Share News

అర్బన్‌లో మెరుగు.. రూరల్‌లో అరకొర

ABN , Publish Date - Apr 29 , 2026 | 03:07 AM

డీజిల్‌, పెట్రోలు కోసం గత రెండు రోజులుగా తీవ్ర ఇక్కట్లు పడిన జిల్లా ప్రజానీకానికి మంగళ వారం కాస్త ఉపశమనం లభించింది. ఆయిల్‌ సరఫరా కొంత మెరుగుపడింది. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో అత్యధికశాతం బంకులలో సాధారణ పరిస్థితికి చేరుకొంది.

అర్బన్‌లో మెరుగు.. రూరల్‌లో అరకొర
ఒంగోలులోని పెట్రోలు బంకు వద్ద సాధారణ పరిస్థితి

ఆయిల్‌ ఇక్కట్ల నుంచి కొంతమేర ఉపశమనం

ముందు జాగ్రత్తగా పలుచోట్ల పంపిణీపై రేషన్‌

కొనసాగుతున్న అధికారుల పర్యవేక్షణ

అద్దంకిలో ఎస్పీ, ఎన్‌జీపాడులో జేసీ తనిఖీలు

పాక్షికంగానే గ్రానైట్‌ క్వారీల్లో పనులు

ఒంగోలు, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి) : డీజిల్‌, పెట్రోలు కోసం గత రెండు రోజులుగా తీవ్ర ఇక్కట్లు పడిన జిల్లా ప్రజానీకానికి మంగళ వారం కాస్త ఉపశమనం లభించింది. ఆయిల్‌ సరఫరా కొంత మెరుగుపడింది. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో అత్యధికశాతం బంకులలో సాధారణ పరిస్థితికి చేరుకొంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అరకొర సరఫరాతో ఇక్కట్లు తప్పలేదు. రెండురోజులపాటు జిల్లావ్యాప్తంగా సగం ఆయిల్‌ బంకుల వద్ద నోస్టాక్‌ బోర్డులు, మరో సగం బంకుల వద్ద అరకొర పంపిణీతో భారీగా వాహనాల క్యూలైన్లతో రద్దీ నెలకొనగా మంగళవారం ఆ పరిస్థితి అతికొద్ది ప్రాంతాలకు పరిమితమైంది. ఆయిల్‌ సరఫరాలో కొరత కన్నా యుద్ధం పేరుతో ఒకవైపు ప్రధాన ఆయిల్‌ కంపెనీలు, మరోవైపు స్థానిక ఆయిల్‌ బంకుల వారు వ్యవహరించిన తీరుతోనే జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ సమస్య ఉత్పన్నమైంది. ఇక ఆయిల్‌ దొరకదేమోనన్న ఆందోళనతో ప్రజానీకం అవసరానికి మించి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం సమస్యను మరింత పెంచింది. కలెక్టర్‌ రాజాబాబు ఆదేశాలతో అధికార యంత్రాంగం ఆది, సోమవారాల్లో ఆయిల్‌ పంపిణీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టిసారించి పనిచేసింది. ఉన్నతాధికారులు సైతం క్షేత్రస్థాయిలో తనిఖీలు, బంకుల వద్ద నిఘా వంటి చర్యలతో సమస్య నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.

అధికారుల నిరంతర పర్యవేక్షణ

జిల్లాఅంతటా మంగళవారం కూడా అధికారుల తనిఖీలు, బంకుల వద్ద పర్యవేక్షణ కొనసాగింది. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అద్దంకిలోని పలు ఆయిల్‌ బంకులలో తనిఖీలు నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి నాగులుప్పలపాడు మండలంలో తనిఖీలు చేశారు. పలుచోట్ల స్థానిక తహసీల్దార్లు, ఎస్‌ఐ స్థాయి అధికారులు కూడా తనిఖీలు చేపట్టారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలతో ఆయిల్‌ కంపెనీలు సరఫరాను గతం కన్నా పెంచాయి. దీంతో జిల్లాలో అత్యధిక ప్రాంతాల్లో డీజిల్‌, పెట్రోలు అందుబాటులోకి వచ్చింది. ప్రత్యేకించి జిల్లాకేంద్రమైన ఒంగోలుతోపాటు అద్దంకి, కందుకూరు వంటి పట్టణాలు.. ఇతర ప్రధాన ప్రాంతాల్లో సాధారణ స్థితికి పంపిణీ చేరుకుంది. అదేసమయంలో రూరల్‌ ప్రాంతంలోని పలుచోట్ల ఆయిల్‌ సరఫరా అరకొరగానే కనిపించింది. కొత్తపట్నంలో ఆయిల్‌ లేక మూతపడగా ఎన్‌జీపాడు మండలంలో సగం బంకులు తెరుచుకోలేదు. తాళ్లూరు, కొరిశపాడు, ఇతర పలు మండలాల్లో ఇదే పరిస్థితి కనిపించింది.

సగమే పనిచేశాయి..

ఇంధన వాడకం అధికంగా జరిగే గ్రానైట్‌ పరిశ్రమల్లో ఇక్కట్లు కొనసాగుతూనే ఉన్నాయి. చీమకుర్తి, బల్లికురవ ప్రాంతంలోని గ్రానైట్‌ క్వారీల్లో డీజిల్‌ ఇక్కట్లతో మంగళవారం సగం క్వారీలు మాత్రమే పనిచేశాయి. చీమకుర్తి ప్రాంతంలో సొంత ఆయిల్‌ బంకులు ఉన్న క్వారీల వారు అధిక ధరతో ఆయిల్‌ కంపెనీలు సరఫరా చేసే డీజిల్‌ తీసుకొని పనులు కొనసాగించగా మిగతా వారు ఆపారు. బల్లికురవ ప్రాంతంలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. ఇక గత మూడు రోజుల కన్నా ఆయిల్‌ సరఫరా మెరుగుపడినా చాలాచోట్ల పూర్తిస్థాయిలో కుదటపడలేదు. పలుప్రాంతాల్లో రేషన్‌ విధానం కొనసాగుతోంది. పెట్రోలు రూ.200కు, డీజిల్‌ అయితే రూ.వెయ్యికి మించి పోయకపోవడం, డ్రమ్ములు, క్యాన్‌లకు కాకుండా వాహనం వస్తేనే పోయడం వంటివి కనిపించాయి. బుధవారం నాటికి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో ఆయిల్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

Updated Date - Apr 29 , 2026 | 03:07 AM