Share News

ద్రోణి ప్రభావం.. మోస్తరు వర్షం

ABN , Publish Date - Nov 25 , 2026 | 01:58 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం జిల్లాపై చూపింది. అత్యధిక ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి జల్లులు పడ్డాయి. కొన్నిచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షమే కురిసింది. ఇది ప్రస్తుత రబీ సీజన్‌ పంటల సాగుకు ఉపకరించనుంది. అలాగే ఖరీఫ్‌లో సాగు చేసి ప్రస్తుతం పొలంలో ఉన్న పంటలకు జీవం పోయనుంది.

ద్రోణి ప్రభావం.. మోస్తరు వర్షం
వర్షానికి ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద రోడ్డుపై భారీగా చేరిన నీరు

ఖరీఫ్‌ పంటలకు జీవం

రబీ సాగుకు ఉపయుక్తం

విడతలవారీ జల్లులతో ఒంగోలులో అస్తవ్యస్త పరిస్థితి

ఒంగోలు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం జిల్లాపై చూపింది. అత్యధిక ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి జల్లులు పడ్డాయి. కొన్నిచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షమే కురిసింది. ఇది ప్రస్తుత రబీ సీజన్‌ పంటల సాగుకు ఉపకరించనుంది. అలాగే ఖరీఫ్‌లో సాగు చేసి ప్రస్తుతం పొలంలో ఉన్న పంటలకు జీవం పోయనుంది. ఈనెల తొలివారంలో మురసు తుఫాన్‌తో జిల్లాలోని అత్యధిక ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. అనంతరం దుక్కులు దున్ని పంటల సాగుకు రైతులు ఉపక్రమించారు. ప్రధానంగా శనగ, పొగాకు, మొక్కజొన్న, మిర్చి, మినుము వంటి పంటల సాగుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే అతి భారీవర్షాలు కురిసిన ప్రాంతాల్లో భూములు ఆరక సాగు ఆలస్యమైంది. ఇతర ప్రాంతాల్లో భూములు దున్నకం చేశాక ఆ పంటలు వేయడానికి తగిన తేమ భూమిలో లేకుండా పోయింది. దాని వల్ల ఆశించిన స్థాయిలో రబీ పంటలు సాగు కాలేదు. అధికార వర్గాల సమా చారం ప్రకారం జిల్లాలో రబీ సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం సుమారు లక్షా 12వేల హెక్టార్లు కాగా ఇప్పటివరకు కేవలం 13,793 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. సుమారు 37,776 హెక్టార్లలో పొగాకు, 32,729 హెక్టార్లలో శనగ, సుమారు 10వేల హెక్టార్లలో మొక్కజొన్న, 23వేల హెక్టార్లలో వరి, ఆరువేల హెక్టార్లకుపైగా మినుము సాగు చేస్తారు. ఒక్క వరి మినహా మిగతా అన్ని పంటలూ వర్షాధారమే కాగా ఈ ఏడాది సాగర్‌ నీరు రాక వరి సాగు కు అవకాశంలేకుండా పోయింది. అన్ని ప్రాంతాల రైతులు వర్షాధారంగానే పంటలు సాగు చేయాల్సి వచ్చింది. అయితే మురసు తుఫాన్‌ తర్వాత వర్షం లేక ఆశించిన స్థాయిలో పంటలు సాగు కాలేదు. అలాంటి సమయంలో మంగళవారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురిసిన వర్షం రైతులకు సాగుపై ఆశలు కల్పించింది.

ఎన్‌జీపాడు మండలంలో అధికం

మంగళవారం ఉదయం 9గంటల సమయానికి 24 గంటల వ్యవధిలో సగటున 9.6 మి.మీ వర్షపాతం నమోదైంది. గరిష్ఠంగా ఎన్‌జీపాడు మండలంలో 79.60 మి.మీ కురిసింది. మద్దిపాడులో 56.20, కొత్తపట్నంలో 34.20 మి.మీ పడింది. అద్దంకి, ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు, కొండపి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. తిరిగి మంగళవారం పగటిపూట కూడా పలుచోట్ల ఒక మోస్తరు వాన పడింది. అలా మంగళవారం సాయంత్రం వరకు కొత్తపట్నంలో 34.40మి.మీ కురిసింది. ముండ్లమూరులో 33.50, దర్శిలో 24.0, బల్లికురవలో 24.0, ఒంగోలులో 23.31, సంతమాగులూరులో 20,0, మర్రిపూడిలో 19.73, కొండపిలో 15.50, గుడ్లూరులో 15.50, అద్దంకిలో 15.0 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇతర ప్రాంతాల్లోనూ జల్లులు పడ్డాయి.

నాట్లకు ఉపకరించనున్న వాన

ప్రస్తుతం కురిసిన వర్షం ఇప్పటికే పొలంలో ఎదుగుదల దశలో ఉన్న కంది, సజ్జ, వరి, మొక్కజొన్న, మినుము వంటి పంటలకు బాగా ఉపకరించనుంది. అలాగే రబీలో ప్రధాన పంటలైన శనగ, పొగాకు, మినుము, మొక్కజొన్న వంటి పైర్ల సాగు విస్తారంగా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పొగాకు నాట్లకు చాలా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తున్న రైతులకు ఈ వర్షం కొంతమేర ఊరట కలిగించనుంది. అలాగే గత పక్షం రోజులుగా ఆయా ప్రాంతాల్లో వేసిన పొగాకు నాట్లకు బాగా ఉపకరించనుంది. కందుకూరు, కొండపి, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గాల్లోని ఎగువ ప్రాంత మండలాల్లో ప్రస్తుతం కురిసిన వర్షం ఏమాత్రం సరిపోదని రైతులు చెప్తున్నారు. మురసు సమయంలో కూడా ఆ ప్రాంతంలో పరిమితంగానే జల్లులు పడ్డాయి. ఈసారైన మంచి వర్షం కురిస్తే తప్ప రబీ సాగు విస్తారంగా చేసే అవకాశం లేదంటున్నారు.

ఒంగోలులో వీధులన్నీ జలమయం

ఒంగోలు నగరంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు విడతల వారీగా జల్లులు కురవడంతో నగర ప్రజలు ఇక్కట్లు పడ్డారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు పూజల కోసం దేవాలయాలకు వెళ్తుండగా ఆ సమయంలో జల్లులు పడ్డాయి. వారితోపాటు కాలేజీలు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, ఉదయాన్నే వివిధ పనులకు వెళ్లేవారు, చిరు వ్యాపారులు కూడా అవస్థలు పడ్డారు. ఇక కొద్దిపాటి వర్షానికే నగరం జలమయమైంది. పలు ప్రధాన వీధుల్లో వర్షపు నీరు పారి ప్రజలు అవస్థ పడ్డారు.

Updated Date - Nov 25 , 2026 | 01:58 AM