మెరుగుపడుతున్న పొగాకు మార్కెట్
ABN , Publish Date - Jul 18 , 2026 | 01:56 AM
క్షిణాది పొగాకు మార్కెట్ క్రమంగా మెరుగు పడుతోంది. వారం వరకు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడగా.. ఈ వారం కాస్తంత కుదుటపడి నిలకడగా ఉంది. రోజు వారీ అమ్మకానికి వేలం కేంద్రాలకు తెచ్చే బేళ్లు పెరగ డమే కాక నోబిడ్‌లు క్రమంగా తగ్గుతున్నాయి .
పెరుగుతున్న కొనుగోళ్లు, తగ్గిన నోబిడ్‌లు
తాజాగా 0.75 మిలియన్ కిలోల కొనుగోలు
పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు టెలీకాన్ఫరెన్స్
ఒంగోలు, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్ క్రమంగా మెరుగు పడుతోంది. వారం వరకు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడగా.. ఈ వారం కాస్తంత కుదుటపడి నిలకడగా ఉంది. రోజు వారీ అమ్మకానికి వేలం కేంద్రాలకు తెచ్చే బేళ్లు పెరగ డమే కాక నోబిడ్‌లు క్రమంగా తగ్గుతున్నాయి తాజా గా శుక్రవారం మార్కెట్‌లో 0.75 మిలియన్ కిలోల పంట కొనుగోలు జరిగింది. ఈ సీజన్‌లో ఒకే రోజు ఇంత పరిమాణం కొనుగోలవడం ఇదేనని తెలుస్తోం ది. గత వారం వరకు రోజువారీ నాలుగు వేల బేళ్లకు మించి అమ్మకాలకు వచ్చేవి కావు. వాటిలోనూ మూడో వంతు నోబిడ్ అయ్యేవి. దీంతో రోజువారీ 0.40 మిలియన్ కిలోలకు అటుఇటుగా మాత్రమే కొనుగోలు జరి గేది. భారీగా నోబిడ్‌ల నేపథ్యంలో బోర్డు అధికారులే బేళ్ల సంఖ్యను పరిమితం చేస్తూ వచ్చేవారు. అయితే ఈ వారంలో పరిస్థితి మెరుగుపడింది. నెలక్రితం 40 నుంచి 50శాతం వరకు, వారం క్రితం 25నుంచి 30శాతం వరకు ఉన్న నోబిడ్‌లు ఈవారంలో క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఒకట్రెండు కేంద్రాల్లో మినహా అధిక చోట్ల 15 నుంచి 20శాతంలోపు నోబిడ్‌లు వచ్చాయి.
కొనుగోలు పరిమాణం పెరిగింది
ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా సమీక్షలు చేయడం, మంత్రుల రోజువారీ పర్యవేక్షణ, తదనుగు ణంగా బోర్డు అధికారుల చర్యలు, వ్యాపారులలో కూడా కొంత మార్పు రావడం వంటి పరిమాణాలతో మార్కెట్ కాస్తంత మెరుగుపడి నోబిడ్‌లు తగ్గాయి. దీంతో రోజువారీ అమ్మకానికి ఎక్కువ బేళ్లు వచ్చేలా వేలం కేంద్ర అధికారులు చర్యలు చేపట్టారు. అలా ఐదువేల బేళ్లకు పైగా వచ్చేలా చూస్తుండటం, వాటిలో గతంతో పోల్చితే నోబిడ్‌లు తగ్గడంతో కొనుగోలు పరిమాణం క్రమంగా పెరుగుతోంది. గత శుక్రవారం 0.45 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు జరగ్గా మంగళవారం నాటికి కాస్తంత మెరుగుపడి 0.60 మిలియన్ కిలోలు కొనుగోలు చేశారు. అలా నిలకడగా నాలుగు రోజులు కొనుగోళ్లు సాగాయి. ఈ శుక్రవారం 0.75 మిలియన్ కిలోల కొనుగోలు జరిగింది. రెండు రీజియన్ల నుంచి 11వేలం కేంద్రాలకు శుక్రవారం 7,447 బేళ్లను అమ్మకానికి తీసుకువచ్చారు. అందులో 5,973 బేళ్లను కొనుగోలు చేశారు. మిగిలిన 1,574 బేళ్లలో సుమారు 18శాతంతో 1,387 నోబిడ్ అయ్యాయి. సగటున కిలోకు రూ.195 ధర లభించింది. అలా ఈవారం కాస్తంత పొగాకు మార్కెట్ మెరుగుపడటం రైతులకు కొంతమేర ఊరట కలిగిస్తోంది.
వ్యవసాయశాఖ మంత్రి టెలీకాన్ఫరెన్స్
రోజువారీ పొగాకు కొనుగోళ్లపై సీఎం ఆదేశాలతో మంత్రులు అచ్చెన్నాయుడు, డాక్టర్ స్వామి, గొట్టిపాటి రవికుమార్ నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. ఈక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం ఇద్దరు మంత్రులతోపాటు పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్‌కుమార్, ఈడీ విశ్వశ్రీ ఇతర అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోళ్ల తీరును అడిగి తెలుసుకున్నారు. నాలుగురోజులుగా మార్కెట్ మెరుగుపడడాన్ని ప్రస్తావిస్తూ మరింతగా కొనుగోళ్లు పెంచడంతోపాటు ధరలు పెరుగుదలకు కూడా వ్యాపారులపై ఒత్తిడి పెంచాలని సూచించారు. లోగ్రేడ్ పొగాకుకు కూడా సరైన ధర లభించేలా చూడాలన్నారు మరోవైపు రానున్న సీజన్‌కు 81 మిలియన్ కిలోల పంట ఉత్పత్తి ఖరారు నేపథ్యంలో సాగు తగ్గించేలా, రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామని బోర్డు అధికారులు పేర్కొన్నారు.