Share News

తమలపాకుతో కొడితే.. తలుపు చెక్కతో కొడతా...

ABN , Publish Date - Oct 29 , 2026 | 11:33 PM

పొదిలిలో రెండుప్రభుత్వ విభాగాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. విద్యుత్‌ బిల్లు, నీటి కొళాయి బకాయల పేరుతో చర్యకు ప్రతిచర్యకు దిగారు. నగర పంచాయతీ కార్యాలయానికి విద్యుత్‌ శాఖ అధికారులు గురువారం కరెంట్‌ సేవలను నిలిపివేశారు.

తమలపాకుతో కొడితే.. తలుపు చెక్కతో కొడతా...
విద్యుత్‌ కట్‌ చేయడంతో చీకట్లో నగరపంచాయతీ కార్యాలయం, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో నీటి కొళాయి కట్టచేసిన నగరపంచాయతీ అధికారులు

పొదిలి నగర పంచాయతీ, విద్యుత్‌ శాఖల మధ్య ప్రచ్చన్న యుద్ధం

విద్యుత్‌ బిల్లు బకాయి ఉండడంతో నగర పంచాయతీ కార్యాలయానికి కరెంట్‌ కట్‌

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో వాటర్‌ ట్యాప్‌ను తొలగించిన అధికారులు

పొదిలి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : పొదిలిలో రెండుప్రభుత్వ విభాగాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. విద్యుత్‌ బిల్లు, నీటి కొళాయి బకాయల పేరుతో చర్యకు ప్రతిచర్యకు దిగారు. నగర పంచాయతీ కార్యాలయానికి విద్యుత్‌ శాఖ అధికారులు గురువారం కరెంట్‌ సేవలను నిలిపివేశారు. రూ.1.50కోట్ల బకాయి ఉందని చాలారోజులుగా హెచ్చరిస్తున్నా స్పందించకపోవడంతో ఆ శాఖ అధికారులు గురువారం కనెక్షన్‌ కట్‌ చేశారు. వారి చర్యలను జీర్ణించుకోలేని నగరపంచాయతీ అధికారులు వెంటనే విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ కార్యాలయంలో ఉన్న నీటి సరఫరా కొళాయిని తొలగించారు. చాలారోజులుగా హెచ్చరిస్తుండగా, 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలైనా బిల్లులు చెల్లించకుండా తాత్సారం చేశారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నగరపంచాయతీ కార్యాలయానికి విద్యుత్‌ కట్‌ చేశామని ఆశాఖ అధికారులు స్పష్టం చేశారు. అంతేకాకుండా రూ.30లక్షలు చెల్లిస్తామని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి నెలలు గడుస్తున్నా స్పందనలేకపోవ డంతో సేవలు నిలిపివేయాల్సి వచ్చిందని ఏఈ మోహన్‌రెడ్డి తెలిపారు. మీరు విద్యుత్‌ కట్‌ చేస్తే మేము మాత్రం చూస్తూ ఊరుకోవాలా అంటూ నగర పంచాయతీ అధికారులు ప్రతి చర్యలకు పూనుకున్నారు. సబ్‌స్టేషన్‌ కార్యాలయ ఆవరణలో ఉన్న తాగునీటి కొళాయి నగరపంచాయతీ అధికారులు తొలగించడం గమనార్హం. రెండు ప్రభుత్వ కార్యాలయాల్లో సమస్య ఉంటే కూర్చొని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఉన్నా పంతానికిపోయి కొళాయి కట్‌ చేయడం ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు.

Updated Date - Oct 29 , 2026 | 11:33 PM