ఓట్ల నమోదుకు భారీ స్పందన
ABN , Publish Date - Aug 22 , 2026 | 03:09 AM
జిల్లాలో ఓట్ల నమోదుకు భారీ స్పందన కనిపించింది. వివిధ కారణాలతో తొలగించిన ఓట్లతోపాటు సర్ ప్రక్రియ సమయంలో అందుబాటులో లేని వారు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.
కొత్త ఓట్ల కోసం ఆన్‌లైన్‌లో 6,250 దరఖాస్తులు
సవరణ కోసం మరో 8వేలు
నేడు, రేపు మాన్యువల్‌గా తీసుకునేందుకు స్పెషల్ డ్రైవ్
2002 నాటి వివరాలు నమోదు చేస్తేనే స్వీకరణకు అవకాశం
ఒంగోలు కలెక్టరేట్, ఆగస్టు 21 (ఆంఽధ్రజ్యోతి) : జిల్లాలో ఓట్ల నమోదుకు భారీ స్పందన కనిపించింది. వివిధ కారణాలతో తొలగించిన ఓట్లతోపాటు సర్ ప్రక్రియ సమయంలో అందుబాటులో లేని వారు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. గత 20రోజుల వ్యవధిలో జిల్లా ్లవ్యాప్తంగా సుమారు 14వేలకుపైగా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. అందులో ఓటు కోరుతూ 6,250 ఉన్నాయి. ప్రస్తుతం ముసాయిదా ఓటర్ల జాబితాలో సవరణ కోసం మరో 8వేల వరకూ ఆన్‌లైన్‌లో వచ్చాయి. సవరణ కోసం వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా పుట్టిన తేదీతోపాటు పేర్లలో అక్షర దోషాలకు సంబంధించివి ఉన్నట్లు సమాచారం. మరోవైపు సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత వివిధ కారణాలతో 1.92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయగా వారు పత్రాల సమర్పణ కొనసాగుతోంది.
రెండు రోజులు దరఖాస్తుల స్వీకరణ
ఓటు కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోలేని వారి కోసం శని, ఆదివారాల్లో పోలింగ్ కేంద్రాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో మాన్యువల్‌గానే దరఖాస్తులు స్వీకరించనున్నారు. జిల్లాలోని 1,715 పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. అయితే మాన్యువల్‌గా ఓటు కోసం దరఖాస్తు చేసుకునే ఓటర్లు తప్పనిసరిగా 2002కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను కూడా ఇవ్వాల్సి ఉంది. అందుకోసం రాజకీయ పార్టీలకు చెందిన బూత్‌లెవల్ ఏజెంట్లకు కూడా సమాచారాన్ని అందించారు. శని, ఆదివారాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.