Share News

నల్లమలలో వేట

ABN , Publish Date - Aug 05 , 2026 | 03:05 AM

గిద్దలూరు అటవీ డివిజన్‌ రాచర్ల బీట్‌ పరిధిలో వెలుగుచూసిన పులి మరణానికి కారణం వేటగాళ్లేనని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని మంగళవారం వెల్లడించారు. నల్లమలలో వేటగాళ్ల చర్యలు కొనసాగుతున్నాయని దీనితోపాటు మరికొన్ని ఘటనలు రుజువు చేస్తున్నాయి.

నల్లమలలో వేట
వివరాలను వెల్లడిస్తున్న నల్లమల టైగర్‌ ప్రాజెక్టు డీడీ నిషాకుమారి

పులిని చంపింది వేటగాళ్లే!

ఏడుగురి అరెస్ట్‌

కొనసాగుతున్న దర్యాప్తు

మార్కాపురం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): గిద్దలూరు అటవీ డివిజన్‌ రాచర్ల బీట్‌ పరిధిలో వెలుగుచూసిన పులి మరణానికి కారణం వేటగాళ్లేనని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని మంగళవారం వెల్లడించారు. నల్లమలలో వేటగాళ్ల చర్యలు కొనసాగుతున్నాయని దీనితోపాటు మరికొన్ని ఘటనలు రుజువు చేస్తున్నాయి. గతేడాది ఎర్రగొండపాలెం సమీపంలో గంజివారిపల్లె బీట్‌ పరిధిలో పెద్దపులికి వేటగాళ్లు వేసిన ఉచ్చులో చిక్కుకుని మృత్యువాత పడింది. శాఖాపరంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో అప్పట్లో కొందరు అటవీ ఉద్యోగులపై వేటు వేశారు. తాజాగా రాచర్ల బీట్‌లో పులిని వేటగాళ్లు చంపినట్లు తేల్చారు.

రాచర్ల బీట్‌ పరిధిలో ఏం జరిగిందంటే..

రాచర్ల బీట్‌ పరిధిలో గతనెల 31న పులి కళే బరాన్ని గుర్తించారు. అప్పటికి దాదాపు 10 రోజుల క్రితమే అది మృతి చెంది ఉంటుందని నిర్ధారించారు. దాని కాళ్లు నరికి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌గా స్పందించడంతో అటవీశాఖ ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగారు. ఇది వేటగాళ్ల పనేనని విచారణలో గుర్తించారు. మొదట ఇద్దరిని అదుపులోకి తీసుకున్న అధికారులు వారి ప్రమేయం లేదని నిర్ధారించుకొని వదిలేశారు. తరువాత ఐదుగురిని విచారించారు. మరో ఇద్దరిని వారితో కలిపి విచారించి మొత్తంమీద ఏడుగురిని అరెస్ట్‌ చూపారు. అయితే విలేకరుల సమావేశంలో నిందితుల పేర్లు వెల్లడించలేదు. ఇంకా పలువురి ప్రమేయం ఉందన్న సమాచారం అధికారుల ద్వారా తెలుస్తోంది. అరెస్ట్‌ చేసిన ఏడుగురిలో ఒక వ్యక్తి గతంలో అటవీశాఖలో పనిచేసిన చిరుద్యోగి అని సమాచారం. అతనికి ముఖ్య అనుచరునిగా ఉన్న వ్యక్తి ద్వారా ఈ వేట జరిగినట్లు తెలుస్తోంది.

నాటు తుపాకీతో కాల్చి.. ఎడ్ల బండిలో తరలించి..

విశ్వసనీయ సమాచారం మేరకు జేపీ చెరు వు సమీపంలోని ఒక అరటితోట వద్ద విద్యుత్‌ కంచెకు తగిలి కింద పడిన పులిని నాటు తుపాకీతో కాల్చినట్లు తెలుస్తోంది. ఆ తరువాత దానిని ఎద్దుల బండిపై అడవిలోకి తీసుకెళ్లినట్లు సమాచారం. పులి కళేబరాన్ని బండి పైకి చేర్చి తీసుకెళ్లేందుకు ఎక్కువ మంది సహాయం అవసరమనేది అర్థమవుతుంది. దాదాపు నాలుగు కి.మీపైగా అడవిలోకి తీసుకెళ్లిన తరువాత దాని కాళ్లు నరికి తీసుకెళ్లినట్టు తెలిసింది. నిందితులను అరెస్ట్‌ చేయటంతోపాటు వారి వద్ద నుంచి ఏడు గోళ్లు స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు.

మిగిలిన గోళ్ల సంగతేంటి?

పులి పంజాలో ముందుభాగంలోని కాళ్లకు ఐదేసి చొప్పున 10 గోర్లు, వెనుక భాగంలో నాలుగు చొప్పున 8 గోర్లు ఉంటాయి. అంటే మొత్తం 18 గోర్లు ఉంటాయి. మరి ఏడు గోర్లు దొరికితే మిగిలిన వాటి సంగతి తేలాల్సి ఉంది. మరోవైపు దాదాపు పది రోజులుగా పులి కళేబరం అక్కడ పడి ఉన్నా గుర్తించలేకపోవడానికి అటవీశాఖ సిబ్బంది నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. దీంతోపాటు ఈ ఘటనలో ఇంకా ఇతరుల ప్రమేయం, అటవీ సిబ్బంది పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్టు సమాచారం. మొత్తానికి నల్లమలలో వేటను నిలువరించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.

Updated Date - Aug 05 , 2026 | 03:05 AM