Share News

‘కుసుమ్‌’ అమలుకు శ్రీకారం

ABN , Publish Date - Aug 18 , 2026 | 02:26 AM

దర్శి నియోజకవర్గంలో కుసుమ్‌ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. ఎనిమిది ప్రాంతాల్లో సోలార్‌ యూనిట్ల నిర్మాణానికి అధికారులు స్థలసేకరణ పూర్తి చేశారు. కొన్నిచోట్ల మెటీరియల్‌ తోలి పనులను ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయం విదితమే.

‘కుసుమ్‌’ అమలుకు శ్రీకారం
బొట్లపాలెంలో కుసుమ్‌ పథకం యూనిట్‌ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తున్న విద్యుత్‌శాఖ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీనివాసులు, సిబ్బంది

సోలార్‌ యూనిట్ల నిర్మాణం ఆరంభం

రైతులకు మెరుగైన విద్యుత్‌ అందించే అవకాశం

దర్శి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : దర్శి నియోజకవర్గంలో కుసుమ్‌ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. ఎనిమిది ప్రాంతాల్లో సోలార్‌ యూనిట్ల నిర్మాణానికి అధికారులు స్థలసేకరణ పూర్తి చేశారు. కొన్నిచోట్ల మెటీరియల్‌ తోలి పనులను ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయం విదితమే. అందులో భాగంగా రైతులకు కోతలు లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు కేంద్రప్రభుత్వం కుసుమ్‌ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దర్శి మండలంలోని రాజంపల్లిలో నాలుగు మెగావాట్లు, చందలూరులో ఐదు మెగావాట్లు, బొట్లపాలెంలో నాలుగు మెగావాట్లు, ముండ్లమూరు మండలంలోని శంఖరాపురంలో నాలుగు మెగావాట్లు, ముండ్లమూరులో ఆరు మెగావాట్లు, దొనకొండ మండలం చందవరంలో నాలుగు మెగావాట్లు, తాళ్లూరు మండలం దోసకాయలపాడులో ఐదు మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ తయారుచేసే యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. వృద్ధి ఇన్‌స్ట్రక్చర్‌ సంస్థకు ఈ యూనిట్లు దక్కాయి. ఒక్కో మెగావాట్‌ విద్యుత్‌ తయారు చేసేందుకు నాలుగు ఎకరాల భూమి అవసరమవుతుంది. ఆరుచోట్ల రైతుల వద్ద నుంచి భూములను కౌలుకు తీసుకున్నారు. ఎకరాకు రూ.30 వేలు కౌలు చెల్లించే విధంగా సంబంధిత సంస్థ కాంట్రాక్టు కుదుర్చుకుంది. మిగిలిన రెండుచోట్ల ప్రభుత్వ భూములను ప్లాంట్ల ఏర్పాటుకు అప్పగించే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

యూనిట్‌కు రూ.3.09 చెల్లించనున్న విద్యుత్‌శాఖ

కుసుమ్‌ పథకం కింద ఏర్పాటుచేసే సోలార్‌ యూనిట్లు ఉత్పత్తిచేసే విద్యుత్‌ను యూనిట్‌కు రూ.3.09కు సంబంధిత సంస్థకు చెల్లించి విద్యుత్‌ శాఖ తీసుకుంటుంది. ఆ కరెంటును వ్యవసాయ కనెక్షన్లకు అందజేస్తుంది. ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు పూర్తిగా తగ్గిపోవడంతో జల విద్యుత్‌ ఉత్పత్తి సక్రమంగా జరగటం లేదు. బొగ్గు నిల్వలు కూడా తగ్గటంతో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. భవిష్యత్తులో కరెంట్‌ కొరత అధికమవుతుందన్న విషయాన్ని గుర్తించిన కేంద్రప్రభుత్వం సోలార్‌ విద్యుత్‌ తయారీకి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. భారీ సబ్సిడీలను అందజేస్తోంది. ఏడాదిగా ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకం కింద గృహాలకు సోలార్‌ బిగించుకునే వారికి పెద్దఎత్తున సబ్సిడీ అందిస్తున్న విషయం విదితమే. జనరల్‌ కేటగిరీకి చెందిన వారికి యూనిట్‌ ధరలో 40శాతం సబ్సిడీ ఇస్తోంది. ఎస్సీ, ఎస్టీల గృహాలకు ఉచితంగా సోలార్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తుంది. ఈ విధానంతో గృహాలకు విద్యుత్‌ కొరత చాలావరకు తగ్గుతోంది. వ్యవసాయానికి కొరత లేకుండా విద్యుత్‌ను అందించాలనే లక్ష్యంతో కుసుమ్‌ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. జిల్లాలో ప్రప్రథమంగా దర్శి నియోజకవర్గంలోనే కుసుమ్‌ పథకం అమలుకు స్థలాన్ని సేకరించినట్లు విద్యుత్‌ శాఖ ఈఈ పి.శ్రీనివాసులు తెలిపారు. ఇప్పటికే ఆరుచోట్ల పనులు ఆరంభమయ్యాయని తెలిపారు. మరో రెండుచోట్ల ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ పథకాల నిర్మాణం పూర్తయి విద్యుత్‌ ఉత్పత్తి ఆరంభమైతే రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది.

Updated Date - Aug 18 , 2026 | 02:26 AM