15లోపు నూరుశాతం ఇంటి పన్ను వసూలు చేయాలి
ABN , Publish Date - Feb 05 , 2026 | 02:37 AM
ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఇంటి పన్నులను ఈనెల 15వతేదీ నాటికి నూరుశాతం వసూలు చేయాలని పంచాయతీరాజ్ ఓఎస్‌డీ ఆనంద్ ఆదేశించారు. ఒంగోలులోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాలులో బుధవారం ఇంటి పన్నులు, చెత్త సేకరణపై ప్రకాశం, మార్కాపురం జిల్లాల డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
పంచాయతీల వారీగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలి
పీఆర్ ఓఎస్‌డీ ఆనంద్ ఆదేశం
డిప్యూటీ ఎంపీడీవోలు, కార్యదర్శులతో సమావేశం
పక్షం రోజుల్లో మరోసారి సమీక్ష ఉంటుందని వెల్లడి
ఒంగోలు కలెక్టరేట్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి) : ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఇంటి పన్నులను ఈనెల 15వతేదీ నాటికి నూరుశాతం వసూలు చేయాలని పంచాయతీరాజ్ ఓఎస్‌డీ ఆనంద్ ఆదేశించారు. ఒంగోలులోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాలులో బుధవారం ఇంటి పన్నులు, చెత్త సేకరణపై ప్రకాశం, మార్కాపురం జిల్లాల డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పన్నుల వసూళ్లల్లో నిర్లక్ష్యం వీడాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అందుకు అనుగుణంగా ప్రక్రియను చేపట్టేలా డిప్యూటీ ఎంపీడీవోలు పర్యవేక్షించాలని సూచించారు. ఒక మండలంలో రెండు మేజర్ పంచాయతీలు ఉండి, మిగిలినవి చిన్న పంచాయతీలు అయితే మేజర్ పంచాయతీల్లో వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. ఈనెల 15వతేదీ నాటికి పూర్తిస్థాయిలో పన్నులు వసూలు చేయకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా ప్రభుత్వం తడి చెత్త, పొడి చెత్త వేరుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్నందున నిరంతరం కార్యదర్శులు క్షేత్రస్థాయిలోనే ఉండి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తద్వారా మంచి ఫలితాలు రావడమే కాకుండా ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో కూడా మెరుగైన ఫీడ్‌బ్యాక్ వస్తుందన్నారు. పంచాయతీల్లో ఆదాయ వనరులను పెంచుకునేందుకు చెత్త నుంచి సంపద వినియోగ కేంద్రాలను వినియోగంలోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ కేంద్రాల ద్వారా వచ్చే వర్మీ కంపోస్టును ప్రతి గురువారం పంచాయతీ పరిధిలో అమ్మకాలు పెట్టి ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా వందశాతం ఇంటి పన్ను వసూలు చేసిన పంచాయతీ కార్యదర్శులు, ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో నూరుశాతం సాధించిన వారికి మెరిట్ సర్టిఫికెట్లను ఆనంద్ అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చందన, జడ్పీ సీఈవో చిరంజీవి, డీపీవో ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.