Share News

కనిగిరిలో 276 ఎకరాల్లో ట్రిపుల్‌ ఐటీ కళాశాల

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:13 PM

కనిగిరి ప్రాంతంలో విద్యాభివృద్ధికి మరో ముందడుగు పడింది. విద్యార్థులకు కేవలం తరగతి గదులు, ప్రయోగశాలలకే పరిమితం కాకుండా చదువు, వసతి, వైద్యం, క్రీడలు, వినోదం, పచ్చదనం అన్నీ ఒకే ప్రాంగణంలో ఉండాలన్న లక్ష్యంతో ట్రిపుల్‌ ఐటీ భారీ క్యాంపస్‌ రూపకల్పనకు కసరత్తు జరుగుతోంది.

కనిగిరిలో 276 ఎకరాల్లో ట్రిపుల్‌ ఐటీ కళాశాల
కళాశాల ఏర్పాటు ప్రాంతాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ఉగ్ర, అధికారులు(ఫైల్‌)

విద్యార్థులకు చదువు, వైద్యం, క్రీడలు, వసతి, వినోదం

సకల సౌకర్యాలతో సమగ్ర ప్రాంగణానికి రూపకల్పన

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర కృషితో విద్యారంగంలో కీలక మలుపు

త్వరలో రూ.25కోట్లతో తొలిదశ నిర్మాణ పనులకు శంకుస్థాపన?

కనిగిరి, ఆగస్టు 16 : కనిగిరి ప్రాంతంలో విద్యాభివృద్ధికి మరో ముందడుగు పడింది. విద్యార్థులకు కేవలం తరగతి గదులు, ప్రయోగశాలలకే పరిమితం కాకుండా చదువు, వసతి, వైద్యం, క్రీడలు, వినోదం, పచ్చదనం అన్నీ ఒకే ప్రాంగణంలో ఉండాలన్న లక్ష్యంతో ట్రిపుల్‌ ఐటీ భారీ క్యాంపస్‌ రూపకల్పనకు కసరత్తు జరుగుతోంది. మొత్తం 276.13 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిపాదిస్తున్న కాలేజీ సముదాయ ప్రణాళికలో 38 రకాల భవనాలు, మౌలిక వసతులకు స్థలాలను ప్రభుత్వం కేటాయించింది. ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర కృషి మేరకు కనిగిరి పట్టణ సమీపంలోని బల్లిపల్లి వద్ద ట్రిపుల్‌ ఐటీ కళాశాల ఏర్పాటుకు కార్యరూపం దాల్చింది.

ప్రతిపాదిత ప్లాన్‌ ప్రకారం క్యాంప్‌సలో విద్యార్థులకు అవసరమైన అన్ని విభాగాలను ఒకేచోట ఏర్పాటుచేసేలా రూపొందించారు. పరిపాలనా భవనం, అకడమిక్‌ బ్లాక్‌తో పాటు ప్రయోగశాలలు, వర్క్‌షా్‌పలు, డ్రాయింగ్‌హాల్‌, లైబ్రరీ, స్టూ డెంట్‌ యాక్టివిటి సెంటర్‌ వంటి వాటికి ప్రత్యేక వసతులు కల్పించనున్నారు. దశలవారీగా వీటిని సమకూరుస్తారు.

వేలాదిమందికి వసతి

ట్రిపుల్‌ ఐటీ క్యాంప్‌సలో విద్యార్థుల వసతి అంశంపై ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి ప్రత్యేక నిపుణులతో చర్చించారు. బాల, బాలికలకు వేర్వేరుగా హాస్టళ్లతో పాటు ప్రధాన క్యాంటిన్‌, వంటశాల వంటివి ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అదేవిధంగా విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని క్యాంప్‌సలో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది.

సిబ్బందికి క్వార్టర్లు

క్యాంప్‌సలోబోధన, బోధనేతర సిబ్బందికి కూడా వసతి సదుపాయాలు కల్పించనున్నారు. ఫ్యాకల్టీ, స్టాఫ్‌ క్వార్టర్‌లు, డైరెక్టర్‌ బంగ్లా, చాన్సలర్‌, వైస్‌ చాన్సలర్‌ గేట్‌ కార్యాలయం, అతిథి గృహాలకు స్థలాలను కేటాయించనున్నారు. విద్యార్థులు, సిబ్బందికి అవసరమైన సేవల కోసం బ్యాంకు, పోస్టాఫీసు కూడా క్యాంప్‌సలో ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు. అంతర్గత సీసీ రోడ్లు, డ్రైయిన్లు, పార్కింగ్‌, ప్రధానగేటు, పైలాన్‌, కాంపౌండ్‌ వాల్‌ వంటి సదుపాయాలతో పాటు విద్యుత్‌ కోసం పవర్‌హౌస్‌, జనరేటర్‌ రూమ్‌ ఏర్పాటు చేయనున్నారు. తాగునీటి కోసం పంప్‌హౌస్‌, వాటర్‌ట్యాంక్‌, ఆర్వో ప్లాంట్‌, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ సదుపాయాలు, మురుగునీటి నిర్వహణకు సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనతో సిద్ధంగా ఉన్నట్లు సమచారం.

క్రీడల కోసం ప్రత్యేక ప్రాంగణం

విద్యతో పాటు శారీరక, మానసిక వికాసానికి ప్రాధాన్యం ఇచ్చేలా వసతులకు పెద్దపీట వేయనున్నారు. క్రికెట్‌, ఫుట్‌బాల్‌ మైదానాలతో పాటు బాస్కెట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌ కోర్టులు కూడా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. అదేవిధంగా జాగింగ్‌ ట్రాక్‌, పాత్‌వేలు, స్విమ్మింగ్‌ పూల్‌తో పాటు తదితర కార్యకలాపాలకు కూడా అవకాశం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా యోగా హాల్‌, ఫుడ్‌కోర్టు, షాపింగ్‌ కాంప్లెక్స్‌, క్లబ్‌హౌస్‌, గెస్ట్‌రూంలతో పాటు ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, బోటింగ్‌ పాయింట్‌ కూడా ఏర్పాటు కానుంది. దాంతోపాటు ఔషధ మొక్కల వనం ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు చేపట్టనున్నారు.


239.71ఎకరాల్లో భవనాలు

అందుబాటులో ఉన్న ప్రణాళిక వివరాల ప్రకారం... మొత్తం ప్లానింగ్‌ ఏరియా 276.13 ఎకరాలుగా ఉండగా, కళాశాల భవనాలకు 239.71 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే ఉన్న అభివృద్ధి చేసిన ప్రాంతం 211.79 ఎకరాలపోనూ ఆక్రమణలో 2.40 ఎకరాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. భవిష్యత్‌ నిర్మాణాలు, రహదారులు, విద్యుత్‌ లైన్లు, తదితరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన భూమిని కూడా ప్రభుత్వం కళాశాలకు బదలాయించనుంది. అన్ని వసతులతోపాటు స్విమ్మింగ్‌ ఫూల్‌, బోటింగ్‌ పాయింట్‌, ఓపెన్‌ ఎయిర్‌ ఽథియేటర్‌,ట్రెకింగ్‌, ఔషధ మొక్కల వనం వంటి సదుపాయాలు ఈ క్యాంప్‌సలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దాదాపు రూ.1000కోట్లు వెచ్చించి రాష్ట్రానికే కనిగిరి ఐఐటీ విద్యారంగానికి తలమానికంగా తీర్చిదిద్దేందుకు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. తొలి విడతగా రూ.25కోట్లతో అతి త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారి జీవన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

కనిగిరి ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే సంకల్పం

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి ప్రాంతం అభివృద్ధి చెంది ఈ ప్రాంత వాసులు వలసల నుంచి బయటపడటంతో పాటు ఉపాధి అవకాశాలు మెండుగా ఏర్పాటు కావాలన్నదే నా సంకల్పం. ఈ ప్రాంతానికి పరిశ్రమలు, విద్యా, ఉపాధి రంగాలకు సంబంధించినవి తీసుకురావాలని అనునిత్యం తపన పడుతుంటా. కనిగిరి సమీపంలో ట్రిపుల్‌ ఐటీ కళాశాల ఏర్పాటై దాదాపు 6వేల మంది విద్యార్థులు కళాశాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి విద్యనభ్యసిస్తుంటే ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి జరిగే అవకాశముంది. షాపులు, స్టాల్స్‌, థియేటర్స్‌, కూరగాయల దుకాణాలు, వస్త్రసముదాయాల ఏర్పాటుతో పాటు రవాణాకు ఆదాయం పెరుగుతుంది. దాదాపు రూ.1000 కోట్లు ప్రాజెక్టును దశల వారీగా పనులు చేపట్టి ఇంజనీరింగ్‌ అంటే కనిగిరి ప్రాంతం అని దేశ,విదేశాలు చెప్పుకోవాలన్నదే నా లక్ష్యం.

Updated Date - Aug 16 , 2026 | 11:13 PM