Share News

వైద్య సేవలు మెరుగు

ABN , Publish Date - Mar 19 , 2026 | 02:21 AM

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలు బాగా మెరుగుపడ్డాయి. దీంతో వాటిలో సేవలు పొందేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో 39 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. సాధారణంగా రోజుకు ఒక్కో కేంద్రానికి 50 ఓపీలు వస్తుంటాయి.

వైద్య సేవలు మెరుగు
కరవది పీహెచ్‌సీలో ఓపీలను చూస్తున్న డాక్టర్‌ సుందర్‌ప్రసాద్‌

పీహెచ్‌సీల్లో పెరిగిన ఓపీలు

అందుబాటులో అన్నిరకాల మందులు, పరీక్షలు

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలు బాగా మెరుగుపడ్డాయి. దీంతో వాటిలో సేవలు పొందేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో 39 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. సాధారణంగా రోజుకు ఒక్కో కేంద్రానికి 50 ఓపీలు వస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఒక్కో వైద్యశాలకు రెట్టింపు మంది వచ్చి సేవలు పొందుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వైద్యసేవలు అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉండేది. వైద్యులు ఎప్పుడు వస్తారో కూడా తెలియని పరిస్థితి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. పీహెచ్‌సీల్లో పనిచేసే వైద్యాధికారి నుంచి మిగిలిన ఉద్యోగులందరూ ఉదయాన్నే వైద్యశాలకు వెళ్లాక ముఖహాజరు వేయడంతోపాటు ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను కూడా ఆన్‌ లైన్‌లో పొందుపర్చేలా చర్యలు తీసుకున్నారు. ఆయా వైద్యశాలల నెలవారీ లక్ష్యాలపై గ్రేడింగ్‌లు కూడా ఇస్తున్నారు. వాటిలో వెనుకబడితే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో వైద్యాధికారులు కూడా ప్రజలకు సేవలు అందించే విషయంలో ముందుంటున్నారు.

నిరంతర పర్యవేక్షణ

రాష్ట్ర, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారుల నిరంతర పర్యవేక్షణ కూడా పెరిగింది. డీఎంహెచ్‌వో డాక్టర్‌ టి.వెంకటేశ్వర్లు కూడా వెనుకబడి ఉన్న వైద్యశాలలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు అందించాల్సిన సేవలపై వైద్యాధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఆయా వైద్యశాలలకు వివిధ అంశాలపై గ్రేడింగ్‌లు ఇచ్చింది. అందులో ఒక్కో పీహెచ్‌సీకి ఎన్ని ఓపీలు రావాలి, ఎంతమంది చూపించుకున్నారనే వివరాలను వెల్లడించింది. జిల్లాలో 39 పీహెస్‌సీలు ఉండగా నెలకు ఒక్కోదాంట్లో 1,500 ఓపీలు చూడాల్సి ఉంది. అయితే గుడ్లూరు పీహెచ్‌సీలో 1,500 ఓపీలకు 2,556 వచ్చాయి. కరవది పీహెచ్‌సీలో 2,352, సింగరాయకొండ పీహెచ్‌సీలో 2,181, కొత్తపట్నం పీహెచ్‌సీలో 2,090 ఓపీలు వచ్చాయి. ఒక్క మారెళ్ల మాత్రమే కేవలం 1,203 ఓపీలకు పరిమితమైంది. మిగిలిన అన్ని పీహెచ్‌సీల్లో 1,500 నుంచి 2వేలలోపు వచ్చాయి. దాదాపు అన్ని వైద్యశాలల్లో సేవలు మెరుగయ్యాయి. పీహెచ్‌సీల్లో పలురకాల వైద్య పరీక్షలు చేస్తుండటం, మందులు అందుబాటులో ఉండటంతో ప్రజల నుంచి ప్రభుత్వ వైద్యసేవలపై సంతృప్తి వ్యక్తమవుతోంది.

Updated Date - Mar 19 , 2026 | 02:21 AM