సంస్కారహీ నంగా ప్రవర్తిస్తే ప్రజలే బుద్ధి చెబుతారు
ABN , Publish Date - Sep 17 , 2026 | 11:06 PM
వైసీపీ నేతలు చిల్లర మాటలతో సంస్కారహీనంగా ప్రవర్తిస్తే ప్రజలే వారికి తగినబుద్ధి చెబుతారని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హెచ్చరించారు.
వైసీపీ నేతలకు ఎమ్మెల్యే ఇంటూరి హెచ్చరిక
వెలిగొండ నుంచి కందుకూరు ప్రాంతానికి తాగు, సాగునీరు
కందుకూరు, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతలు చిల్లర మాటలతో సంస్కారహీనంగా ప్రవర్తిస్తే ప్రజలే వారికి తగినబుద్ధి చెబుతారని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. రాజకీయంగా ఉన్నత స్థాయికి వెళ్లినా కొందరు వైసీపీ నేతల వ్యవహారం సంస్కారహీనంగా ఉందని ఎద్దేవాచేశారు. తాను సర్పంచి స్థాయి నుంచి వచ్చానని, వారి దగ్గర రాజకీయం నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మాలకొండ, టీటీడీ సిఫార్సులు లాంటి విషయాలపై అబద్ధాలు మాట్లాడటానికి వైసీపీ నేతలు సిగ్గుపడాలన్నారు. తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నా ప్రతిరోజు రాళ్లు వేయటమే పనా అని ప్రశ్నించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి గురించి మీరు పట్టించుకున్నారా అని నాగేశ్వరరావు ప్రశ్నించారు. వెలిగొండ ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా కందుకూరు నియోజకవర్గానికి కూడా నీరు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తిచేయగా తొలుత తాగునీటికి నీరు అందిస్తామని ఆ తర్వాత సాగునీటికి కూడా నీరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రానున్న స్థానికసంస్థల ఎన్నికలలో అన్నిస్థానాలను కైవసం చేసుకుంటామని తెలిపారు. టీడీపీ నాయకులు దామా మల్లేశ్వరరావు, బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, రాచగర్ల సుబ్బారావు, జనిగర్ల నాగరాజు, మాదాల లక్ష్మీనరసింహ్మం, బెజవాడ ప్రసాద్, షేక్ రఫి, చదలవాడ కొండయ్య, షేక్ సలాం పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
సీఎం సహాయనిధి పథకం ద్వారా నియోజకవర్గంలోని 93మందికి వైద్యసహాయం కోసం మంజూరైన రూ. 84 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బాధిత కుటుంబాలకు గురువారం అందజేశారు. తక్షణ సహాయం కింద 21మందికి రూ. 38లక్షల ఎల్‌వోసీలు, వైద్యచికిత్సల అనంతరం 72మందికి రూ. 42 లక్షల ఆర్థిక సహాయం అందించారు.