ప్రభుత్వ వైద్యసేవలు మెరుగు
ABN , Publish Date - May 21 , 2026 | 03:28 AM
ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలకు పక్కాగా అందించిన నేపథ్యంలో జిల్లాకు మంచి గుర్తింపు దక్కింది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాలతో సర్కారు వైద్యశాలల్లో అందుతున్న సేవలను ప్రతిరోజూ ఆన్‌లైన్ ద్వారా సమీకరిస్తున్నారు.
రాష్ట్రంలో మూడో స్థానంలో ప్రకాశం
పేద ప్రజలకు ఊరట
ఒంగోలు కలెక్టరేట్, మే 20 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలకు పక్కాగా అందించిన నేపథ్యంలో జిల్లాకు మంచి గుర్తింపు దక్కింది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాలతో సర్కారు వైద్యశాలల్లో అందుతున్న సేవలను ప్రతిరోజూ ఆన్‌లైన్ ద్వారా సమీకరిస్తున్నారు. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్‌లు 65 ఉన్నాయి. వాటిలో ఓపీలు, వైద్య పరీక్షలు, రోగులకు మందుల పంపిణీ, వైద్యాధికారులు, సిబ్బంది సకాలంలో వైద్యశాలలకు రావడం తదితర అంశాలన్నింటినీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. మంగళవారం జిల్లాలోని 65 వైద్యశాలల్లో 4,480 మంది ఓపీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రాథమిక, అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు, నర్సులు, ఇతర ఉద్యోగులు నూరుశాతం మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెచ్‌ఎంఐఎస్‌లో లాగిన్ అయ్యారు. ఓపీలు తీసుకున్న వారిలో 2,341 మంది వివిధ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 90శాతం మందికి టెస్టులను కూడా పూర్తిచేసి ఇచ్చారు. దీంతో జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ప్రభుత్వ వైద్యశాలల్లో మందుల పంపిణీలో మాత్రం రాష్ట్ర సగంటు కంటే కొద్దిగా వెనుకబడింది. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతోనే పేదలకు వైద్యశాలల ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు సాధ్యమవుతుందని డీఎంహెచ్‌వో డాక్టర్ టి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఇంకా మెరుగైన వైద్యసేవలు అందించేందుకు తమ వంతు కృషిచేస్తామని చెప్పారు.