Share News

సమన్వయంతో పనిచేయకపోతే ఉపేక్షించను!

ABN , Publish Date - Oct 10 , 2026 | 01:46 AM

‘ఒక నియోజకవర్గంలో పార్టీలో ఇద్దరు, ముగ్గురు నాయకులు ఉంటే వారందరూ సమన్వయంతో పనిచేసి స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను రాబట్టాలి. అలాకాకుండా ఫలితాలలో తేడా వచ్చి సారీ చెబితే ఉపేక్షించను. ఆపై అలాంటి వారితో మాట్లాడను. నా వద్ద సేవచేసే వారికి, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే వారికే స్థానం ఉంటుంది’ అని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయు డు ఆ పార్టీ నాయకులకు స్పష్టం చేశారు.

సమన్వయంతో పనిచేయకపోతే ఉపేక్షించను!
టీడీపీ కొండపి నియోజకవర్గ శ్రేణులతో సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, వేదికపై మంత్రులు ఆనం, స్వామి, ఎంపీ మాగుంట, పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఉగ్ర, మారిటైం బోర్డు చైర్మన్‌ సత్య, ఇతర నేతలు

ఫలితాలలో తేడా వచ్చి సారీ అంటే ఊరుకోను

టీడీపీ నేతలకు చంద్రబాబునాయుడు హెచ్చరిక

కొండపి కార్యకర్తల సమావేశంలో స్పష్టం

ుంత్రి స్వామి, సత్యలపై ప్రత్యేక కామెంట్లు

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

‘ఒక నియోజకవర్గంలో పార్టీలో ఇద్దరు, ముగ్గురు నాయకులు ఉంటే వారందరూ సమన్వయంతో పనిచేసి స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను రాబట్టాలి. అలాకాకుండా ఫలితాలలో తేడా వచ్చి సారీ చెబితే ఉపేక్షించను. ఆపై అలాంటి వారితో మాట్లాడను. నా వద్ద సేవచేసే వారికి, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే వారికే స్థానం ఉంటుంది’ అని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయు డు ఆ పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. మీ భూమి-మీహక్కు కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు పాలేరు ప్రాజెక్టు పనుల శంకుస్థాపనకు శుక్రవారం ఆయన కొండపి నియోజకవర్గానికి వచ్చారు. అధికారిక కార్యక్రమాల అనంతరం నియోజకవర్గంలోని పార్టీ నాయకులతో జరుగుమల్లి మండలం నర్సింగోలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సందర్భంగానూ, అంతకు ముందు సభలోనూ ఆయన పాలన, పార్టీపరమైన అంశాలపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాష్ట మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్యనారాయణ(సత్య) నియోజకవర్గ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల వారిద్దరి మధ్య అభిప్రాయభేదాలు చోటుచేసుకున్నాయనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఇద్దరు, ముగ్గురు ముఖ్య నాయకులు ఉన్న నియోజకవర్గాల్లో అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాల్సిందేనంటూ వ్యాఖ్యానించారు. అంతేకాక మంత్రి స్వామి మంచివాడు, సౌమ్యుడంటూ పార్టీ పటిష్టతలో సమర్థుడుగా పేరొందిన సత్య ఆయనతో సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. ఇద్దరూ కలిసి ముందుకు సాగితేనే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. అలాకాకుండా చివరకు ఫలితాల్లో తేడాలు వచ్చి సారీ అంటే కుదరదని హెచ్చరించారు. అంతకుముందు మంత్రి స్వామిని ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా పోరాటాలు చేసిన ఘనుడని కొనియాడారు. దివంగత మంత్రి దామచర్ల ఆంజనేయులును గుర్తుకు తెచ్చుకొని ప్రజాసేవలో, పార్టీ కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఆలాగే దామచర్ల కుటుంబం ముందుకు సాగాలని సూచిస్తూ కొండపి నియోజకవర్గంలో మంచి ఫలితాలను సాధిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని కిందిస్థాయి నాయకుల పనితీరును ఆయన సమీక్షించారు. కొన్ని గ్రామాల్లో పార్టీ వేగంగా బలపడిందని, కొన్నిచోట్ల ఆస్థాయిలో లేకపోవడానికి స్థానిక నాయకుల వైఫల్యమేకారణమని ఆయా గ్రామాల పరిస్థితిని వివరించారు. సమావేశంలో మంత్రి స్వామి, సత్యతోపాటు జిల్లాకు చెందిన మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు ఉగ్రనరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2026 | 01:46 AM