Share News

ఎన్‌ఎస్పీ కాలువపై అక్రమ తవ్వకాలు

ABN , Publish Date - Aug 05 , 2026 | 03:02 AM

నగరం చుట్టుపక్కల సాగునీటి కాలువలు, పోరంబోకు స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా ఎన్నెస్పీ కాలువల విస్తరణ కోసమని కొంత భూమిని గతంలో కేటాయించగా అందులో ఇప్పుడు మట్టి తవ్వకాలు చేస్తుండటంతో కరకట్టలు బలహీనపడుతున్నాయి.

ఎన్‌ఎస్పీ కాలువపై అక్రమ తవ్వకాలు
తవ్వకాలతో గోతులమయంగా మారిన వెంగముక్కలపాలెం వద్ద ఎన్నెస్పీ కాలువ కట్ట

వెంగముక్కలపాలెంలో నెలరోజులుగా సాగుతున్న వైనం

రోజుకు ముప్పై ట్రిప్పులపైనే మట్టి రవాణా

వెంచర్లు, స్థలాల్లో మెరకలకు అమ్ముకొంటున్న వ్యాపారులు

ఒంగోలు కార్పొరేషన్‌, ఆగస్టు 4 (ఆంధ్ర జ్యోతి) : నగరం చుట్టుపక్కల సాగునీటి కాలువలు, పోరంబోకు స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా ఎన్నెస్పీ కాలువల విస్తరణ కోసమని కొంత భూమిని గతంలో కేటాయించగా అందులో ఇప్పుడు మట్టి తవ్వకాలు చేస్తుండటంతో కరకట్టలు బలహీనపడుతున్నాయి. ఒంగోలు నగర పరిధిలోని వెంగముక్కలపాలెంలో గత నెల రోజులుగా ఎన్నెస్పీ కాలువ మట్టిని తవ్వేస్తున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు దీనిని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ముఖ్యంగా వెంగముక్కలపాలెం సమీపంలోని ఎన్నెస్పీ కాలువ వద్ద ఎస్కేప్‌ చానల్‌ కింద కొంత స్థలాన్ని అధికారులు వదిలేశారు. వాన లు, వరదలు, తుఫాన్‌ల కారణంగా వరద నీరు ప్రవహించినప్పుడుఎస్కేప్‌ చానల్‌ ద్వారా నీరు దారి మళ్లించడానికి దాన్ని విడిచిపెట్టారు. ఆ స్థలంపై కొందరి కన్నుపడింది. ప్రస్తుతం ఆ కాలువ కింద ఉన్న స్థలంలో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్కో ట్రిప్‌ను రూ.2వేల నుంచి రూ.5వేల వరకు అమ్ముకొంటున్నారు. రోజుకు కనీసం ముప్పై నుంచియాభై ట్రిప్పులతో లారీలు, టిప్పర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో కరకట్టలు బలహీనపడుతున్నాయి. మరోవైపు భారీ గోతులు పెడుతుండటంతో వర్షపు నీరు నిలిచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆ గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అక్రమంగా మట్టి తవ్వకాలపై కొందరు గ్రామస్థులు ఆర్డీవోకు స్వయంగా ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నెస్పీ కాలువ మట్టిని ప్రైవేటు వెంచర్లకు యథేచ్ఛగా తరలించి రూ.లక్షల్లోనే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా మట్టిని తవ్వి అమ్మేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్‌లో ఇలాంటి తరహా మట్టి రవాణాను అరికట్టాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు.

ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా

గతంలో చెరువుకొమ్ముపాలెంలో ఇదేవిధంగా మట్టి తవ్వకాలు జోరుగా సాగాయి. ఆ తర్వాత ఆ గుంతలను పూడ్చిన దాఖలాలు లేవు. అలాగే వదిలేయడంతో రెండు నెలల క్రితం అక్కడి గోతుల్లో వర్షపు నీరు నిలిచి నలుగురు చిన్నారులు మృతిచెందారు. ఆ తర్వాత ఓ చిన్నారి దారి తప్పి ఆ వైపు వెళ్లి నీళ్లలో మునిగి మరణించిన ఘటన అందరినీ కలచివేసింది. ఇష్టారాజ్యంగా మట్టిని తవ్వి అలాగే వదిలేయడం వలననే ప్రమాదాలు చోటుచేసుకున్నాయని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా వెంగముక్కలపాలెంలో ఎన్నెస్పీ ఎస్కేప్‌ చానల్‌లోనూ అలాగే భారీగా గుంతలు చేసి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో ఆ గ్రామ ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Aug 05 , 2026 | 03:02 AM