Share News

వసూలు చేయకుంటే వేటే!

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:08 AM

గ్రామ పంచాయతీలలో ఇంటి పన్నుల వసూలు ముందుకు సాగడం లేదు. ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం వెనుక సంబంధిత పంచాయతీ అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం ఉందని జిల్లా అధికారులు భావిస్తున్నారు. అలాంటి వారికి ఇప్పటికే షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు.

వసూలు చేయకుంటే వేటే!
ఒంగోలులోని డీపీవో కార్యాలయం

మూడు నెలల నుంచి ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్‌

ఉమ్మడి జిల్లాలో రూ.46కోట్లకు రూ.10కోట్లే రాబట్టిన వైనం

కొన్ని చోట్ల మూడు శాతం లోపే!

షోకాజ్‌ నోటీసులు ఇచ్చినా రాని మార్పు

మండలస్థాయిలో డిప్యూటీ ఎంపీడీవోల పర్యవేక్షణ అంతంతమాత్రమే

ఒక పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

మరో నలుగురిపై చర్యలకు సిఫార్సు

ఒంగోలు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలలో ఇంటి పన్నుల వసూలు ముందుకు సాగడం లేదు. ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం వెనుక సంబంధిత పంచాయతీ అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం ఉందని జిల్లా అధికారులు భావిస్తున్నారు. అలాంటి వారికి ఇప్పటికే షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. అయినా స్పందన లేకపోవడంతో కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 729 గ్రామపంచాయతీల్లో 2024-25 ఆర్థిక సంవత్సరా నికి సంబంధించి సుమారు రూ.10 కోట్లు బకాయిలు పెండింగ్‌ ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.36 కోట్లు కలిపి రూ.46 కోట్ల వరకు ఇంటి పన్నులు వసూలు చేయాల్సి ఉంది. గత ఎనిమిది నెలల్లో ఇప్పటి వరకు రూ.10 కోట్లు మాత్రమే రాబట్టారు. ఇంకా రూ.36 కోట్లు పెండింగ్‌లో ఉండటంతో వసూళ్లను వేగవంతం చేసేందుకు కలెక్టర్‌ రాజాబాబు ఆదేశాలతో డీపీవో ఎం.వెంకటేశ్వరరావు ప్రతిరోజూ మండల స్థాయి అధికారులతో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 729 గ్రామ పంచాయతీల్లో నాలుగు పంచాయతీలు మాత్రమే నూరుశాతం పన్ను వసూలు చేశాయి. మరికొన్ని పంచాయతీల్లో 70 నుంచి 80శాతం మేర రాబట్టారు. కొన్నింటిలో అయితే ఒకటి నుంచి మూడు శాతంలోపు మాత్రమే ఇంటి పన్నులు కట్టించారు. ఇంటి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యంగా ఉన్న జిల్లాలోని 117 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నోటీసులు జారీ చేసిన తర్వాత 100 పంచాయతీల్లో పది శాతానికిపైగా ఇంటి పన్నులు వసూలు చేశారు. 20 పంచాయతీల్లో అది కేవలం ఒకటి నుంచి మూడున్నరశాతం లోపు మాత్రమే ఉంది.

చర్యలకు రంగం సిద్ధం

ఇంటి పన్నులపై నిరంతరం పరిశీలన చేస్తూ తక్కువ వసూలు చేసిన పంచాయతీ కార్యదర్శులకు దిశానిర్దేశం చేయాల్సిన డిప్యూటీ ఎంపీడీవోలు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పన్ను వసూళ్లలో నిర్లక్ష్యంగా ఉన్న ఉద్యోగులు, అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. షోకాజ్‌ నోటీసులకు సమాధానం కోసం ఇచ్చిన సమయం పూర్తికావడంతో ఇప్పటికే ఒక పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేయగా, మరో నలుగురిపై చర్యలకు సిఫార్సు చేశారు. త్వరలో నిర్లక్ష్యంగా ఉన్న డిప్యూటీ ఎంపీడీవోలపైనా చర్యలు తీసుకునేందుకు కూడా జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు.

Updated Date - Feb 03 , 2026 | 03:08 AM