నల్లారెడ్డిపాలెంలో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:13 PM
పొదిలి మండలంలో ఏలూరు పంచాయతీ నల్లారెడ్డిపాలెంలో గ్యాస్ అక్రమ విక్రయాలకు అడ్డాగా మారింది. నిత్యం పదుల సంఖ్యలో సిలిండర్లు వ్యాపారం జోరుగా సాగుతోంది. పక్కా సమాచారంతో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆదివారం అక్రమ గ్యాస్ గౌడౌన్‌పై ఆకస్మికంగా దాడి చేశారు.
విజిలెన్స్ దాడులు.. 94 సిలిండర్లు సీజ్
కుటీర పరిశ్రమగా వ్యాపారం
అధికారులపై దౌర్జన్యం
పొదిలి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : మండలంలో ఏలూరు పంచాయతీ నల్లారెడ్డిపాలెంలో గ్యాస్ అక్రమ విక్రయాలకు అడ్డాగా మారింది. నిత్యం పదుల సంఖ్యలో సిలిండర్లు వ్యాపారం జోరుగా సాగుతోంది. పక్కా సమాచారంతో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆదివారం అక్రమ గ్యాస్ గౌడౌన్‌పై ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో వేలూరు గ్రామానికి చెందిన చిన్నపురెడ్డి వెంకటేశ్వర్లు నుంచి 27వాణిజ్య సిలిండర్లు, 46 డొమెస్టిక్ సిలిండర్లు, మరో వ్యక్తి ధర్మవరపు బలరామిరెడ్డి వద్ద నుంచి డొమెస్టిక్ సిలిండర్లు 9, వాణిజ్య సిలిండర్లు 12 స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా అక్రమ నిల్వలు ఉంచి గ్యాస్‌ను రీఫిల్లింగ్ చేస్తూ అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. డొమెస్టిక్ సిలిండర్ నుంచి వాణిజ్య సిలిండర్లకు గ్యాస్ రీఫిల్లింగ్ చేసేందుకు అవసరమైన రెండు మోటార్లు, ఒక వెయింగ్ మిషన్ కూడా అక్రమార్కులు ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. యంత్రపరికరాలను కూడా అధికారులు పట్టుకున్నారు. అక్రమ గ్యాస్ సిలిండర్లు వ్యాపారం ఎన్నో ఏళ్లుగా ఒక కుటీర పరిశ్రమలా నిర్వహిస్తూ నెలనెలా వేలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అక్రమ సిలిండర్లు వ్యాపారంపై అధికారులు ప్రత్యేక నిఘాపెట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడడంతో అధికారులు కంగుతిన్నారు. ఈనేపథ్యంలో పక్కా సమాచారంతో గోడౌన్‌పై దాడి చేశారు. దాడి విషయం తెలుసుకున్న గ్రామస్థుల్లోని ఓ వర్గం సిలిండర్లను సీజ్ చేయకుండా అడ్డుకునేందుకు అధికారులపై దాడికి యత్నించారు. ఉద్రిక్తపరిస్థితుల నడుమ అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్‌ఐ రాజేష్ తన సిబ్బందితో గ్రామానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. గత వైసీపీ హయాంలో కూడా సుమారు 200లకుపైగా సిలిండర్లు అప్పట్లో అధికారుల దాడుల్లో బయటపడ్డాయి. అధికార బలంతో కేసు నమోదు కాకుండా తప్పించుకున్నారు. ఎట్టకేలకు అక్రమ గోడౌన్ వ్యవహారం బయటపడడం మండలంలో చర్చనీయాంశమైంది. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఎస్‌ఐ నాగేశ్వరరావు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి డేవిడ్‌రాజు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ముఖందహరి, వీఆర్వో సుబ్బారావు ఉన్నారు. సీజ్ చేసిన సిలిండర్లను కరుణ ఇండేన్ గ్యాస్ గోడౌన్‌కు తరలించారు.
బ్లాకులో రూ.2500 అమ్మకం
యుద్ధం నేపథ్యంలో సిలిండర్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. గతంలో ఇంటి అవసరాల సిలిండర్ బ్లాకులో రూ.1200 ఉండేది. ఇప్పుడు అదే సిలిండర్ సుమారు రూ.2500 వరకు పెంచి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.