రోజుకోరకంగా..
ABN , Publish Date - Jul 25 , 2026 | 02:35 AM
దక్షిణాది పొగాకు మార్కెట్లో ఏమాత్రం నిలకడ కనిపిం చడం లేదు. రోజుకో రకంగా సాగుతోంది. ఒక రోజు కాస్తంత నోబిడ్‌లు తగ్గి అంతోఇంతో ధర కూడా పెరిగినట్లు కనిపిస్తే వారం రోజులపాటు మళ్లీ నోబిడ్‌లు పెరగడం, రోజువారీ కొనుగోళ్లు తగ్గడం, సగటు ధరలు కూడా పడిపోతూ రైతులు బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది.
మళ్లీ పెరిగిన నోబిడ్‌లు
40శాతానికిపైగా తిరస్కరణలు
తగ్గిన రోజువారీ కొనుగోళ్లు
సగటు ధరలదీ అదే పరిస్థితి
రైతులకు సాయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు
నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కేంద్ర అధికారులతో చర్చ
ఒంగోలు, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్లో ఏమాత్రం నిలకడ కనిపిం చడం లేదు. రోజుకో రకంగా సాగుతోంది. ఒక రోజు కాస్తంత నోబిడ్‌లు తగ్గి అంతోఇంతో ధర కూడా పెరిగినట్లు కనిపిస్తే వారం రోజులపాటు మళ్లీ నోబిడ్‌లు పెరగడం, రోజువారీ కొనుగోళ్లు తగ్గడం, సగటు ధరలు కూడా పడిపోతూ రైతులు బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. బుధవారం వేలం కేంద్రాల్లో 0.63 మిలియన్ కిలోల పంట కొనుగోలు జరిగింది. సగటున కిలోకు రూ.194పైన ధర లభించింది. నోబిడ్‌లు 27.80శాతం ఉన్నాయి. గురువారం చూస్తే 0.58 మిలియన్ కిలోల పంట కొనుగోలు జరగ్గా సగటున కిలోకు రూ.195 వరకు ధర లభించింది. నోబిడ్ బేళ్లు సుమారు 28శాతం ఉన్నాయి. శుక్రవారం మార్కెట్‌ను పరిశీలిస్తే.. కొనుగోళ్లు 0.57 మిలియన్ కిలోలకు తగ్గగా సగటు ధర కిలో రూ.194లోపుగానే ఉంది. అదేసమ యం లో నోబిడ్ బేళ్లు 29శాతంకు చేరాయి. శుక్రవారం 11 కేంద్రాల్లోనూ వేలం జరిగింది. రైతులు 6,708 బేళ్లను వేలానికి తీసుకురాగా బయ్యర్లు 4,299 కొనుగోలు చేశారు. 2,419 బేళ్లు తిరస్కరణ జరగ్గా వాటిలో 1,993 అంటే వచ్చిన మొత్తంలో 29శాతం నోబిడ్‌లు ఉన్నాయి. అత్యధికంగా టంగుటూరు వేలం కేంద్రంలో 47.06శాతం నోబిడ్ కాగా వెల్లంపల్లిలో 46.33శాతం, కనిగిరిలో 43.05శాతం, కలిగిరిలో 32.71శాతం, ఒంగోలు-2లో 32.03శాతం నోబిడ్ అయ్యాయి. ఈనేపథ్యంలో పొగాకు మార్కెట్‌ను గాడిలో పెట్టి రైతులకు ఊరట కలిగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. తొలి నుంచి ఈ విషయంలో చొరవ తీసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో నాలుగు రోజుల క్రితం మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్రంలోని కీలక మంత్రులను కలిసి వచ్చిన విషయం విదితమే. ఆ సందర్భంగా జరిగిన చర్చలకు అనుగుణంగా కేంద్ర అధికారులు కదిలారు. ఎలాంటి చర్యలు తీసుకుంటే రైతులకు మేలు జరుగుతుందన్న అంశంపై రాష్ట్రప్రభుత్వం, అలాగే పొగాకు బోర్డు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా మంత్రులతో చెప్పారు. అందుతున్న సమాచారం ప్రకారం రెండు, మూడు ప్రతిపాదనలను వారు పరిశీలిస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో తీసుకున్న రుణాల రీషెడ్యూల్, తాజాగా బ్యారన్‌కు రూ.50 వేల నుంచి రూ.60వేలు వడ్డీలేని రుణం మంజూరు, లోగ్రేడ్ పొగాకుకు కొంతమేర బోనస్ వంటి అంశాలను వారు పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై చర్చించేందుకు కేంద్ర వాణిజ్యశాఖ ఉన్నతాధికారులు శనివారం రాష్ట్రానికి వస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వారు సీఎంను కలిసి చర్చించనున్నారు. ఆ సమావేశానికి జిల్లా నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఆ మేరకు అందరికీ ఆహ్వానం అందింది. ఇదిలాఉండగా పొగాకు రైతులను అదుకునేందుకు రూ.వెయ్యి కోట్లు ఇచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేపట్టాలన్న డిమాండ్‌తో ఆందోళనలు నిర్వహిస్తున్న రైతుసంఘాలు బైక్ యాత్ర రెండవ రోజైన శుక్రవారం సంతనూతలపాడు, చీమకుర్తి మండలాల్లో సాగింది.