Share News

గప్‌చుప్‌..

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:56 PM

పార్టీ నాయకుడు హఠాన్మరణం నేపథ్యంలో అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన జగన్‌ పర్యటనను శవ రాజకీయం చేసేందుకు ఆ పార్టీలోని కొందరు నాయకులు విశ్వప్రయత్నం చేశారు. మరోవైపు జగన్‌ను చూసేందుకు వచ్చిన ఆ పార్టీ శ్రేణులలో కొందరు చిందులు తొక్కుతూ తొడలు కొడుతూ సవాళ్లు విసురుతూ మేమింతే మారమంతే అన్న తరహాలో ప్రవర్తించారు.

గప్‌చుప్‌..
ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్‌, చొక్కాలు విప్పి యువకుల వీరంగం

పెదవి విప్పని జగన్‌

శవ రాజకీయానికి ప్రాధాన్యతనిచ్చిన నాయకులు

చిందులు తొక్కటం, తొడకొట్టడం మానని వైసీపీశ్రేణులు

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

పార్టీ నాయకుడు హఠాన్మరణం నేపథ్యంలో అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన జగన్‌ పర్యటనను శవ రాజకీయం చేసేందుకు ఆ పార్టీలోని కొందరు నాయకులు విశ్వప్రయత్నం చేశారు. మరోవైపు జగన్‌ను చూసేందుకు వచ్చిన ఆ పార్టీ శ్రేణులలో కొందరు చిందులు తొక్కుతూ తొడలు కొడుతూ సవాళ్లు విసురుతూ మేమింతే మారమంతే అన్న తరహాలో ప్రవర్తించారు. జగన్‌ మాత్రం హెలిప్యాడ్‌ నుంచి దివంగత నేత కాకుమాను రాజశేఖర్‌ ఇంటివరకు తనను అనుసరించిన కార్యకర్తలకు నమస్కారం చేస్తూ చిరునవ్వుతోనే ముందుకు సాగారు. పరామర్శ అనంతరం కూడా ఆయన కార్యకర్తలనుద్దేశించి కాకపోయినా గతంలో వలే మీడియాను ఉద్దేశించి కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు. అయితే ఈ మొత్తం తంతులో జగన్‌ రాజశేఖర్‌ కుటుంబ పరామర్శకు తక్కువ సమయం కేటాయించటం చర్చనీయాంశమైంది.

అదే తీరుగా ఆరోపణలు

ఇటీవల ఒంగోలుకు చెందిన వైసీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాని రాజశేఖర్‌ హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన మృతిని ప్రభుత్వ హత్యగా ప్రచారం చేసేందుకు వైసీపీ నాయకులు అన్ని ప్రయత్నాలు చేశారు. మంగళవారం రాజశేఖర్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్‌ వచ్చిన సందర్భంగా కూడా వారు అదేతరహాలో ప్రవర్తించారు. కాకుమాను రాజశేఖర్‌ ఇంటి వద్ద జగన్‌కు చెందిన సాక్షి మీడియాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ రాజశేఖర్‌ మృతికి ప్రభుత్వమే కారణమని చెప్పే ప్రయత్నం చేయటంతోపాటు దళిత మంత్రులైన హోంమంత్రి అనిత, జిల్లాకు చెందిన మంత్రి స్వామిపై ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. తొలుత ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ విజయవాడలో శాప్‌ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని ఆపై పోలీసులు వెంటాడుతున్నారన్న భయంతో ఉత్కంఠకు గురై రాజశేఖర్‌ మృతిచెందాడని ఆరోపణ చేశారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ జిల్లాకు చెందిన మంత్రి స్వామి దళిత మంత్రి అయి ఉండి రాజశేఖర్‌ మృతి అనంతరం కుటుంబాన్ని పరామర్శించకపోగా వైసీపీ నాయకుల ప్రకటనలను ఖండిస్తూ మాట్లాడటం తగదన్నారు.ప్రధానంగా టీడీపీ శవ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ అయితే హోంమంత్రి అనిత పరామర్శించకపోవటాన్ని తప్పుబట్టడమే గాక మంత్రి స్వామిని వాడు వీడు అంటూ మాట్లాడారు. విజయవాడ కార్యక్రమంలో పోలీసుల పిడిగుద్దులు, ఆపై అతని అరెస్టుకు ప్రభుత్వం ఉసిగొల్పటం వల్లనే చనిపోయాడని పోలీసులపైన కేసు పెట్టాలంటూ మాట్లాడారు. ఇదంతా జగన్‌ స్థానిక ఏబీఎం గ్రౌండ్‌లో హెలికాఫ్టర్‌ దిగి రాజశేఖర్‌ ఇంటికి పరామర్శకు వచ్చేలోపు వీరి ప్రసంగాలను ప్రసారం చేశారు.


పరామర్శలోనూ చిరునవ్వులు

జగన్‌ హెలికాఫ్టర్‌ నుంచి దిగిన తర్వాత రెండు చేతులతో అందరికీ నమస్కరిస్తూ కారు బయట నిలబడి కిలోమీటరు దూరంలో ఉన్న రాజశేఖర్‌ ఇంటి వరకు ప్రయాణించారు. 12.22కు రాజశేఖర్‌ ఇంటి వద్దకు చేరిన జగన్‌ 12.24కు ఇంట్లోకి ప్రవేశించారు. 12.25కు చిత్రపటానికి నివాళులర్పించి ఇంట్లోని పైభాగానికి వెళ్లి 12.27 నుంచి రాజశేఖర్‌ కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడారు. జగన్‌ సహజ లక్షణం కాబోలు వారిని పరామర్శించే సమయంలో కూడా చిరునవ్వులు చిందిస్తూనే ఉండటం విశేషం. ఆ తర్వాత మరో ఐదు నిమిషాలు అక్కడున్న పార్టీ నాయకులతో మాట్లాడి బయటకొచ్చేశారు. అక్కడి నుంచి నేరుగా కారులో హెలిప్యాడ్‌ వద్దకు వెళ్లి తాడేపల్లి వెళ్లారు. గతంలో ఇలాంటి పర్యటనకు వెళ్లినప్పుడు మీడియాతో మాట్లాడి మృతిచెందిన వారికి నివాళులర్పించటం, తాను తమ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పటం జరిగేది. ఇక్కడ ఆ పార్టీ నాయకులు ప్రభుత్వం ప్రత్యేకించి పోలీసుల ఒత్తిడే రాజశేఖర్‌ మృతికి కారణమని ఆరోపిస్తున్నా జగన్‌ వెళ్లేటప్పుడు మీడియాతో కానీ కార్యకర్తలతో కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా వెళ్లారు.

జగన్‌ ఉన్నంత సేపు తొడలుకొట్టిన వైసీపీ శ్రేణులు

జగన్‌ను చూడటానికి వచ్చిన కార్యకర్తల్లో మాత్రం కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఆయన రాగానే సీఎం.. సీఎం అంటూ నినాదాలివ్వటంతోపాటు దారి పొడవునా తొడలు కొడుతూ చిందులు వేస్తూ జెండాలు ఊపుతూ రకరకాల విన్యాసాలు ప్రదర్శించారు. మృతుని కుటుంబ పరామర్శకు వస్తున్న జగన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి, తరలిరండి అంటూ ఆ పార్టీలోని కొందరు నాయకులు జనసమీకరణ చేయటం గమనార్హం. అద్దంకి వైసీపీ ఇన్‌చార్జి అయితే జగన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి, తరలిరండి అంటూ సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం చేశారు. దీంతో జగన్‌ ఆ కుటుంబసభ్యులకు ఎలాంటి ఓదార్పు ఇచ్చారో కానీ రాజకీయ పరామర్శగా కార్యక్రమం మారిపోయింది.

Updated Date - Sep 29 , 2026 | 11:56 PM