పింఛన్‌ సొమ్మును అందజేస్తున్న మంత్రి రవికుమార్‌

ఇంటింటికీ తిరిగి పింఛన్‌ల అందజేత

సిబ్బందికి తోడుగా టీడీపీ శ్రేణులు

మంత్రులు డాక్టర్‌ స్వామి, గొట్టిపాటితో సహా కీలక ప్రజాప్రతినిధులు హాజరు

ఒంగోలు, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా బుధవారం సామాజిక పింఛన్‌లను ఇటు సిబ్బంది, అటు టీడీపీ శ్రేణులు కలిసి ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. పేదల సేవలో పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర పలువర్గాల వారి సంక్షేమం కోసం సామాజిక పింఛన్లు అందజేస్తున్న విషయం విదితమే. ప్రతినెలా 1వతేదీన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వపరంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి నుంచి గ్రామస్థాయి వరకు పాలనలో భాగమైన ప్రజాప్ర తినిధులు, అధికారయంత్రాంగం పాల్గొంటున్నారు. అలాగే ఈ విడత పంపిణీని చేపట్టారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో 28 మండలాల్లో మొత్తం 2,18,992 మంది లబ్ధిదారులకు రూ.98.28 కోట్లు విడుదలయ్యాయి. ఉదయం ఆరు గంటల నుంచే స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డుల సిబ్బంది పింఛన్లు పంపిణీ చేపట్టారు. ఉదయం పది గంటల కల్లా దాదాపు మూడొంతుల మందికి అందజేశారు. సాయంత్రానికి 90శాతం మందికి పింఛన్‌ సొమ్మును ఇచ్చారు. కొన్నిచోట్ల రాత్రిపూట కూడా అందించారు. అందుబాటులో లేనివారికి గురువారం ఇవ్వనున్నారు.

ఇంటింటికీ తిరిగిన నేతలు

ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు, ఉన్నతాధికారులు పేదల సేవలో పాల్గొన్నారు. జరుగుమల్లి మండలం చిర్రికూరపాడులో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ స్వామి ఇంటింటికీ తిరిగి పింఛన్లు అందించగా కలెక్టర్‌ రాజాబాబు, రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అద్దంకి మండలం పేరాయపాలెంలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం రూ.4.60 కోట్లతో నిర్మించనున్న విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఒంగోలు నగరంలోని రెండో డివిజన్‌ పరిధిలో ఉన్న బిలాల్‌నగర్‌లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పింఛన్లు పంపిణీ చేశారు. నాగులుప్పలపాడు మండలం చేకూరపాడులో ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌ అందజేశారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పట్టణంలోని రెవెన్యూ కాలనీలో, దర్శిలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు పంపిణీ చేశారు.

Updated Date - Apr 02 , 2026 | 02:43 AM