Share News

ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా

ABN , Publish Date - May 05 , 2026 | 03:11 AM

మార్కాపురం జిల్లాలో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తు న్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆపార్టీ నేతలు భూ బకాసురులుగా మారి రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొల్లగొట్టారు. వాటిని ఆన్‌లైన్‌ చేయిం చుకొని కొందరు అధికారుల ఉద్యోగాలకు కూడా ఎసరు తెచ్చారు.

ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా
ఎర్రగొండపాలెంలో ఆక్రమణకు గురైన వాగు పోరంబోకును పరిశీలిస్తున్న ఆర్డీవో ప్రభాకర్‌ (ఫైల్‌)

వాగులు, వంకలు, ప్రభుత్వ స్థలాల్లో పాగా

గత వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడి వ్యవహారం

రూ.కోట్ల విలువైన భూములు స్వాహా

ఇప్పుడూ అదే పంథా.. పలు ప్రాంతాల్లో వివాదాలు

కొన్నిచోట్ల అడ్డుకుంటున్న రెవెన్యూ అధికారులు

మార్కాపురం, మే 4 (ఆంధ్రజ్యోతి): మార్కాపురం జిల్లాలో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తు న్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆపార్టీ నేతలు భూ బకాసురులుగా మారి రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొల్లగొట్టారు. వాటిని ఆన్‌లైన్‌ చేయిం చుకొని కొందరు అధికారుల ఉద్యోగాలకు కూడా ఎసరు తెచ్చారు. ప్రస్తుత ప్రజాప్రభుత్వం లోనూ అదే పరిస్థితి కొనసా గుతోంది. కొందరు చెరువులు, వాగుపోరంబోకు భూములు, ప్రభుత్వ కార్యాలయాల పక్కన ఉన్న స్థలాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్నిచోట్ల రెవెన్యూ అధికారులు వాటిని అడ్డుకొంటుండగా, మరికొన్ని ప్రాంతాల్లో దర్జాగా కబ్జాల పర్వం కొనసాగుతోంది. ఇటీవల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో చోటుచేసుకున్న భూముల ఆక్రమణ వ్యవహారాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఆక్రమణలు పెచ్చుమీరిపోతున్నాయి. గతంలో ఒక వైసీపీ నాయకుడు శ్మశాన స్థలాన్ని తన వెంచరులో కలుపుకుని ప్లాట్లు వేసేందుకు ప్రయత్నించాడు. రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని సర్వే చేసి శ్మశాన భూమికి హద్దులు నిర్ణయించి హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో ఎర్రగొండపాలెంలో కొందరు వైసీపీ నాయకులు టీడీపీ నేతలతో జతకట్టి వెంచర్లు వేస్తూ రియల్‌ వ్యాపారం చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో తమ వెంచర్లకు పక్కనున్న ప్రభుత్వ భూములను కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల తిరుమలగిరి కాలనీ సమీపంలో సర్వే నెంబరు:555లోని వాగు పోరంబోకును కలుపుకుని వెంచర్‌ వేశారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేరడంతో మార్కాపురం ఆర్డీవో ఆ ప్రాంతానికి వెళ్లి అడ్డుకున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని 203/1లో ప్రభుత్వ భూమిని కబ్జాచేసి వెంచరు వేయడంతో రెవెన్యూ అధికారులు గుర్తించి అడ్డుకున్నారు. గతంలో ఎర్రగొండపాలెం- పుల్లలచెరువు రోడ్డులో ఒక వెంచరు నిర్వాహకులు ప్రభుత్వ భూమిలో పాగా వేసేందుకు ప్రయత్నించగా రెవెన్యూ అధికారులు నిలువరించారు.

దోర్నాలలోనూ ఇదే తంతు

దోర్నాల పట్టణంలో కూడా రెండ్రోజుల క్రితం ఆక్రమణ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒక ప్రభుత్వ కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో రాత్రికిరాత్రే మట్టిని తోలి చదును చేసినట్లు గుర్తించారు. ఎవరు చేశారో అధికారులకు తెలిసినప్పటికీ వారికి కనీసం నోటీసులు ఇచ్చి చర్యలకు ఉపక్రమించకుండా ఉదాసీన వైఖరి అవలంబించారు. ఎవరో టీ దుకాణం కోసం చదును చేసి ఉంటారులే, ఇకమీదట అటువంటివి జరగవు అని పంచాయతీ అధికారులు చెప్పడం గమనార్హం. ఇలా నిత్యం ఎక్కడో ఒకచోట ఆక్రమణల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ భూముల్లో అక్రమార్కులు పాగా వేయడం, రెవెన్యూ అధికారులు అడ్డుకుని తొలగించడం జరుగుతోంది. కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇటువంటి అక్రమణలకు అడ్డుకట్ట పడదని ప్రజలు అంటున్నారు.

నకిలీ పట్టాతో చెరువు రోడ్డు ఆక్రమణకు యత్నం

పుల్లలచెరువులో చెరువు రోడ్డుకు మట్టితోలి చదునుచేసే పనికి కొందరు పూనుకోవడంతో రెండ్రోజుల క్రితం గ్రామస్థులు అడ్డుకున్నారు. రోడ్డును ఎందుకు చదునుచేస్తున్నారని ప్రశ్నించడంతో తమకు పట్టా ఉందని ఆక్రమణదారులు ఎదురుతిరిగారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకొంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. కలెక్టర్‌, ఆర్డీవోకు ఫిర్యాదులు వెళ్లడంతో తక్షణమే రోడ్డుకు అడ్డుగా వేసిన మట్టి, ముళ్లకంప తొలగింపునకు చర్యలు తీసుకున్నారు. కాగా ఆక్రమణకు యత్నిస్తున్న వారి వద్ద ఉన్న పట్టా అసలు ఎలా వచ్చిందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. పట్టాను చనిపోయిన తహసీల్దార్‌ సంతకంతో తెచ్చారని చెప్పుకుంటున్నారు. అందులోని సంతకాల్లో తేదీలు కూడా మూడుచోట్ల మూడు విధాలుగా ఉన్నాయంటున్నారు. రెవెన్యూ, పోలీసుశాఖ నిగ్గుతేల్చి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - May 05 , 2026 | 03:11 AM